తొమ్మిది రోజులైనా ఆచూకీ లేదు
మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో చేతులెత్తేసిన సర్కారు
నిత్యం ఎక్కడో ఒకచోట కిడ్నాప్, మిస్సింగ్ కేసులు
అయినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
శాంతి భద్రతలు దిగజారడంతో సామాన్యుల్లో ఆందోళన
మదనపల్లె/రాయచోటి: ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లి స్వర్ణకుమారి(62) మదనపల్లెలో కిడ్నాప్ అయ్యారు. గత నెల 28న ఆమె అదృశ్యమై ంది. 9 రోజులు కావస్తున్నా నేటికీ జాడ కనుక్కోలేని పరిస్థితి చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది. మదనపల్లె శివారు వైఎస్ జగన్ కాలనీలో సీఐ తల్లి స్వర్ణకుమారి ఒంటరిగా నివసిస్తోంది. సెప్టెంబర్ 28న మధ్యాహ్నం ఆమె స్నేహితురాలు స్వర్ణకుమారికి ఫోన్ చేస్తే కాల్ ఫార్వర్డ్ వాయిస్ వినిపించింది. సాయంత్రమైనా ఆమె ఇంటికి చేరుకోలేదు. ఆమెకు దైవభక్తి అధికం కావడంతో తెలిసిన వారితో కలిసి దూరప్రాంతంలోని గుడికి వెళ్లిందేమోనని స్నేహితురాలు భావించింది.
కాగా, అక్టోబర్ 1న పెన్షన్ తీసుకునేందుకు స్వర్ణకుమారి రాకపోవడంతో స్థానికులు ఆ విషయాన్ని కుమారుడైన సీఐ నాగేంద్రప్రసాద్‌కు తెలిపారు. దీంతో ఆయన మదనపల్లెకు చేరుకుని తల్లి ఆచూకీ కోసం విచారించారు. మూడు రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో అక్టోబర్ 2న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీఐ కళా వెంకటరమణ అదృశ్యం కేసుగా నమోదుచేసి విచారణ చేపట్టారు. స్వర్ణకుమారి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటం, టవర్ లొకేషన్ ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తుండటంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. స్వర్ణకుమారి అదృశ్యం పట్టణంలో చర్చనీయాంశం కాగా.. ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. వెంకటేశ్ అనే యువకుణ్ణి బెంగళూరులో పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.
సీఐ తల్లికే దిక్కులేకపోతే?
సీఐ తల్లి అదృశ్యమైతేనే ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని జనం చర్చించుకుంటున్నారు. ముందెన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో చిన్నారులు, మహిళలను కిడ్నాప్ చేసి అంతమొందించడం లాంటి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో 9 రోజులైనా సీఐ తల్లి ఆచూకీ తెలియలేదంటే.. ఆమె విషయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై వరుస అఘాయిత్యాలు భయపెడుతున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో వాసంతిని, పుంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్‌ను తుదముట్టించిన ఘటనలు శాంతిభద్రతలను ప్రశ్నార్థకంగా మార్చాయి. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకపోవడంతో బాధితులు శవాలుగా మారిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు.
పేపర్లకు ఉన్న విలువ ప్రాణాలకు లేదా?
మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో కాగితాలు తగలబడితే చంద్రబాబు రాష్ట్ర డీజీపీని హెలికాప్టర్‌లో పంపించి దర్యాప్తు చేయించారు. అయితే.. బాలికలు, మహిళలను అపహరించుకుని పోయి అత్యాచారాలు చేస్తున్నా, హత్యలకు తెగబడుతున్నా పట్టించుకోవడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment