tondangi
-
‘దివీస్' యాజమాన్యంతో మంత్రి గౌతమ్‌రెడ్డి భేటీ
సాక్షి, అమరావతి: ప్రజల అభ్యంతరాలు, సందేహాల నివృత్తి జరిగే వరకూ 'దివీస్' ఒక్క ఇటుక కూడా కదపకూడదని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతులు, మత్స్యకారులు, స్థానికుల ఆందోళనకు గల కారణాలపై 'దివీస్' యాజమాన్యంతో ఆయన చర్చించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయి పంచాయతీ పరిధిలో నిర్మించే దివీస్ పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా రైతులు, స్థానిక ప్రజలు, మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్నారు. దివీస్ ఫార్మా పరిశ్రమ చుట్టూ అలుముకున్న సున్నిత అంశాల పరిష్కారానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. దివీస్ పరిశ్రమ స్థాపిస్తే వచ్చే ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటూ ఆ యాజమాన్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశానుసారం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. (చదవండి: ఏపీలో మరో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్) కాలుష్య నివారణకు చర్యలు, ఉద్యోగాల్లో స్థానికులకు పెద్దపీట, ఆందోళనకారులపై మోపిన కేసుల ఉపసంహరణ వంటి అనేక సున్నిత అంశాలలో ప్రజాక్షేమం కోసం ప్రతిపాదనలు చెబుతూ ప్రభుత్వం దివీస్‌తో శనివారం చర్చలు జరిపింది. వీడియో కాన్ఫరెన్స్ కు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ ప్రవీణ్ రెడ్డి, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నమీ, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఎండీ వివేక్ యాదవ్, తూర్పుగోదావరి జిల్లా పీసీబీ, పరిశ్రమల జనరల్, జోనల్ మేనేజర్లు హాజరయ్యారు. (చదవండి: సీఎం జగన్ లక్ష్యాన్ని సాధించారు’) దివీస్ యాజమాన్యం ముందుంచిన ప్రభుత్వ ప్రతిపాదనలు: ♦దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై తక్షణమే మోపిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలి ♦కాలుష్యం విషయంలో మత్స్యకారుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, వారితో సమావేశమై దివీస్ యాజమాన్యం చర్చలు జరపాలి. మత్స్యకారులకు అవగాహన కలిగించి, వారి స్పష్టమైన అంగీకారం వచ్చేలా సమస్యలను పరిష్కరించాలి. ♦దివీస్ విడుదల చేసే కాలుష్యం వల్ల వాతావరణ సమస్య, స్థానిక మత్స్యకారుల ఆరోగ్యానికి హాని కలగని పటిష్ట చర్యలకు హామీ ఇవ్వాలి. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో జరిగే విధంగా పీసీబీ ఎండీకి మంత్రి ఆదేశాలు ♦దివీస్ పరిశ్రమలో తప్పనిసరిగా స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి ♦సీఎస్ఆర్ నిధులతో పాటు సమాజహితం కోసం, స్థానిక ప్రజల క్షేమం కోసం చొరవ చూపి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి ♦దివీస్ పరిశ్రమలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలందించడంలో ప్రభుత్వం తరపున 'నైపుణ్య' సహకారం, అవసరమైతే దివీస్ కు ప్రత్యేకంగా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం ప్రభుత్వ ప్రతిపాదనలకు దివీస్ యాజమాన్యం సానుకూలం.. ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలకు సానుకూలమని దివీస్ పరిశ్రమ డైరెక్టర్ కిరణ్ దివి మంత్రికి వెల్లడించారు. సీఎస్ఆర్ నిధులను ఇప్పటికే ఖర్చు చేస్తున్నామని, ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాల ప్రకారం గుడ్ ఫెయిత్ కింద మరింత సాయమందించేందుకు సిద్ధమన్నారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలిస్తామన్నారు. నిరసన వ్యక్తం చేసిన రైతులు, మత్స్యకారులపైన పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటామని కిరణ్ దివి వెల్లడించారు. -
దివీస్ ల్యాబ్ వద్ద ఉద్రిక్త వాతావరణం
సాక్షి, తొండంగి: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం సంపాదిపేట దివీస్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నిర్మాణం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ ఉదయం ఆకస్మికంగా వెయ్యిమంది ఉద్యమకారులు దివీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిర్మాణం వైపు దూసుకువెళ్లారు. ఉద్యమకారులు ఫ్యాక్టరీ అక్కడ ఉన్నజనరేటర్‌ను తగులబెట్టి గోడలను కూల్చేశారు. ఒక్కసారిగా వందల మంది ఉద్యమకారులు లోపలకు చొచ్చుకు రావడంతో అక్కడ ఏమి జరుగుతుందో తెలియని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన ప్రజా ఉద్యమం పెల్లుబికింది. వందల మంది ఉద్యమకారులను పోలీసులు నిర్బంధించారు. దీంతో సుమారుగా ఎనిమిది వందలు మంది దివీస్ గేటు వద్ద , బైఠాయించి, లోపల నిర్బంధించిన తమ వాళ్లను వదలకపోతే కదిలేది లేదంటూ బైఠాయించారు. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. కాగా దివీస్ ల్యాబరేటరీస్ నిర్మాణానికి వ్యతిరేకంగా స్థానిక రైతులు, వామపక్షలు గత కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నాయి. పరిశ్రమ మెయిన్ గేట్ ఎదురుగా నిరసన శిబిరం ఏర్పాటు చేసి తమ నిరసన తెలుపుతున్నారు. కాలుష్యకారక పరిశ్రమ నిర్మాణం చేపట్టవద్దంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడ 144 సెక్షన్ అమలులో ఉంది. -
పెరుమాళ్లపురం గారెల రుచే వేరయా...
వింటే భారతం వినాలి తింటే గారెలే తినాలన్నారు పెద్దలు. అయితే తింటే పెరుమాళ్లపురం బెల్లంపాకం గారెలే తినాలి అన్నట్టుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందాయి పాకం గారెలు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన ప్రాంతం సమీపిస్తుండగానే పెరుమాళ్లపురం బెల్లం పాకం గారెల ఘుమఘమలు పట్టి లాగేస్తుంటాయి. తెలుగు సంప్రదాయ వంటకాల్లో బూరెలకు, గారెలకు ఒక ఆదరణ ఉంది. పూర్వం బూరెలు, బెల్లంగారెలే పెళ్లివారి విందులో ఉండేవి. అత్తారింటికి అల్లుడు వచ్చాడంటే బెల్లం గారెలతో స్వాగతం పలికేవారు. ఇప్పటికీ నైవేద్యాలలో, విందు భోజనాల్లోనూ బెల్లం పాకం గారెలదే మొదటి స్థానం. నోరూరించే ఈ పాకం గారెను ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతాయి. ఆహా! ఆ మధురానుభూతే వేరు. ఓ హోటల్లో సాయం సమయంలో యాదృచ్ఛికంగా వేసిన బెల్లం గారెలకు డెబ్బై ఏళ్ల చరిత్ర ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇదీ అసలు కధ తూర్పుగోదావరిజిల్లా సముద్ర తీరప్రాంతంలో తొండంగి మండలం పెరుమాళ్లపురం గ్రామానికి చెందిన పేరూరి కన్నయ్య, అప్పయ్యమ్మ దంపతులు 1940 కాలంలో పెరుమాళ్లపురంలో అప్పట్లో పుంతరోడ్డుగా ఉన్న రహదారిలో చిన్న కాకా హోటల్ నడిపేవారు. ఉదయం పూట ఇడ్లీ, సాయంత్రం పకోడి వేసేవారు. ఎప్పుడూ పకోడీలేనా అని అక్కడివారు అనడంతో అప్పయ్యమ్మ మినప్పప్పు రుబ్బి ఆ పిండితో గారెలు వేసి, బెల్లం పాకంలో వేసి వండటం ప్రారంభించింది. అవి ఎంతో రుచిగా ఉండటంతో అప్పయ్యమ్మ బెల్లంపాకం గారెలకు క్రమంగా మంచి పేరు వచ్చింది. ప్రతిరోజూ సాయంత్రం అయ్యేసరికి పాకం గారెల అమ్మకం జోరుగా సాగేది. అప్పట్లో అణాకు నాలుగు గారెలు అమ్మేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పయ్యమ్మ హోటల్ నిర్వహణతోనే ఇద్దరు కుమారులు, కుమార్తెలను పెంచి పెద్ద చేసింది. అమ్మాయికి వివాహం కూడా చేసింది. ఆ తరవాత నుంచి అప్పయ్యమ్మకు కుమారులైన సత్యనారాయణ, సూర్యనారాయణలు సహాయపడేవారు. శుభకార్యాలకు ఆర్టర్లు వస్తే ఇంటిల్లిపాదీ కష్టపడేవారు. పెద్దవారు గతించడంతో ప్రస్తుతం చిన్న కుమారుడు సూర్యనారాయణ తన కుమారుడితో కలిసి బెల్లం పాకం గారెలు వ్యాపారం కొనసాగిస్తున్నారు. నిత్యం హోటల్లో అమ్మడంతోపాటు శుభకార్యాలకు అర్డర్లు వస్తే వండి పంపిస్తున్నారు. నాయనమ్మ ప్రారంభించిన బెల్లం పాకం గారెలను నేటికీ నాణ్యత తగ్గకుండా తండ్రి సూర్యనారాయణ, మనమడు రాంబాబులు షాపును నిర్వహిస్తున్నారు. పెరుమాళ్లపురం పాకం గారెలకు ప్రసిద్దిగాంచడంతో ఇటీవల కాలంలో వీరితోపాటు స్థానికంగా మరో రెండు కుటుంబాల వారు గారెలు వండటం ప్రారంభించి స్వయం ఉపాధి పొందుతున్నారు. కాగా అప్పయ్యమ్మ శతాధిక వృద్దురాలిగా 105 ఏళ్ల వయస్సులో 2019 జూలైలో కాలం చేశారు. రోజుకి 1000 నుంచి1200 గారెల అమ్మకం కిలో మినపగుళ్లు రుబ్బగా వచ్చిన పిండి నూనెలో వేయిస్తే 150 వరకూ గారెలు తయారౌతాయి. ఈ గారెలకు నాలుగు నుంచి ఐదు కిలోల బెల్లం పాకం సిద్ధం చేస్తారు. అప్పయ్యమ్మ తమ హోటల్లో పాకం గారెల వ్యాపారం చేయడం ప్రారంభించేనాటికి కిలో మినప్పప్పు రూపాయిన్నర ఉండేదని, బెల్లం కిలో అర్ధరూపాయి ఉండేదని గతంలోకి అనుభవాలను పంచుకుంటారు. పాకం గారెలను ప్రతీరోజూ సాయంత్రం హోటల్లో వేడివేడిగా వండి అమ్ముతారు. గతంలో సాధారణ రోజుల్లో ఐదొందలకు పైగా అమ్మేవారు. ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో నిత్యం 1000 – 1200 గారెలు తయారుచేసి అమ్ముతున్నారు. రుచి చూసిన ప్రముఖులు... దీర్ఘకాలం నుంచి పేరూరి అప్పయ్యమ్మ వేసిన బెల్లం పాకం గారెలు కోనసీమ ప్రాంతంలో పేరొందడంతో ఎవరైనా ప్రముఖులు ఈ ప్రాంతానికి వస్తే పెరుమాళ్లపురం బెల్లం గారెలను రుచి చూపించేవారు. సినీనటులు జమున, నందమూరి తారకరామారావు, చిరంజీవి, ఇంకా పలువురు సినీ, రాజకీయప్రముఖులు రుచి చూశారు. ఉభయగోదావరి జిల్లాలకు ఎవరైనా ప్రముఖులు వస్తే ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం మడత కాజా, కాకినాడ గొట్టం కాజాతో పాటు పెరుమాళ్లపురం బెల్లం పాకం గారెలు తీసుకెళ్లి రుచి చూపించడం ఆనవాయితీగా మారిపోయింది. సామాజిక మాధ్యమాల రాకతో పెరిగిన డిమాండ్ పెరుమాళ్లపురం పాకం గారెలకు ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఇతర తెలుగు ప్రాంతాలలో కూడా ప్రాచుర్యం పొందాయి. ఇటీవలి కాలంలో వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగడంతో శుభకార్యాలకు అర్డుర్లు ఎక్కువయ్యాయని నిర్వాహకుడు పేరూరి రాంబాబు అంటున్నారు. – పోతుల జోగేష్,తొండంగి మండలం, తూర్పుగోదావరి జిల్లా. పేటెంట్ హక్కుల కోసంప్రయత్నిస్తున్నాను... మా నాయనమ్మ డెబ్బై ఏళ్ల క్రితం నుంచి బెల్లం పాకం గారెలు వండి అమ్మడం ప్రారంభించింది. వృద్ధురాలు కావడంతో పాకం గారెల తయారీ నా తండ్రి సహకారంతో కొన్నాళ్లు మేమంతా నిర్వహించాం. ఆయన కూడా వృద్ధుడు కావడంతో పూర్తిగా గారెల తయారీని నేనే నిర్వహిస్తున్నాను. బెల్లం పాకం గారెలకు పేటెంట్ హక్కులతోపాటు, జియోగ్రాఫికల్ గుర్తింపు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాను. – పేరూరి రాంబాబు,(పేరూరి అప్పయ్యమ్మ మనమడు) -
రూ.30 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో
ఆర్థిక మంత్రి సొంత గ్రామం ఏవీ నగరంలో.. తొండంగి (తుని) : ఆర్థిక మంత్రి స్వగ్రామం.. అడిగే వాడెవ్వడని అనుకున్నాడో ఏమో.. రైతు భూమిని ఆన్లైన్ చేసేందుకు డిమాండ్ చేసిన రూ.30 వేలు తీసుకుంటూ ఏవీ నగరం గ్రామ వీఆర్వో ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్వగ్రామం ఏవీ నగరంలో వీఆర్వో తమ్మయ్యదొర సుదీర్ఘ కాలంగా వీఆర్వోగా పనిచేస్తున్నాడు. పెరుమాళ్లపురానికి చెందిన వైస్ ఎంపీపీ భర్త కాలిబోయిన చంద్రరావుకు ఈ గ్రామంలో 37 సెంట్లు భూమి ఉంది. ఆన్లైన్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. పని చేయకపోవడంతో వీఆర్వోను అడిగితే రూ.40 వేలు డిమాండ్ చేశాడు. బేరసారాల తరువాత రూ.30 వేలకు వీఆర్వో అంగీకరించాడు. మంగళవారం గ్రామంలో రెవెన్యూ కార్యాలయంలో సొమ్ము ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. దీంతో చంద్రరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రూ.30 వేలను వీఆర్వోకు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్, అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. అతడిని విచారణ చేసి రాజమండ్రి ఏసీబీ కోర్టుకు తరలించారు. అతని ఆస్తులపై కూడా సోదాలు మొదలుపెట్టారు. ఇటీవల కాకినాడకు చెందిన రిటైర్డ్ అగ్నిమాపక జిల్లా అధికారి సంకు వెంకటేశ్వరరావు నుంచి రూ.రెండు లక్షలు తహశీల్దార్ టీవీ సూర్యనారాయణ డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కొద్ది రోజుల కిత్రం సీఐ సూర్యమోహన్ విచారణ చేశారు. ఇప్పుడు వీఆర్వో నేరుగా ఏసీబీ అధికారులకు దొరికిపోవడం చర్చనీయాంశమైంది. గతంలో సెంటు భూమిలేని తొండంగికి చెందిన అధికార పార్టీ నాయకుడికి సుమారు రెండెకరాల భూమిని అధికారులు ఆన్లైన్లో కట్టబెట్టారు. ఆ భూమిని ఆన్లైన్లో పొందిన ఆ రైతు సొసైటిలో రుణం కూడా పొందిన సంగతి విదితమే. అధికారుల తీరుపై మండలంలో రైతులు ముక్కున వేలేసుకున్నారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం తరచూ భూముల వ్యవహరాలు ఇష్టారాజ్యంగా చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, సొంత గ్రామంలోనే అధికారి ఏసీబీకి పట్టబడడంపై అమాత్యునికి ఆగ్రహం తెప్పించినట్టు సమాచారం. -
దివీస్ రద్దు వరకూ ఉద్యమించాలి
పౌరహక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు తొండంగి : కోన ప్రాంతంలో కాలుష్య కారక దివీస్ ల్యాబొరేటరీస్‌ను ప్రభుత్వం రద్దు చేసేవరకూ బాధిత గ్రామాల ప్రజలు ఉధృతంగా ఉద్యమించాలని పౌరహక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు అన్నారు. బాధిత గ్రామాలైన పంపాదిపేట, కొత్తపాకలు, తాటియాకులపాలెం, నర్శిపేట గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. దివీస్ రద్దు, అక్రమకేసుల ఎత్తివేత, తదితర డిమాండ్లతో కూడిన కరపత్రాలు విడుదల చేశారు. దివీస్‌ను వ్యతిరేకిస్తూ బాధిత గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా ప్రభుత్వం బలప్రయోగానికి దిగడం విచారకరమన్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా భూసేకరణ చేస్తుండడంతో చిన్న, సన్న కారు, పాడిరైతులు, వ్యవసాయ కూలీలు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులకు నష్టపోతున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంలో 144 సెక్ష¯ŒSను ఆరునెలలుగా అమలు చేయడం, అక్రమకేసులు పెట్టారని, కోర్టులను ఆశ్రయించిన బాధిత రైతు భూముల్లోనూ తోటలను నరికించడం చట్టవిరుద్దమన్నారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా బాధిత గ్రామాల ప్రజలు సమష్టిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దివీస్‌ను రద్దు చేయడంతోపాటు ప్రజలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పౌరహక్కుల సంఘం జిల్లా వైస్‌ప్రెసిడెంట్ ఎ.బాబూరావు, కార్యదర్శి జె.మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని చిన్నారి లభ్యం
సంచిలో తరలిస్తూ వదలివెళ్లిన దుండగులు అక్కున చేర్చుకున్న ప్రయాణికులు కేసు నమోదు చేసిన పోలీసులు తొండంగి : చిన్నారిని ఒక సంచిలో తరలించుకుపోతున్న క్రమంలో రోడ్డుపై ప్రయాణికులు గుర్తించి ఎవరది అని గద్దించడంతో సంచిని అక్కడే వదిలేసి పరారైన ఘటన గురువారం రాత్రి ఎ.కొత్తపల్లి రైల్వే గేటు రహదారిలో చోటుచేసుకుంది. అన్నవరం గ్రామానికి చెందిన గంపల అప్పన్న తన బావమరిది రాజు గురువారం పెరుమాళ్లపురం వెళ్లారు. రాత్రి పదిన్నర గంటలకు బైక్‌పై తిరిగి వస్తుండగా గోపాలపట్నం రైల్వేగేటు వేసి ఉంది. దీంతో అక్కడ ఆగిన అతనికి ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళ పొలాల్లో నక్కి ఉండడాన్ని గమనించిన అప్పన్న ఎవరది అని ప్రశ్నించగా చేతిలో ఉన్న ప్లాస్టిక్ గోనె సంచిని వదిలేసి వెళ్లారు. వారు వదిలేసిన సంచిలో నుంచి చిన్నారి బయటకు రావడంతో అవాక్కైన అప్పన్న వెంటనే పిల్లను ఎత్తుకున్నాడు. మూడేళ్ల వయసున్న చిన్నారి అమ్మ పొయింది, నాన్నపోయింది అన్నమాటలు తప్ప ఇతర వివరాలు చెప్పలేక పోతున్నదని అప్పన్న తెలిపాడు. తన బావమరిది రాజుకు ఆమె చాలా చేరువైందని తెలిపాడు. ఈ విషయమె శుక్రవారం అన్నవరం పోలీసులకు సమాచారం ఇచ్చామని అప్పన్న వివరించాడు. చిన్నారి బంధువులు ఎవరైనా వస్తే పోలీసుల ద్వారా అప్పగిస్తామని వివరాలకు తన సెల్: 81870 77795 గానీ, అన్నవరం పోలీసులను సంప్రదించాలన్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘దివీస్’పై మహిళాగ్రహం
144 సెక్ష¯ŒS ఎత్తివేయాలని డిమాండ్ తీరప్రాంత గ్రామాల్లో మహిళల ర్యాలీ వాకదారిపేటలో అడ్డుకున్న పోలీసులు స్వచ్ఛందంగా అరెస్టయిన మహిళలు అన్నవరం పోలీసు స్టేష¯ŒSకు తరలింపు పోలీసుల హెచ్చరికలపై ఆగ్రహం కాలుష్య భూతం ... భవితంతా అంధకారం ... పచ్చని బతుకుల్లో పరిశ్రమ రూపంలో కాటేస్తుందనే ఆందోళన ... అదే ఆ గ్రామాల ప్రజలను పోరాట పంధాన నడిపిస్తోంది. ప్రజా సంఘాల మద్దతుతో కొద్ది నెలలుగా అలుపెరగని ఉద్యమాలతో ఆ ప్రాంతం అట్టుడికిపోతోంది. గురువారం మరో అడుగు ముందుకేసి నారీ మణులు కొంగు నడుంకు చుట్టి .. పిడికిళ్లు బిగించి కన్నెర్ర చేశారు. గడపదాటి గళం విప్పి గర్జించారు. న్యాయం చేయాలని అభ్యర్థిస్తే నిర్బంధిస్తారా ... అరెస్టులు చేస్తారా అంటూ పహారా కాసిన పోలీసులను ప్రశ్నించారు. స్వచ్ఛందంగా అరెస్టుకు సిద్ధపడ్డారు. తొండంగి: తీర ప్రాంతంలో దివీస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా బాధిత గ్రామాల మహిళల ఆగ్రహం మరోసారి పెల్లుబికింది. కాలుష్యం వెదజల్లే దివీస్ పరిశ్రమ ఏర్పాటును ప్రభుత్వం నిలిపి వేయడంతోపాటు దీర్ఘకాలంగా తీరప్రాంత గ్రామాల్లో అమలు చేస్తున్న 144 సెక్ష¯ŒSను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గురువారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో బాధిత గ్రామాల్లో మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ముందుగా తాటియాకులపాలెంలో మహిళలు రోడ్డుపైకి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే తుని సీఐ అప్పారావు, తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, ఎస్సైలు పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. పంపాదిపేటలో మహిళలు ర్యాలీ చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందడంతో గ్రామంలో పోలీసు వాహనాలతో పర్యటించి, సమావేశాలు, సభలు నిర్వహించరాదని 144 సెక్ష¯ŒS అమలులో ఉందని హెచ్చరికలు జారీచేసి వెళ్లిపోయారు. ఈ నేపధ్యంలో పంపాదిపేటతో పాటు కొత్తపాకల గ్రామం నుంచి వచ్చిన సుమారు 200 మంది మహిళలు 144 సెక్ష¯ŒSను ఎత్తివేయాలని, కాలుష్యంతో ప్రజల ప్రాణాలు తీసే దివీస్ పరిశ్రమ మాకొద్దంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని గ్రామ వీధుల్లో ర్యాలీ చేశారు. నినాదాలను కొనసాగిస్తూ అక్కడి నుంచి శృంగవృక్షంపేట, వాకదారిపేట వరకూ మహిళలు ర్యాలీ కొనసాగించారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు: బాధిత గ్రామాల మహిళలు ర్యాలీ చేస్తుండగా పోలీసులు జీపులతో అక్కడి చేరుకున్నారు. సీఐలు అప్పారావు, చెన్నకేశవరావు, ఎస్సై బి.కృష్ణమాచారి ఐద్వా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి, ఇతర మహిళలతో చర్చించారు. శాంతియుతంగా పర్యటిస్తుంటే అడ్డుకోవడం అన్యాయమన్నారు. పచ్చని తీరప్రాంతంలో ఎన్నాళ్లు 144 సెక్ష¯ŒS అమలు చేస్తారని, తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నాధికారుల ఆదేశాల మేరకు అమలు చేస్తున్నామని ఎవరికి వారు వెళ్లిపోవాలని పోలీసులు ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఐద్వా సంఘం మహిళలను మహిళా పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. బాధిత గ్రామాల మహిళలంతా తమను కూడా అరెస్టు చేయాలని పట్టుబట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ పోలీసుల జులుం నశించాలంటూ నినాదాలు చేశారు. కొంతసేపు పోలీసులకు, మహిళలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసుల ప్రతిఘటనను ధిక్కరిస్తూ వాకదారిపేట మెయి¯ŒS సెంటర్ వరకూ నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. అనంతరం బాధిత మహిళలంతా చర్చించుకుని ఉద్యమానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ స్వచ్ఛందంగా అరెస్టవుతామని తెలిపారు. దీంతో మహిళలను అరెస్టు చేసేందుకు పోలీసు వాహనాన్ని రప్పించారు. బాధిత గ్రామాల మహిళలంతా వ్యానులో ఎక్కారు. మహిళల తరలింపును వ్యతిరేకిస్తూ... దివీస్ పరిశ్రమ వల్ల తమకు కలిగే నష్టాలను చెప్పుకునేందుకు వచ్చిన మహళలను అరెస్టు చేసి తరలించేందుకు అంగీకరించేదిలేదని వాకదారిపేట గ్రామస్తులు పోలీసు వ్యానును అడ్డుకున్నారు. వ్యానును వెళ్లనీయకుండా రోడ్డుపై చెట్లు కొమ్మలను అడ్డుగా వేసి ముందుకు వెళ్లనీయకుండా నిలిపివేశారు. మహిళలను తాము అరెస్టు చేయాలేదని స్వచ్ఛంధంగా వారే అరెస్టవుతామని వ్యానులో కూర్చున్నారని సీఐలు వివరించారు. వ్యాను దిగేదిలేదనడంతో 50 మంది పైగా మహిళలను అన్నవరం పోలీస్‌స్టేçÙ¯ŒSకు తరలించారు. అరెస్టయిన 42 మందిలో ఐద్వా మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి. ప్రభావతి, జిల్లా కార్యదర్శి సి.హెచ్.రమణి, సహాయ కార్యదర్శి సునీత, జిల్లా కమిటీ సభ్యులు నాగ వెంకటలక్ష్మి, కృష్ణమ్మ, పంపాదిపేట గ్రామ సంఘం అధ్యక్షుడు అంబుజాలపు నాగ కృష్ణవేణి, కొత్తపాకలు మహిళా సంఘం కమిటీ సభ్యులు అంగుళూరి చిన్నారి, అంగుళూరి బేబి, మచ్చర్ల మాణిక్యమ్మ ఉన్నారు. మా ఊరొచ్చి మాపైనే కేసులు పెడతారా... నిరసన కార్యక్రమాలను నిలిపివేయాలని, లేకుంటే నా¯ŒS బెయిల్‌బుల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించడాన్ని వాకదారిపేట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైక్ ద్వారా మహిళల వద్దకు వచ్చి 144 అమలు నేపధ్యంలో వీడియోల్లో చిత్రీకరించిన వారిపై కేసులు పెడతామని హెచ్చరించడంతో ఒక్కసారిగా గ్రామస్తులు పోలీసులపై వాగ్వివాదానికి దిగారు. ‘మేము ఏమి నేరం చేశామని మా ఊరొచ్చి మాపై కేసులు పెడతారా’ అని ప్రశ్నించారు.