సాక్షి, అమరావతి: ప్రజల అభ్యంతరాలు, సందేహాల నివృత్తి జరిగే వరకూ 'దివీస్' ఒక్క ఇటుక కూడా కదపకూడదని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతులు, మత్స్యకారులు, స్థానికుల ఆందోళనకు గల కారణాలపై 'దివీస్' యాజమాన్యంతో ఆయన చర్చించారు.
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం దానవాయి పంచాయతీ పరిధిలో నిర్మించే దివీస్ పరిశ్రమ స్థాపనకు వ్యతిరేకంగా రైతులు, స్థానిక ప్రజలు, మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్నారు. దివీస్ ఫార్మా పరిశ్రమ చుట్టూ అలుముకున్న సున్నిత అంశాల పరిష్కారానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. దివీస్ పరిశ్రమ స్థాపిస్తే వచ్చే ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటూ ఆ యాజమాన్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. (చదవండి: ఏపీలో మరో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్)
కాలుష్య నివారణకు చర్యలు, ఉద్యోగాల్లో స్థానికులకు పెద్దపీట, ఆందోళనకారులపై మోపిన కేసుల ఉపసంహరణ వంటి అనేక సున్నిత అంశాలలో ప్రజాక్షేమం కోసం ప్రతిపాదనలు చెబుతూ ప్రభుత్వం దివీస్‌తో శనివారం చర్చలు జరిపింది. వీడియో కాన్ఫరెన్స్ కు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ ప్రవీణ్ రెడ్డి, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నమీ, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు ఎండీ వివేక్ యాదవ్, తూర్పుగోదావరి జిల్లా పీసీబీ, పరిశ్రమల జనరల్, జోనల్ మేనేజర్లు హాజరయ్యారు. (చదవండి: సీఎం జగన్ లక్ష్యాన్ని సాధించారు’)
దివీస్ యాజమాన్యం ముందుంచిన ప్రభుత్వ ప్రతిపాదనలు:
♦దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిపై తక్షణమే మోపిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలి
♦కాలుష్యం విషయంలో మత్స్యకారుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని, వారితో సమావేశమై దివీస్ యాజమాన్యం చర్చలు జరపాలి. మత్స్యకారులకు అవగాహన కలిగించి, వారి స్పష్టమైన అంగీకారం వచ్చేలా సమస్యలను పరిష్కరించాలి.
♦దివీస్ విడుదల చేసే కాలుష్యం వల్ల వాతావరణ సమస్య, స్థానిక మత్స్యకారుల ఆరోగ్యానికి హాని కలగని పటిష్ట చర్యలకు హామీ ఇవ్వాలి. ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో జరిగే విధంగా పీసీబీ ఎండీకి మంత్రి ఆదేశాలు
♦దివీస్ పరిశ్రమలో తప్పనిసరిగా స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి
♦సీఎస్ఆర్ నిధులతో పాటు సమాజహితం కోసం, స్థానిక ప్రజల క్షేమం కోసం చొరవ చూపి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి
♦దివీస్ పరిశ్రమలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలందించడంలో ప్రభుత్వం తరపున 'నైపుణ్య' సహకారం, అవసరమైతే దివీస్ కు ప్రత్యేకంగా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తాం
ప్రభుత్వ ప్రతిపాదనలకు దివీస్ యాజమాన్యం సానుకూలం..
ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలకు సానుకూలమని దివీస్ పరిశ్రమ డైరెక్టర్ కిరణ్ దివి మంత్రికి వెల్లడించారు. సీఎస్ఆర్ నిధులను ఇప్పటికే ఖర్చు చేస్తున్నామని, ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాల ప్రకారం గుడ్ ఫెయిత్ కింద మరింత సాయమందించేందుకు సిద్ధమన్నారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలిస్తామన్నారు. నిరసన వ్యక్తం చేసిన రైతులు, మత్స్యకారులపైన పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటామని కిరణ్ దివి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment