‘కష్టకాలం’లో దుష్టచింతన!
సందర్భం
ఇతరుల బాధలనుంచి తాము లాభపడటం అనే ఈ భయంకర ధోరణి ఎంతగా విస్తరించిందంటే, పంట నష్టాలు, సహాయ చర్యలపై నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త పద్ధతులను చేపట్టడం అనివార్యమైపోయింది.
వర్షాలు లేదా వాటి పర్యవ సానాల కారణంగా వ్యవసాయరంగంలో సంక్షోభం ఏర్పడటం అనేది భారత్‌లో సర్వ సాధారణ వ్యవహారంలా మారిపోయింది. తదుపరి సంవత్సరంలో మరింత మెరు గుపర్చిన సమర్థతతో ఆ సం క్షోభాన్ని ఎదుర్కోవడానికి బదులుగా, ప్రభుత్వ ఖజా నాను కొల్లగొట్టేందు కోసం మరింత సమర్థవంతమైన మార్గాలను అన్వేషించే ప్రయత్నాలే రానురానూ పెరు గుతున్నాయి. ఎందుకంటే అక్రమంగా వచ్చి పడే డబ్బు నేడు రాజకీయాలను శాసిస్తోంది. ఉన్నతోద్యోగబృదం కూడా దీన్ని చూసీ చూడనట్లుగా ఊరకుండిపోతోంది. స్వచర్మ రక్షణ లేదా అక్రమ సంపదలో తమ వంతు వాటాపై కన్నేయడం దీనికి కారణం కావచ్చు.
అకాల వర్షాలు, ఆకస్మిక తుపానుల కారణంగా దేశ వ్యాప్తంగా రబీ సీజన్లో జరిగిన పంట నష్టాల తీవ్రత గురించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల సవ రించినప్పుడు ఈ విషయం స్పష్టంగా బయటపడింది. కేంద్రం సవరించిన అంచనాల ప్రకారం 75 లక్షల హెక్టా ర్లలోనే పంట నష్టం జరగగా, అంతకుముందు రాష్ట్రాల న్నీ కలిసి 181 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు కేంద్రానికి లెక్కలు పంపాయి. ఈ లెక్కల బాగోతాన్ని తేల్చడానికి ఆయా రాష్ట్రాలను సందర్శించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు వాస్తవ నష్టానికి, లెక్కించిన అంచ నాలకు మధ్య అపారమైన వ్యత్యాసం ఉన్నట్లు కను గొన్నారు. ఈ తేడాకు అనుకోని లోపం కారణం కాదు.
ఈ ఘటనను ఒక రైతాంగ కార్యకర్త ఇటీవల విడుదలైన ‘ధాగ్’ అనే మరాఠీ సినిమాలోని ఒక దృశ్యం తో పోల్చి చెప్పారు. గ్రామ శ్మశాన భూమిని నిర్వహిస్తు న్న ఒక వ్యక్తి కుటుంబం ఆ ఊరులో చావు ఘటన సంభ విస్తే తెగ సంతోషపడేది. ఎందుకంటే ఆ వ్యక్తి అంత్య క్రియలకు ఇచ్చే రుసుముతో ఆ పూట ఆ కాటికాపరి కుటుంబం కడుపారా ఆరగించవచ్చు. ఆ ఊరిలో ఎవరై నా ముస్లిం చనిపోతే ఆ కాటికాపరికి పరమ చీకాకు వచ్చేది. ఆ శవం తన ఖాతాలోకి రాదు మరి.
ఇలా పంట నష్టాన్ని అతిశయించి అంచనాలు పంపిన రాష్ట్రాల్లో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లదే అగ్రస్థానం. ఇవన్నీ బీజేపీ లేదా బీజేపీ నేతృత్వం లోని ప్రభుత్వాలే కావడం గమనార్హం. ఇక ఉత్తరప్రదేశ్ అయితే నమ్మశక్యం కానంత భారీ స్థాయిలో పంట నష్టంపై అధిక అంచనాలను కేంద్రానికి పంపింది. ఈ ఎనిమిది రాష్ట్రాలు కలిపి 75 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అంచనా పంపితే దీంట్లో ఒక్క ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే 60 లక్షల హెక్టార్లలో పంట నష్టం అంచనాలను పంపించింది.
ఈ 75 లక్షల హెక్టార్ల పంట నష్టం గురించిన అతి అంచనాలను కేంద్రం పసిగట్టడమే కాకుండా తొలి సారిగా దాన్ని బహిరంగపర్చింది. తాము పంపిన అంచ నాలపై ఆధారపడి కేంద్రం తాము కోరుతున్న మొత్తాల ను కచ్చితంగా తగ్గిస్తుందని రాష్ట్రాలకు తెలిసే ఇలా జరుగుతోందనిపిస్తుంది. దీని ప్రాతిపదికన అవి కేంద్రం నుంచి కోరే భారీ మొత్తాల వార్తలు పతాక శీర్షికల్లో వస్తుంటాయి. రైతులు కాస్త ఉపశమనం పొందడానికే తప్ప ఈ వార్తల వల్ల వారికి ఒరిగేదేమీ లేదు. ఇతరుల బాధలనుంచి తాము లాభపడటం అనే ఈ భయంకర ధోరణి ఎంతగా విస్తరించిపోయిందంటే, పంట నష్టాల ను, సహాయ చర్యలను, వాటిని తక్షణం అందించడం గురించి నిర్ణయాలు తీసుకోవడంలో కొత్త పద్ధతులను చేపట్టడం అనివార్యమైపోయింది. సహాయ, పునరావాస చర్యలు ఎవరికి చెందాలో వారికి చెందకుండా పోతున్న దృష్టాంతాలు అనేకం మనముందున్నాయి. మన వ్యవస్థ ఇలాంటి వాటిని జల్లెడలాగా లీక్ చేస్తూనే ఉంది.
ఈ క్రమంలో చోటు చేసుకునే జాప్యం కూడా చిన్నదేం కాదు. వర్షపాతం పరంగా, వాతావరణ పరం గా, వ్యవసాయ దిగుబడులు క్షీణత పరంగా ఒకటీ లేదా కొన్ని రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమ యాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా పాలనా పరమైన క్యాలెండర్ సంవత్సరంలో యాదృచ్ఛికంగా సంభవించే ఉత్పాతాలకు కొన్నిసార్లు నిధులను విడుదల చేయలేదు. ఇలాంటి అనేక సందర్భాల్లో రైతులను కేవలం గణాంకా లుగానే తప్ప, మనుషులుగా గుర్తించనంత యాంత్రి కత కొనసాగుతుంటుంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలామంది రాజకీయ నేతలు వ్యవసాయ నేపథ్యం కలిగినవారు లేదా వ్యవసాయంపై ఆసక్తి కలిగిన వారు. అయితే తమ సంపద పన్నేతర వ్యవసాయ రంగం నుంచి వచ్చిన ఆదాయమే తప్ప మరొకటి కాదని ప్రదర్శించుకోవడాని కే తప్ప వారి నేపథ్యం రైతాంగానికి ఏమాత్రం ఉప యోగపడటం లేదు.
ఈ బాధాకరమైన పరిణామాలకు సమాధానం ఆత్మహత్యలు కాదు. వాటిని పరిష్కరించడానికి నిజా యితీతో చేసే ప్రయత్నం అవసరం. కానీ నిధుల కేటా యింపులే ప్రధానమై, ఫలితాలు అప్రాధాన్యమవుతున్న చోట ఈ ప్రయత్నాన్ని ప్రారంభించడం ఎలా? నిరాశా నిస్పృహలతో వేసారిపోయి సమీపంలోని వేప చెట్టుకు ఉరి బిగించుకోవడాన్ని నివారించాలంటే వేగంగా స్పం దించడం అత్యంత అవసరం. దీనికి కావలసింది ప్రక్రియలో మార్పు కాదు.. మనస్థితిలో మార్పు.
1980ల మొదట్లో నా దృష్టికి వచ్చిన విషయమిది. 1970ల మధ్యలో రాయలసీమ ప్రాంతంలో రూ.49 కోట్ల విలువైన కరువు సహాయక చర్యలతీరును పరిశీలిం చిన ఒక అధికారి ఆ మొత్తాన్ని అక్కడి అధికారులే దిగమింగడాన్ని నాతో ప్రస్తావించారు. బంజరు భూము ల్లో పెరిగిన చెట్లను కూలీలతో తొలగించినట్లు తప్పుడు గా నమోదు చేసిన అధికారులు.. సిమెంట్ స్టాక్‌ను నేతల సాయంతో దారి మళ్లించారని ఆయన చెప్పారు.
ప్రభుత్వాలు రైతులకు మేలు చేకూర్చే సాకుతో కరవు గురించి రూపొందిస్తున్న అతి అంచనాలు అవధులు మీరిన స్థాయిల్లో కొనసాగుతున్నాయి. ఎవ్రీబడీ లవ్స్ ఎ గుడ్ డ్రాట్ (పెంగ్విన్, 1996) అనే తన పుస్తకంలో పి సాయినాథ్ ఈ విషయంపై చెప్పినవి నూటికి నూరుపాళ్లూ నిజమే. వాళ్లు కరవును ఎందుకు ప్రేమిస్తున్నారో మనకు తెలుసు.
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు)
mvijapurkar@gmail.com