టెలికాం ఉద్యోగులకు వేతన పెంపు లేనట్టే..
సాక్షి, ముంబయి : సంక్షోభాలతో సతమతమవుతున్న టెలికాం పరిశ్రమ ఉద్యోగులకు చేదు కబురు అందిస్తోంది. గత ఏడాది అత్యంత క్లిష్ట పరిస్థితులను అధిగమించిన క్రమంలో ఈసారి ఈ రంగంలోని 30 నుంచి 40 శాతం ఉద్యోగులకు వేతన పెంపు ఉండదని, బోనస్ సైతం సగానికి సగం తగ్గుతుందని భావిస్తున్నారు. టెలికాం ఆపరేటర్లు, టవర్లను నిర్వహించే సంస్ధలు రాబడి తగ్గి మార్జిన్లు పడిపోవడంతో ఖర్చులకు కోత పెట్టే పనిలో పడ్డారు. ఈ ఏడాది కనీసం 30 శాతం మంది ఉద్యోగులకు ఎలాంటి ఇంక్రిమెంట్ ఉండకపోవచ్చని, బోనస్‌లు సైతం సగానికి తగ్గే అవకాశం ఉందని రిక్రూట్‌మెంట్ సంస్థ కోర్న్ ఫెర్రీ ఛైర్మన్ నవ్‌నీత్ సిన్హా చెప్పారు.
రిలయన్స్ జియో 2016 సెప్టెంబర్‌లో చేపట్టిన టారిఫ్ వార్‌తో టెలికాం సంస్థలు కుదేలయ్యాయి. వినియోగదారులను నిలబెట్టుకునేందుకు పలు సంస్థలు పోటాపోటీగా టారిఫ్‌లు తగ్గించడంతో కంపెనీల మార్జిన్లు భారీగా పడిపోయాయి. గత ఏడాదిగా పరిస్థితి దారుణంగా ఉందని, 40 శాతం సిబ్బందికి వేతన పెంపు దక్కలేదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ పరిస్థితి తీవ్రతను వివరించారు. ఈ రంగంలో చోటుచేసుకుంటున్న నూతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడంపై కంపెనీలు దృష్టిసారించాలని చెప్పారు.టెలికాం కంపెనీలు నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్న క్రమంలో ఉద్యోగుల వేతనాల పెంపును విస్మరించకతప్పదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment