Tourism Department package tour
-
పాపికొండలు.. పర్యటనకు వెళ్తారా?
సాక్షి, హైదరాబాద్: పర్యాటక సందడి తిరిగి మొదలైంది. కోవిడ్ కారణంగా చాలా కాలంగా ఇళ్లకే పరిమితమైన నగరవాసులు కాలక్షేపం కోసం పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ పర్యాటకుల అభిరుచికి అనుగుణమైన ప్యాకేజీలను రూపొందించింది. నగరంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో హైదరాబాద్‌ను సందర్శించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రకృతి ఒడిలో.. పాపికొండల యాత్ర: ఇది ప్రతి శుక్రవారం ఉంటుంది. రాత్రి 8.30 గంటలకు బయలుదేరుతారు. శనివారం ఉదయం భద్రాద్రికి చేరుకుంటారు. శ్రీరాముడి దర్శనం అనంతరం పర్ణశాలకు వెళ్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం పాపికొండలకు వెళ్తారు. రాత్రికి కొల్లూరులోని బ్యాంబూ హట్స్‌లో బస ఉంటుంది. మరుసటి రోజు బయలుదేరి తిరిగి నగరానికి చేరుకుంటారు. పెద్దవారికి చార్జీ రూ.4,594 ఉంటుంది. పిల్లలకు ఇందులో 80 శాతం వరకు చార్జీ ఉంటుంది. ఆధ్యాత్మికం.. రమణీయం.. అనంతగిరిహిల్స్: వికారాబాద్ సమీపంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతం అనంతగిరి విహారం కోసం నగరం నుంచి ఉదయం 9 గంటలకు బయల్దేరి రాత్రి 8 గంటలకు తిరిగి చేరుకుంటారు. అనంతగిరి కొండల్లో రమణీయమైన ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు, పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ టూర్ కోసం పెద్దవారికి రూ.900, పిల్లలకు రూ.720 చొప్పున చార్జీ ఉంటుంది. సిటీ టూరు.. బోటు షికారు.. సిటీ టూర్లో భాగంగా బిర్లా టెంపుల్, నిజామ్ మ్యూజియం, చౌమొహల్లా ప్యాలెస్, చార్మినార్ (బయట నుంచి మాత్రమే), జూపార్కు, తారామతి బారాదరి, గోల్కొండ తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.ఈ పర్యటన కోసం ఏసీ వాహనాల్లో రూ.350, నాన్ ఏసీ వాహనాల్లో రూ.250 వరకు చార్జీ ఉంటుంది. పర్యటనలో భాగంగా టిఫిన్, భోజనం, వివిధ ప్రాంతాల్లో సందర్శన టికెట్ల రుసుము పర్యాటకులే చెల్లించాల్సి ఉంటుంది. రవాణా సదుపాయాన్ని మాత్రమే పర్యాటక అభివృద్ధి సంస్థ కల్పిస్తుంది. హుస్సేన్‌సాగర్‌లో బోటు షికారు కూడా అందుబాటులోకి తెచ్చారు. కాకతీయ రీజియన్ యాత్ర: ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరుతుంది. 2వ రోజు రాత్రి 9 గంటలకు తిరిగి చేరుకుంటారు. కాళేశ్వరం, రామప్ప, వేయిస్తంభాల గుడి, యాదాద్రి, కీసర తదితర పుణ్యక్షేత్రాల సందర్శన ఉంటుంది. పెద్దవారికి రూ.1,550, పిల్లలకు రూ.1,320 చొప్పున చార్జీ ఉంటుంది. శైవ క్షేత్రాల సందర్శన.. శాతవాహన యాత్ర: ఈ పర్యటన కోసం నగరం నుంచి ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు బయలుదేరి తిరిగి రాత్రి 10 గంటలకు చేరుకుంటారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి తదితర ఆలయాల సందర్శన ఉంటుంది. బస్సు చార్జీ పెద్దవారికి రూ.1300, పిల్లలకు రూ.1040 చొప్పున ఉంటుంది. ఆలయ ప్రవేశ రుసుము, భోజనం వంటివి పర్యాటకులే ఏర్పాటు చేసుకోవాలి. పంచారామాలకు: ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామాలకు కూడా హైదరాబాద్ నుంచి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇది 3 రోజుల పాటు ఉంటుంది. ఉదయం 9 గంటలకు బయల్దేరి 3వ రోజు ఉదయం 7 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటారు. అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాలను సందర్శించవచ్చు. పెద్దవారికి రూ.3,500, పిల్లలకు రూ.2,800 చొప్పున చార్జీలు ఉంటాయి. బుకింగ్ ఇలా.. ఈ పర్యటనల కోసం తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 040– 29801040, 98485 40371 -
ఇకపై అమరావతిలో ఏటా బోట్ రేసింగ్‌లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ఇక ఏటా బోట్ రేసింగ్ పోటీలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడ వద్ద కృష్ణా నదిలో శుక్రవారం ఆయన పవర్ బోట్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభించారు. తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్లతో కలిసి బోట్లో విహరించారు. భవానీఘాట్ వద్ద ఏర్పాటు చేసిన పర్యాటక సదస్సును ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిలో తప్ప ఇతర దేశాల్లో ఉప్పునీటిలో ఇలాంటి పోటీలు నిర్వహిస్తారన్నారు. ప్రపంచంలో ఎఫ్1హెచ్2వో రేసులు ఏడు చోట్ల నిర్వహిస్తుండగా అమరావతిలో నిర్వహించేది 5వ రేసు అన్నారు. ఆరో రేసు దుబాయి, ఏడవ రేసు షార్జాలలో జరగనున్నాయని తెలిపారు. ప్రకాశం బ్యారేజికి ఎగువున వైకుంఠపురం దిగువున చోడవరం బ్యారేజీలు వస్తున్నాయని, ఆయా ప్రాంతాల్లో 70 నుంచి 80 కిలోమీటర్ల పొడవున వాటర్ ఫ్రంట్ ఏర్పడనుందన్నారు. కృష్ణా నదిలో 9 ఐలాండ్లు ఉన్నాయని ఆయా ప్రాంతాల్లో ఐకానిక్ బ్రిడ్జిలు రాబోతున్నాయని తెలిపారు. బోట్ రేసు నిర్వహించే ప్రాంతాన్ని ఎన్టీఆర్ సాగర్ అమరావతిగా నామకరణం చేశారు. హైదరాబాద్‌లో ఫార్ములా–1 కార్ల రేసును తీసుకురావడానికి ప్రయత్నించానని అయితే అమరావతికి అంతకన్నా మెరుగైన విధంగా నిర్వహించేందుకు ఎఫ్1హెచ్2వో రేసులను తీసుకురాగలిగానని చెప్పారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు వచ్చే నాలుగేళ్లలో లక్ష రూములు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా పని చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 32 చారిత్రక వారసత్వ కట్టడాలపై పర్యాటక శాఖ రూపొందించిన వీడియోను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు భూమా అఖిల ప్రియ, లోకేష్, దేవినేని ఉమా, పర్యాటక శాఖ చైర్మన్ జయరామిరెడ్డి, ఎఫ్1హెచ్2వో ప్రెసిడెంట్ నికోదేశాన్ డిర్మానో, యుఐఎం చైర్మన్ గాయస్ రఫాయల్, పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, టూరిజం అథారిటీ ఎండీ హిమాన్షు శుక్లా, కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు. అయితే బోట్ రేసింగ్ కోసంమీడియాకు జారీచేసే పాసుల జారీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. వారు ఒక్కో పాసును రూ. 500 చొప్పున బయటవారికి విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై గందరగోళ పరిస్థితి నెలకొంది. వచ్చే నెల 30న బీసీ సదస్సు డిసెంబర్ 30న రాజమహేంద్రవరంలో జయహో పేరుతో బీసీ సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ సదస్సుకు సన్నాహకంగా రెండురోజులుగా జరుగుతున్న వర్క్‌షాపు ముగింపు సమావేశం శుక్రవారం ఉండవల్లి గ్రీవెన్స్ హాలులో జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ బీసీలకోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. -
‘ప్రణాళిక’ కోసం రూ.32.47 కోట్లు
హన్మకొండ అర్బన్ : మన ఊరు-మన ప్రణాళిక అమలు కోసం రూ.32.47 కోట్లనిధులు మంజూరయ్యూయని కలెక్టర్ కిషన్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం ప్రణాళికల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జనాభా ఆధారంగా నిధులు మంజూరయ్యూయని పేర్కొన్నారు. మంజూరైన నిధుల్లో 50 శాతం పంచాయతీలు, 30 శాతం మండల పరిషత్‌లు, 20 శాతం జిల్లా అభివృద్ధికి వినియోగించాల్సి ఉండగా.. ఆ మేరకు కేటాయింపులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తాగునీరు, కిచెన్ షెడ్లు, పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని, కార్పొరేషన్లో విలీనమైన 42 గ్రామాల్లో లింకు రోడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, తండాల్లో విద్యుత్ సౌకర్యం, వీధిదీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖకు సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వెంకటేశ్వర్లు, సోషల్ వెల్ఫేర్ డీడీ రోశన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 26న పర్యాటక శాఖ ప్యాకేజీ టూర్ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరిం చుకుని ఈనెల 26న ప్యాకేజీ టూర్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.కిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటక శాఖ ప్యాకేజీ టూర్లో భాగంగా రామప్ప, లక్నవరం, ఖిలావరంగల్‌లో సౌండ్‌అండ్ లైట్స్ షో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 25వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంటలోపు 9392445721, 9849338854, 9866919131 నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా బుధవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రత్యేక సదస్సు, 25 నుంచి 27 వరకు పబ్లిక్‌గార్డెన్‌లోని టౌన్హాల్లో పర్యాటక ప్రాంతాల ఛాయాచిత్ర ప్రదర్శన ఉంటుందని కలెక్టర్ కిషన్ తెలిపారు.