సాక్షి, హైదరాబాద్: పర్యాటక సందడి తిరిగి మొదలైంది. కోవిడ్ కారణంగా చాలా కాలంగా ఇళ్లకే పరిమితమైన నగరవాసులు కాలక్షేపం కోసం పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ పర్యాటకుల అభిరుచికి అనుగుణమైన ప్యాకేజీలను రూపొందించింది. నగరంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో హైదరాబాద్‌ను సందర్శించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ప్రకృతి ఒడిలో..
పాపికొండల యాత్ర: ఇది ప్రతి శుక్రవారం ఉంటుంది. రాత్రి 8.30 గంటలకు బయలుదేరుతారు. శనివారం ఉదయం భద్రాద్రికి చేరుకుంటారు. శ్రీరాముడి దర్శనం అనంతరం పర్ణశాలకు వెళ్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం పాపికొండలకు వెళ్తారు. రాత్రికి కొల్లూరులోని బ్యాంబూ హట్స్‌లో బస ఉంటుంది. మరుసటి రోజు బయలుదేరి తిరిగి నగరానికి చేరుకుంటారు. పెద్దవారికి చార్జీ రూ.4,594 ఉంటుంది. పిల్లలకు ఇందులో 80 శాతం వరకు చార్జీ ఉంటుంది.
ఆధ్యాత్మికం.. రమణీయం..
అనంతగిరిహిల్స్: వికారాబాద్ సమీపంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతం అనంతగిరి విహారం కోసం నగరం నుంచి ఉదయం 9 గంటలకు బయల్దేరి రాత్రి 8 గంటలకు తిరిగి చేరుకుంటారు. అనంతగిరి కొండల్లో రమణీయమైన ప్రకృతిని ఆస్వాదించడంతో పాటు, పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ టూర్ కోసం పెద్దవారికి రూ.900, పిల్లలకు రూ.720 చొప్పున చార్జీ ఉంటుంది.
సిటీ టూరు.. బోటు షికారు..
సిటీ టూర్‌లో భాగంగా బిర్లా టెంపుల్, నిజామ్ మ్యూజియం, చౌమొహల్లా ప్యాలెస్, చార్మినార్ (బయట నుంచి మాత్రమే), జూపార్కు, తారామతి బారాదరి, గోల్కొండ తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు.ఈ పర్యటన కోసం ఏసీ వాహనాల్లో రూ.350, నాన్ ఏసీ వాహనాల్లో రూ.250 వరకు చార్జీ ఉంటుంది. పర్యటనలో భాగంగా టిఫిన్, భోజనం, వివిధ ప్రాంతాల్లో సందర్శన టికెట్ల రుసుము పర్యాటకులే చెల్లించాల్సి ఉంటుంది. రవాణా సదుపాయాన్ని మాత్రమే పర్యాటక అభివృద్ధి సంస్థ కల్పిస్తుంది. హుస్సేన్‌సాగర్‌లో బోటు షికారు కూడా అందుబాటులోకి తెచ్చారు.
కాకతీయ రీజియన్ యాత్ర: ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరుతుంది. 2వ రోజు రాత్రి 9 గంటలకు తిరిగి చేరుకుంటారు. కాళేశ్వరం, రామప్ప, వేయిస్తంభాల గుడి, యాదాద్రి, కీసర తదితర పుణ్యక్షేత్రాల సందర్శన ఉంటుంది. పెద్దవారికి రూ.1,550, పిల్లలకు రూ.1,320 చొప్పున చార్జీ ఉంటుంది.
శైవ క్షేత్రాల సందర్శన..
శాతవాహన యాత్ర: ఈ పర్యటన కోసం నగరం నుంచి ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు బయలుదేరి తిరిగి రాత్రి 10 గంటలకు చేరుకుంటారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి తదితర ఆలయాల సందర్శన ఉంటుంది. బస్సు చార్జీ పెద్దవారికి రూ.1300, పిల్లలకు రూ.1040 చొప్పున ఉంటుంది. ఆలయ ప్రవేశ రుసుము, భోజనం వంటివి పర్యాటకులే ఏర్పాటు చేసుకోవాలి.
పంచారామాలకు: ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామాలకు కూడా హైదరాబాద్ నుంచి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇది 3 రోజుల పాటు ఉంటుంది. ఉదయం 9 గంటలకు బయల్దేరి 3వ రోజు ఉదయం 7 గంటలకు తిరిగి నగరానికి చేరుకుంటారు. అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాలను సందర్శించవచ్చు. పెద్దవారికి రూ.3,500, పిల్లలకు రూ.2,800 చొప్పున చార్జీలు ఉంటాయి.
బుకింగ్ ఇలా..
ఈ పర్యటనల కోసం
తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఆన్‌లైన్‌లోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం
040– 29801040,
98485 40371
Comments
Please login to add a commentAdd a comment