పోటీలను ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ఇక ఏటా బోట్ రేసింగ్ పోటీలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడ వద్ద కృష్ణా నదిలో శుక్రవారం ఆయన పవర్ బోట్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభించారు. తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్లతో కలిసి బోట్‌లో విహరించారు. భవానీఘాట్ వద్ద ఏర్పాటు చేసిన పర్యాటక సదస్సును ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిలో తప్ప ఇతర దేశాల్లో ఉప్పునీటిలో ఇలాంటి పోటీలు నిర్వహిస్తారన్నారు. ప్రపంచంలో ఎఫ్1హెచ్2వో రేసులు ఏడు చోట్ల నిర్వహిస్తుండగా అమరావతిలో నిర్వహించేది 5వ రేసు అన్నారు. ఆరో రేసు దుబాయి, ఏడవ రేసు షార్జాలలో జరగనున్నాయని తెలిపారు. ప్రకాశం బ్యారేజికి ఎగువున వైకుంఠపురం దిగువున చోడవరం బ్యారేజీలు వస్తున్నాయని, ఆయా ప్రాంతాల్లో 70 నుంచి 80 కిలోమీటర్ల పొడవున వాటర్ ఫ్రంట్ ఏర్పడనుందన్నారు. కృష్ణా నదిలో 9 ఐలాండ్‌లు ఉన్నాయని ఆయా ప్రాంతాల్లో ఐకానిక్ బ్రిడ్జిలు రాబోతున్నాయని తెలిపారు. బోట్ రేసు నిర్వహించే ప్రాంతాన్ని ఎన్టీఆర్ సాగర్ అమరావతిగా నామకరణం చేశారు.
హైదరాబాద్‌లో ఫార్ములా–1 కార్ల రేసును తీసుకురావడానికి ప్రయత్నించానని అయితే అమరావతికి అంతకన్నా మెరుగైన విధంగా నిర్వహించేందుకు ఎఫ్1హెచ్2వో రేసులను తీసుకురాగలిగానని చెప్పారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు వచ్చే నాలుగేళ్లలో లక్ష రూములు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా పని చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 32 చారిత్రక వారసత్వ కట్టడాలపై పర్యాటక శాఖ రూపొందించిన వీడియోను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు భూమా అఖిల ప్రియ, లోకేష్, దేవినేని ఉమా, పర్యాటక శాఖ చైర్మన్ జయరామిరెడ్డి, ఎఫ్1హెచ్2వో ప్రెసిడెంట్ నికోదేశాన్ డిర్మానో, యుఐఎం చైర్మన్ గాయస్ రఫాయల్, పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, టూరిజం అథారిటీ ఎండీ హిమాన్షు శుక్లా, కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు. అయితే బోట్ రేసింగ్ కోసంమీడియాకు జారీచేసే పాసుల జారీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. వారు ఒక్కో పాసును రూ. 500 చొప్పున బయటవారికి విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై గందరగోళ పరిస్థితి నెలకొంది.
వచ్చే నెల 30న బీసీ సదస్సు
డిసెంబర్ 30న రాజమహేంద్రవరంలో జయహో పేరుతో బీసీ సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ సదస్సుకు సన్నాహకంగా రెండురోజులుగా జరుగుతున్న వర్క్‌షాపు ముగింపు సమావేశం శుక్రవారం ఉండవల్లి గ్రీవెన్స్ హాలులో జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ బీసీలకోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment