ఇక టూరి‘జమ్’
సాక్షి, రాజమండ్రి :జిల్లాలో పర్యాటకాభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె. చిరంజీవి పేర్కొన్నారు. రాజమండ్రి-కొవ్వూరు మధ్య గోదావరిపై ఉన్న హేవలాక్ వంతెనను తాము స్వాధీనం చేసుకుని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ మేరకు రైల్వే మంత్రిత్వశాఖతో చర్చిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో ‘కోనసీమ మెగా టూరిజం సర్య్కూట్’ పేరుతో గోదావరి విహార కేంద్రాలన్నిటి అభివృద్ధి పనులనూ ఒకే తాటిపైకి తెస్తున్నామన్నారు. ఆయా అభివృద్ధి పనులను చిరంజీవి ఆదివారం ప్రారంభించారు.
ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఆయన పర్యటించారు. తొలుత రాజమండ్రి గోదావరి తీరంలో స్వర్గీయ మహానటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చలన చిత్ర పరిశ్రమకు ఎస్వీఆర్ సేవలను కొనియాడారు. అనంతరం కడియం మండలం కడియపులంకలో రూ. ఐదు కోట్ల తో నిర్మించనున్న ఎకో టూరిజం సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు ఇచ్చే రూ. 100 కోట్ల నుంచి కోనసీమ మెగా టూరిజం సర్క్యూట్‌కు రూ. 45.88 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. కోనసీమ నుంచి పాపికొండల మీదుగా భద్రాచలం వరకు ఉన్న పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు. దీనివల్ల పర్యాటకాభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయన్నారు.
యాత్రాస్థలాల్లో మౌలిక సదుపాయాలు
ఉభయగోదావరి జిల్లాలోని తీర్థయాత్రా స్థలాలు, దేవాలయాల వద్ద మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు రూ. ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తామన్నారు. కాకినాడలో కోరంగి అభయారణ్యం అభివృద్ధికి రూ. పది కోట్లు, కాకినాడ ఎకోపార్కుకు రూ. ఐదు కోట్లు, శిల్పారామానికి రూ. ఐదు కోట్లు, రిసార్ట్స్‌కు రూ. 5.5 కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. పిఠాపురంలో హోటల్ మేనేజ్మెంట్ అభివృద్ధికి రూ. 12 కోట్లు కేటాయించామన్నారు. అనంతరం కోటిపల్లిలో రూ. 5.5 కోట్లతో చేపట్టే రిసార్ట్స్ నిర్మాణానికి కేంద్రమంత్రి చిరంజీవి శంకుస్థాపన చేశారు. హేవలాక్ వంతెనను పర్యాటక స్థలంగా తీర్చిదిద్దే చర్యలను వివరించారు. తర్వాత కాజులూరు చేరుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను, విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులను ప్రారంభించారు.
పర్యాటక ప్రాంతంగా హేవలాక్ వంతెన
గోదావరి నదిపై ఉన్న చారిత్రక హేవలాక్ వంతెనను పర్యాటక శాఖ కొనుగోలు చేస్తుందని కోటిపల్లిలో జరిగిన కార్యక్రమంలో చిరంజీవి వెల్లడించారు. ఈ మేరకు రైల్వే శాఖ మంత్రితో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. పర్యాటక శాఖ అధీనంలో ఈ వంతెనను విహారస్థలంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తామన్నారు. గోదావరి తీరంలో ప్రముఖ హాస్య నటుడు అల్లురామలింగయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చిరంజీవి చెప్పారు. రాజమండ్రిలో స్వర్గీయ మహానటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వీఆర్ తన అభిమాన నటుడన్నారు. ఆయనతో నటించే అవకాశం రాకపోవడం తన దురదృష్టమని చిరంజీవి వాపోయారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి వట్టి వసంత కుమార్, ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, వంగా గీత, కురసాల కన్నబాబు, బండారు సత్యానందరావు, ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకరరావు, సీసీసీ చానల్ ఎండీ పంతం కొండలరావు తదితరులు ఉన్నారు. సాయంత్రం కరపలో రూ. 42.79 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
పేలవంగా సాగిన పర్యటన
జిల్లాలో కేంద్రమంత్రి చిరంజీవి పర్యటన పేలవంగా సా గింది. కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు తప్ప కార్యకర్తలు ఎక్కడా తరలిరాలేదు. రాజమండ్రిలో మాతృవియోగంతో బాధపడుతున్న ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం ఇంటికి పరామర్శకు వెళ్లకుండా చిరంజీవి ని అడ్డుకునే ందుకు ఎమ్మెల్యే వర్గం విశ్వప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఉదయం రివర్‌బేలో నుంచి తొలుత శీఘాకోళ్లపు ఇంటికే వెళ్లేందుకు నిర్ణయించగా సమైక్యవాదులు అడ్డుకుం టారంటూ ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ వైపు మళ్లిం చారు. ఆదివారం పరామర్శ మంచిదికాదనే సెంటిమెంట్ ను ప్రస్తావించి, అక్కడినుంచి నేరుగా కడియం వెళ్లేందుకు కొందరు నేతలు ఒత్తిడి తేగా, ‘మనం 21వ శతాబ్దంలో ఉన్నాం’ అని చిరంజీవి వాఖ్యానించినట్టు సమాచారం.
అడుగడుగునా సమైక్య సెగ
చిరంజీవికి అడుగడుగునా సమైక్య నిరసన సెగ తగిలింది. సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కో కన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో రాజమండ్రి త్రీటౌన్, గోదావరి గట్టు, లలితా నగర్ ప్రాంతాల్లో చిరంజీవి కాన్వాయ్‌ను న్యాయవాదులు అడ్డుకున్నారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. పోలీసుల దౌర్జన్యాన్ని ముప్పాళ్ల తీవ్రంగా ఖండించారు. ‘ప్యాకేజీలు వద్దు.. సీమాంధ్రయే ముద్దు.. పార్లమెంటులో అవిశ్వాసాన్ని నెగ్గించండి’ అంటూ న్యాయ వాదులు నినదించారు. పెద్దాపురం మండలం కాండ్రకోటలో నూకాలమ్మ గుడి శిఖరాన్ని ఆవిష్కరించారు. అక్కడ ఆయన కాన్వాయ్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. చిరంజీవి వాహనాన్ని పోలీసులు ముందుకు పోని వ్వడంతో ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, డీసీసీ అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు కార్లకు సమైక్య వాదులు అడ్డంగా పడుకుని, నినాదాలు చేశారు. వారిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. అలాగే పెద్దాపురం దర్గా సెంటర్లో కూడా సమైక్య వాదులు కేంద్ర మంత్రి చిరంజీవి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.