Tourist visas
-
వీసాతో పనిలేకుండానే విదేశాలకు రయ్.. రయ్!
సాక్షి, విశాఖపట్నం: ‘భారతీయులూ.. వీసా లేకుండా మా దేశాన్ని సందర్శించండి’ అంటూ ఇటీవల వివిధ దేశాలు వరుసగా ప్రకటిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ.. ఇంటర్నేషనల్ ట్రిప్స్ కోసం ఎదురుచూస్తున్న వారంతా విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు అనుగుణంగా భారతీయులకు ప్రయాణ అవకాశాల్ని మరిన్ని కల్పించేందుకు విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. టైర్–2 సిటీస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాలున్న నగరాలపై దృష్టి సారించాయి. వీటిలో విశాఖ ముందువరుసలో ఉంది. ఇప్పటికే విశాఖ నుంచి థాయ్‌లాండ్‌కు విమాన సర్వీసు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ఎయిర్ ఏషియా సంస్థ.. తాజాగా మలేషియా వెళ్లేందుకు మరో సర్వీసును మొదలు పెట్టేందుకు ముహూర్తం చూసుకుంటోంది. ఈ సర్వీసు ప్రకటనతో విదేశాలకు విమాన సర్వీసులు విశాఖ నుంచి ఒక్కొక్కటిగా పెరుగుతూ వస్తుండటం విశేషం. వీసాలతో పని లేకుండా.. వీసా ఉంటేనే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఎంట్రీ లేదా టూరిస్ట్ వీసాలు దొరక్క.. తమకు నచ్చిన దేశంలో విహరించే ఆలోచనలను మధ్యలోనే విరమించుకుంటున్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు గోల్డెన్ చాన్స్ వచ్చేసింది. పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. టికెట్ బుక్ చేసుకుని కొన్ని దేశాలకు ట్రిప్‌కు వెళ్లి రావొచ్చు. భారతీయ పాస్‌పోర్టు బలమైందిగా మారడమే దీనికి కారణం. ఇటీవల ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) విడుదల చేసిన వీసా ఫ్రీ దేశాల జాబితాలో ప్రపంచ దేశాల్లో భారత్ 83వ స్థానంలో నిలిచింది. ఈ కారణంగా కొన్ని దేశాలు భారతీయుల్ని విహారానికి వీసా లేకుండానే ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ అవకాశాల్ని విమానయాన సంస్థలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. థాయ్‌లాండ్, మలేషియాకు.. ఎయిర్ ఏషియా సంస్థ జైపూర్, గోవా, వారణాసితో పాటు విశాఖ నుంచి వీసా ఫ్రీ దేశాలకు సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా విశాఖపై ఎయిర్ ఏషియా స్పెషల్ ఫోకస్ పెట్టింది. దక్షిణ భారతదేశంలోని వివిధ నగరాల నుంచి కౌలాలంపూర్‌కు లిమిటెడ్ పీరియడ్‌తో ప్రత్యేక ప్రమోషన్ చార్జీలతో విమాన సర్వీసుల్ని ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి కూడా సర్వీసులు నడపాలని నిర్ణయించింది. సౌత్ ఇండియా నుంచి ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్లో మొత్తంగా 69 వీక్లీ సర్వీసులు నడుపుతూ ఏడాదికి 1.5 మిలియన్ సీట్లతో రెండు దేశాల మధ్య సేవలను గణనీయంగా పెంచనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే మరో వీసా ఫ్రీ ప్రకటించిన థాయ్‌లాండ్‌కు కూడా విశాఖ నుంచి ఏప్రిల్‌లో సర్వీసులు మొదలు పెడుతున్నట్టు ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఏప్రిల్ 9 నుంచి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో సర్వీసులు నడపనున్నట్టు వెల్లడించింది. మరోవైపు.. విశాఖ నుంచి సింగపూర్‌కు స్కూట్ సర్వీస్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రతి రోజూ కనీసం 300 నుంచి 350 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న థాయ్, కౌలాలంపూర్ సర్వీసులతో విశాఖ నుంచి ఏకంగా మూడు విదేశీ సర్వీసులు నడవనున్నాయి. ఫిబ్రవరిలో ఇండిగో సంస్థ కూడా మరో విదేశీ సర్వీసు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఈ సర్వీసుల రాకతో విదేశీ ప్రయాణాలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టు గేర్ మార్చినట్టుగా అధికారులు భావిస్తున్నారు. దూసుకుపోతున్న ఎయిర్ ఏషియా ఇప్పటివరకూ దాదాపు 60 దేశాలు వీసా ఫ్రీ ప్రకటించాయి. 30 నుంచి 90 రోజుల వరకూ వీసా లేకుండానే భారతీయులు తమ దేశానికి వచ్చి ఆతిథ్యాన్ని ఎంజాయ్ చెయ్యొచ్చని ప్రకటించాయి. తాజాగా తమ దేశ పర్యాటకానికి ఊతమిచ్చేందుకు వియత్నాం, థాయ్‌లాండ్, శ్రీలంక మాదిరిగానే మలేషియా కూడా భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతేడాది డిసెంబర్ 1 నుంచి మలేషియా ఈ అవకాశాన్ని కల్పించింది. ఇలా వీసా ఫ్రీ టూర్‌కు వివిధ దేశాలు అవకాశమిస్తున్న తరుణంలో విమానయాన సంస్థలు తమ సర్వీసుల్ని పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో ఎయిర్ ఏషియా సంస్థ అగ్రభాగంలో ఉంది. ఈ సంస్థ టైర్–2 నగరాల్లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్నే టార్గెట్ చేస్తూ కొత్త సర్వీసుల్ని మొదలు పెడుతోంది. -
వీసా దరఖాస్తు ఫీజులు పెంచిన అమెరికా
న్యూఢిల్లీ: అమెరికాకు వచ్చే వారి టూరిస్ట్, స్టూడెంట్ వీసా దరఖాస్తుల ఫీజును పెంచుతున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. విజిటర్ వీసాలు, నాన్ పిటిషన్ బేస్డ్ నాన్ ఇమిగ్రాంట్ వీసాల ఫీజును ప్రస్తుతమున్న 160 డాలర్ల నుంచి 185 డాలర్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. అదేవిధంగా, తాత్కాలిక వృత్తిదారులు(టెంపరరీ వర్కర్స్)కిచ్చే కొన్ని రకాల నాన్ ఇమిగ్రాంట్ వీసాల ఫీజు ప్రస్తుతం ఉన్న 190 డాలర్ల నుంచి 205 డాలర్లకు పెరుగుతుందని తెలిపింది. ప్రత్యేక వృత్తినిపుణు(స్పెషలిజం ఆక్యుపేషన్)లకు ఫీజును 315 డాలర్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం మే 30వ తేదీ నుంచి అమల్లోకి రానుందని ప్రకటించింది. కాన్సులర్ సేవల ఫీజుల్లో ఎటువంటి మార్పులు లేవని స్పష్టం చేసింది. -
పర్యాటక వీసాతోనూ ఉద్యోగ దరఖాస్తులు: అమెరికా
వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో ఉద్యోగం కోల్పోయి కొత్త కొలువు దొరక్క దేశం వీడాల్సి వస్తుందేమోనని ఆందోళన పడుతున్న హెచ్–1బి వీసాదారులకు, ముఖ్యంగా భారత టెకీలకు భారీ ఊరట! బిజినెస్ (బి–1), పర్యాటక (బి–2) వీసాదారులు కూడా అమెరికాలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకూ హాజరు కావచ్చని ఆ దేశ పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) పేర్కొంది. ‘‘అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వారు 60 రోజుల్లోపు మరో ఉద్యోగం చూసుకోలేని పక్షంలో అమెరికా వీడటం తప్ప మరో మార్గంలేదనే అపోహలో ఉన్నారు. మరింత కాలం దేశంలో ఉండేందుకు వారికి పలు మార్గాలున్నాయి. 60 రోజుల్లోపు వీసా స్టేటస్‌ను (బి–1, బి–2కు) మార్చుకుంటే ఆ గ్రేస్ పీరియడ్ ముగిశాక కూడా అమెరికాలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించుకోవచ్చు’’ అని వివరించింది. అయితే ఉద్యోగం దొరికాక అందులో చేరేలోపు వీసా స్టేటస్‌ను తదనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయమై పలువురు వెలిబుచ్చిన పలు సందేహాలకు సమాధానంగా సంస్థ ఈ మేరకు ట్వీట్ చేసింది. బి–1 వీసాను స్వల్పకాలిక బిజినెస్ ప్రయాణాలకు, బి–2ను ప్రధానంగా పర్యాటక అవసరాలకు అమెరికా జారీ చేస్తుంటుంది. మాంద్యం దెబ్బకు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇలా గత నవంబర్ నుంచి అమెరికాలోనే 2 లక్షల మందికి పైగా నిరుద్యోగులయ్యారు. వీరిలో కనీసం లక్ష మంది భారతీయులేనని అంచనా! -
India-China: చైనాకు గట్టి షాకిచ్చిన భారత్
సాక్షి, న్యూఢిల్లీ: డ్రాగెన్ కంట్రీ చైనా కవ్వింపులకు భారత్ మరోసారి గట్టి సమాధానం చెప్పింది. చైనా జాతీయులకు జారీ చేసిన పర్యాటక వీసాలను భారత్ సస్సెండ్ చేస్తున్నట్టు గ్లోబల్ ఎయిర్‌లైన్స్ బాడీ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) తెలిపింది. కాగా, కోవిడ్ కారణంగా భారత విద్యార్ధులు(22వేల మంది) చైనా నుండి స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం వారి రాకను చైనా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ నుండి వచ్చే విద్యార్థులను మాత్రం చైనా ఆహ్వానించింది. ఇదిలా ఉండగా.. గత నెలలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత పర్యటనకు వచ్చిన సమయంలో మన దేశ విదేశాంగ మంత్రి జై శంకర్ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని ఆయనను కోరారు. అయినప్పటికీ చైనా నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో భారత్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఏప్రిల్ 20న జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.."చైనా (పీపుల్స్ రిపబ్లిక్) పౌరులకు జారీ చేసిన టూరిస్ట్ వీసాలు ఇకపై చెల్లవు. భూటాన్, మాల్దీవులు, నేపాల్ జాతీయులు, భారత్ జారీ చేసిన నివాస అనుమతి ఉన్నవారు, ఇ-వీసా ఉన్నవారు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్ లేదా బుక్లెట్ ఉన్నవారు, PIO కార్డ్ ఉన్నవారు, దౌత్య పాస్‌పోర్ట్ హోల్డర్లు మాత్రమే భారత్‌లోకి అనుమతించబడతారు’’ అని పేర్కొంది. ఇది చదవండి: ఏప్రిల్ 27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ -
ఇండియన్లకు కువైట్ షాక్ ! టూరిస్టు వీసా జాబితాలో మొండి చేయి
భారతీయ పర్యాటకులకు కువైట్ ప్రభుత్వం మొండి చేయి చూపింది. టూరిస్టు వీసాల జారీకి సంబంధించి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో కువైట్ దేశానికి వచ్చేందుకు ఇటీవల 53 దేశాలకు చెందిన పౌరులకు అక్కడి ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)లో సభ్యత్వం ఉన్న దేశాల్లో గత ఆర్నెళ్లుగా నివసిస్తున్న విదేశీ ప్రొఫెషనల్స్‌కి టూరిస్టు వీసాలు జారీ చేస్తామని పేర్కొంది. ఈ మేరకు కువైట్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్లో ఇ వీసాలు వీటిని జారీ చేయనుంది. అయితే టూరిస్టు వీసాలు ఇచ్చేందుకు అవకాశం ఇస్తున్న దేశాల జాబితాలో భారత్‌ను మినహాయించింది. కువైట్‌లో వలస కార్మికులతో పాటు పెద్ద ఎత్తున్న ప్రొఫెషనల్స్ అక్కడ పని చేస్తున్నారు. అయినప్పటికీ భారత్‌కు వీసాలు జారీ చేసే విషయంలో కువైట్ భారత్‌ని పక్కన పెట్టింది. కువైట్ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం... 53 దేశాలకు చెందిన వారికి ఈ వీసాలు జారీ చేసేందుకు అంగీకారం తెలపగా ఇందులో మెజారిటీ దేశాలు యూరప్, అమెరికా ఖండాలకు చెందినవే ఉన్నాయి. ఏషియాకు సంబంధించి జీసీసీ సభ్యదేశాలకే ప్రాధాన్యం ఇచ్చింది. జీసీసీ సభ్యదేశాలల్లో ఉన్న కన్సల్టెంట్స్, వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, జడ్జిలు మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సభ్యులు, యూనివర్శిటీ అధ్యాపకులు, ప్రెస్ అండ్ మీడియా సిబ్బంది, పైలట్స్, కంప్యూటర్ ప్రోగ్రామర్లు, సీస్టం అనలిస్ట్స్, మేనేజర్స్, వ్యాపారవేత్తలు, దౌత్య దళం, యూనివర్శిటీ గ్రాడ్యుయేట్స్, సౌదీ ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు కువైట్ టూరిస్టు వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు జీసీసీ దేశాలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, ఒమన్, కువైట్లలో ఆరు నెలల కంటే ఎక్కువ నివాసం ఉండాలనే నిబంధన విధించింది. చదవండి: Saudi Arabia: రెసిడెన్సీ పర్మిట్లపై కొత్త చట్టం -
సౌదీ కీలక నిర్ణయం : తొలిసారి టూరిస్ట్ వీసా
సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగానికి ఊతమిచ్చే చర్యల్లో భాగంగా తొలిసారిగా పర్యాటక వీసాలు జారీ చేయనుంది. సౌదీ అరేబియా చమురు నుండి దూరంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను విస్తృతం చేసే ప్రయత్నంలో భాగంగా సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030 కార్యక్రమంలో తొలి అడుగు వేశారు. సౌదీ అరేబియా చమురు మౌలిక సదుపాయాలపై వినాశకరమైన దాడులు జరిగిన రెండు వారాల తరువాత ఈ ప్రకటన రావడం విశేషం. చమురు బావులపై ఇటీవల జరిగిన డ్రోన్ దాడుల్లో ఆ దేశ ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని పర్యాటకం ద్వారా భర్తీ చేసుకోవాలని సౌదీ సర్కార్ యోచిస్తోంది. "అంతర్జాతీయ పర్యాటకులను సౌదీ అరేబియాకు ఆహ్వానించడం తమ దేశానికి సంబంధించిన దొక చారిత్రాత్మక క్షణం" అని పర్యాటక చీఫ్ అహ్మద్ అల్-ఖతీబ్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే విదేశీ మహిళల కోసం రాజ్యం తన కఠినమైన దుస్తుల నియమావళిని కూడా సులభతరం చేస్తుందని, సౌదీ మహిళలకు ఇప్పటికీ బహిరంగ దుస్తులు ధరించే శరీర కవచం లేని అబయ వస్త్రాన్ని లేకుండా వెళ్ళడానికి వీలు కల్పిస్తుందని ఖతీబ్ చెప్పారు. సౌదీలోని పర్యాటక ప్రాంతాలను చూసి కచ్చితంగా ఆశ్యర్యానికి గురవుతారు. ఉత్కంఠభరితమైన సహజ ప్రకృతి సౌందర్యం, యునెస్కో గుర్తించిన ఐదు వారసత్వ ప్రదేశాలు పర్యాటకులను కచ్చితంగా కనువిందు చేస్తాయని సౌదీ ఓ ప్రకటనలో వెల్లడించింది. శనివారం నుంచి ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ టూరిస్ట్ వీసాల కోసం 49 దేశాల పౌరులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. -
టూరిస్టు వీసాలిచ్చి మోసగిస్తున్న ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అమాయక ప్రజలకు టూరిస్ట్ వీసాలు ఇచ్చి మోసగిస్తున్న, దుబాయ్ పంపిన మహిళల్ని భయపెట్టి వ్యభిచారంలోకి దింపుతున్నముఠాలోని కొందరు సభ్యులను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బి నగర్‌లోని రాచకొండ సీపీ క్యాంప్ కార్యాలయంలో సిపి మహేష్ భగవత్ మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. దుబాయ్, మస్కట్, బహ్రెయిన్, కువైట్ దేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరక్షరాస్యులైన అమాయక ప్రజలకు టూరిస్ట్ వీసాలు ఇచ్చి ఈ ముఠా మోసాలకు పాల్పడుతోందని చెప్పారు. అలాగే దుబాయ్‌కు పంపిన మహిళల్ని భయపెట్టి వ్యభిచార గృహాలకు తరలించి డబ్బులు దండుకుంటున్నదని కూడా తెలిపారు. 12మంది సభ్యుల ఈ ముఠాలో ఐదుగురిని మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. అరెస్టు అయిన వారినుంచి రూ.1.60 లక్షల నగదు, వీసా డాక్యుమెంట్లు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కాగా, ఈ కేసు విషయంలో బాధితులు పిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యం వహించిన ఘట్కేసర్ ఎస్ఐ శోభన్‌బాబును 15 రోజుల క్రితం సీపీ సస్పెండ్ చేశారు. ఏసీపీ, సిఐలకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. -
టూరిస్ట్ వీసాతో ఏజెంట్ మోసం
పశ్చిమగోదావరి, తణుకు : ఎలక్ట్రీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి టూరిస్ట్ వీసాపై షార్జాకు పంపిన ఏజెంట్ తనను మోసం చేశాడంటూ ఒక బాధితుడు వాపోయాడు. కుంచనపల్లి గ్రామానికి చెందిన పృథ్వి అనే వ్యక్తి సోషల్ మీడియాలో అక్కడి నుంచి తన గోడును వెళ్లబోసుకున్నాడు. తణుకు పట్టణానికి చెందిన రాయల్ ట్రావెల్స్ యజమాని నర్సింహరాజు ద్వారా తాను షార్జా వచ్చి మోసపోయానని చెబుతున్నారు. ఈ మేరకు సంబంధిత వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన వద్ద రూ.80 వేలు తీసుకుని ఎలక్ట్రీషియన్ ఉద్యోగం ఉందని గతేడాది నవంబర్ 15న షార్జా వచ్చానని చెప్పాడు. షార్జాలో ఖాన్ అనే ఏజెంట్ తనను హెల్పర్‌గా పనిచేయాలని చెప్పాడన్నారు. అన్ని పనులు చేయాలని చెప్పడంతో పాటు తనను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడు. టూరిస్ట్ వీసా గడువు తీరిపోవడంతో డబ్బులు కట్టమంటున్నారని చెబుతున్నాడు. దీనిపై స్పందించిన తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కేఏ స్వామి రాయల్ ట్రావెల్స్ యజమాని నర్సింహరాజును స్టేషన్‌కు పిలిపించి విచారించినట్టు చెప్పారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు సీఐ వివరించారు. -
టూరిస్టు వీసాలతో విదేశాలకు వెళ్లి మోసపోవద్దు
కర్ణాటక: ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్ఛ్సేంజ్‌ల ద్వారా పర్యాటక వీసాలతో ఇతర దేశాలకు వెళ్లి మోసపోవద్దని శ్రీలంక శరణార్థులను హొసూరు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. తమిళనాడులో పలు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీలు శ్రీలంక శరణార్థులను ఇతర దేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని పర్యాటక వీసాలతో పంపుతున్నారు. దీన్ని నమ్మి ఇతర దేశాలకు వెళ్లిన శ్రీలంక శరణార్థులు తిండీతిప్పలు మాని చేతిలో డబ్బులు లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రైవేట్ ఎంప్లామెంట్ శాఖలను నమ్మి విదేశాలకు వెళ్లరాదని కలెక్టర్ హెచ్చరించారు. 2016లో 250 మంది, 2017లో 186 మంది అరబ్ దేశాలకు పర్యాటక వీసాతో వెళ్లి మోసపోయారన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ నుంచి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీల ద్వారా పర్యాటక వీసాతో వెళ్లిన 17 మంది కూడా అదే స్థితికి చేరుకొన్నారని, విషయం తెలుసుకొన్న ఆ రాష్ట్ర ప్రభుత్వం వారిని వెనక్కి రప్పించుకొందని పేర్కొన్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
టూరిస్టు వీసాలు తీసుకున్న 56 మంది ప్రయాణికులను అధికారులు విమానం ఎక్కేందుకు అనుమతించలేదు. దీంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగారు. ఈ ఘటన మంగళవారం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. వివారాల్లోకి వెళితే.. కొంత మంది రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయ్ ఎయిర్ లైన్స్ అధికారులు ప్రయాణికులకు అనుమతి నిరాకరించారు. వీరంతా కలర్‌ఫుల్ ట్రావెల్స్ ద్వారా దుబాయ్ వెళ్లేందుకు టూరిస్టు వీసాలు తీసుకున్నారు. అయితే.. అధికారులు ప్రయాణికులను ఎందుకు అడ్డుకున్నారో తెలియ రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన ప్రయాణీకులు విమానాశ్రయంలోనే నిరసనకు దిగారు. విమానాశ్రయ అధికారులు, ప్రయాణికులతో చర్చలు జరుపుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమెరికాకు పిల్లల అక్రమ రవాణా
- ముఠానాయకుడి సహా 16 మంది అరెస్టు సాక్షి, బెంగళూరు: అమెరికాకు అక్రమ మార్గంలో పిల్లలను తీసుకువెళ్తున్న ఓ ముఠాను కర్ణాటక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (ఎస్ఐటీ) అరెస్టు చేసింది. ఇందులో ముగ్గురు మహిళలతో సహా 16మంది ఉన్నారు. నకిలీ తల్లిదండ్రులు, నకిలీ జనన ధృవీకరణ పత్రాలను సృష్టించి, టూరిస్టు వీసాలపై పిల్లలను అమెరికాకు ఈ ముఠా తరలిస్తోందని పోలీసులు తెలిపారు. నిరుపేదల నుంచి పిల్లలను కొనుగోలు చేసి బెంగళూరుకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు పంపిస్తున్నారని.. నిందితులపై దాదాపు ఏడాది పాటు సిట్ నిఘా ఉంచింది. పిల్లలను తీసుకుని టూరిస్టు వీసాలపై వెళ్తున్న దంపతులు.. తొందరగానే తిరిగి వస్తుండటం, వచ్చేప్పుడు పిల్లలు లేకుండానే రావటం గమనించిన దర్యాప్తు అధికారులు సోమవారం 14 చోట్ల ఏకకాలంలో దాడులు చేసి ముఠా నాయకుడితో సహా 16మందిని అరెస్టు చేశారు. -
పాక్ టూర్ వీసాలు భారత్ కు ఇవ్వరట!
కోల్ కతా: పాకిస్తాన్లో పర్యటించాలనుకుంటున్నారా? ఇక మీకు కష్టమే. ఎందుకంటారా, అయితే ఇది చదవండి. పాకిస్తాన్ లో పర్యటించాలనుకునే భారతీయులకు సమీప భవిష్యత్తులో ఆ ఆశ తీరేలాలేదు. ఇరుదేశాలు వీసాల ప్రక్రియకు ఇరుదేశాల నిబంధనలే కారణమని ఈ విషయాన్ని స్వయంగా భారత్ లో పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసితే తెలియజేశారు. ఇరుదేశాల ప్రజలు పర్యటనలపై ఆసక్తిచూపుతున్నారని ఆయన తెలియజేశారు. అయితే అది ఎప్పుడు నెరవేరుతుందనే విషయం మాత్రం తాను ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు. సిక్కులు పాకిస్తాన్ ను సందర్శిస్తుంటారు. అలాగే హిందూ పర్యాటకులు పాకిస్తాన్ లో పర్యటించడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. ఈ ఒప్పందాలను తప్పనిసరిగా పాటించినట్లయితే వీసాల విషయంలో ఇబ్బందులు తొలగించుకోవచ్చని బాసిత్ తెలిపారు. దీనికి ఇరుదేశాలు ఒకరిపై ఒకరికి నమ్మకమే ప్రధాన విషయమని ఆయన పేర్కొన్నారు. వీసాల నిబంధనల్లో పారదర్శకతపై ఆయన మాట్లాడుతూ...మొదట ఇరుదేశాల మధ్య ఉన్న అగ్రిమెంట్లను అమలుచేయాలనుకుంటున్నాం. అప్పుడు ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడుతుంది. దానిద్వారా ఈ పరిణామాలను ఇతర ప్రాంతాలకూ వ్యాప్తిచేయవచ్చు అని బాసిత్ తెలిపారు.