వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో ఉద్యోగం కోల్పోయి కొత్త కొలువు దొరక్క దేశం వీడాల్సి వస్తుందేమోనని ఆందోళన పడుతున్న హెచ్–1బి వీసాదారులకు, ముఖ్యంగా భారత టెకీలకు భారీ ఊరట! బిజినెస్ (బి–1), పర్యాటక (బి–2) వీసాదారులు కూడా అమెరికాలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకూ హాజరు కావచ్చని ఆ దేశ పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) పేర్కొంది. ‘‘అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వారు 60 రోజుల్లోపు మరో ఉద్యోగం చూసుకోలేని పక్షంలో అమెరికా వీడటం తప్ప మరో మార్గంలేదనే అపోహలో ఉన్నారు. మరింత కాలం దేశంలో ఉండేందుకు వారికి పలు మార్గాలున్నాయి.
60 రోజుల్లోపు వీసా స్టేటస్‌ను (బి–1, బి–2కు) మార్చుకుంటే ఆ గ్రేస్ పీరియడ్ ముగిశాక కూడా అమెరికాలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించుకోవచ్చు’’ అని వివరించింది. అయితే ఉద్యోగం దొరికాక అందులో చేరేలోపు వీసా స్టేటస్‌ను తదనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయమై పలువురు వెలిబుచ్చిన పలు సందేహాలకు సమాధానంగా సంస్థ ఈ మేరకు ట్వీట్ చేసింది. బి–1 వీసాను స్వల్పకాలిక బిజినెస్ ప్రయాణాలకు, బి–2ను ప్రధానంగా పర్యాటక అవసరాలకు అమెరికా జారీ చేస్తుంటుంది. మాంద్యం దెబ్బకు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇలా గత నవంబర్ నుంచి అమెరికాలోనే 2 లక్షల మందికి పైగా నిరుద్యోగులయ్యారు. వీరిలో కనీసం లక్ష మంది భారతీయులేనని అంచనా!
Comments
Please login to add a commentAdd a comment