toxic gas
-
విష వాయువుల లీకేజీ ఘటనపై ప్రభుత్వం సీరియస్
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్ అపెరల్ పార్క్ సిటీలోని సీడ్స్ కంపెనీలో మరోసారి విష వాయువులు లీకైన దుర్ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలిసేంతవరకు సంఘటన జరిగిన యూనిట్‌లోని విభాగాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సిందిగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. సీడ్స్ కంపెనీలో జరిగిన ప్రమాదాలకు కంపెనీ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. ఆ విభాగాన్ని తాత్కాలికంగా మూసివేయడం వల్ల కార్మికులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూస్తామని హామీ ఇచ్చారు. బుధవారం ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డీఎంహెచ్ఓ డాక్టర్ హేమంత్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రావణ్‌కుమార్‌ను ఆరా తీశారు. బాధితులకు పూర్తిగా నయమయ్యే వరకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన కారణాలను తెలుసుకున్నారు. బాధితులు మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం తాము క్యాంటీన్‌కి వెళ్తున్నప్పుడు కాలిన వాసన వెలువడిందని, అప్పటికే తమకు కళ్లు తిరిగి, వికారంగా ఉండటం, వాంతులు రాగా.. కొంతమంది స్పృహ కోల్పోయారని వివరించారు. అనంతరం అక్కడ నుంచి అచ్యుతాపురం బ్రాండిక్స్ ఆవరణలో ఉన్న సీడ్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ అయిన ఎం–1 యూనిట్‌ను కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజుతో కలిసి మంత్రి అమర్నాథ్ పరిశీలించారు. సీడ్స్‌లో ఇటువంటి ఘటన రెండోసారి జరగడం బాధాకరమన్నారు. భద్రతా ప్రమాణాలపై ఉన్నతస్థాయి కమిటీ రాష్ట్రంలోని ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై ఉన్నతస్థాయి కమిటీ నియమించి సేఫ్టీ ఆడిట్ జరిపిస్తామని మంత్రి అమర్నాథ్ చెప్పారు. గతంలో అస్వస్థతకు గురైనవారు ఆరోగ్యపరంగా భవిష్యత్‌లో ఏవిధమైన ఇబ్బందులు పడతారనే విషయాన్ని తెలుసుకునేందుకు ఐసీఎంఆర్‌కు లేఖ రాశామని చెప్పారు. గతంలో ఆ కంపెనీలో గ్యాస్ లీకయినప్పుడు అందుకు గల కారణాలు తెలుసుకునేందుకు జిల్లాస్థాయి అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు, ఏయూ ప్రొఫెసర్లతో కమిటీని వేశామన్నారు. ఆ కమిటీ సీడ్స్ నుంచి కొన్ని శాంపిల్స్ సేకరించి పరీక్షించగా అందులో ‘కాంప్లెక్స్ గ్యాస్’ ఉన్నట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చిందన్నారు. చెదల నివారణకు వాడే క్రిమిసంహారక మందు ఏసీ యంత్రాల్లోకి వెళ్లి ప్రమాదకరమైన విషవాయువులు బయటకు వెలువడ్డాయని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందన్నారు. ఆ నివేదిక ఆధారంగా కంపెనీ యాజమాన్యానికి సెక్షన్–41 కింద జూన్ 30న షోకాజ్ నోటీసులు జారీ చేశామని, రెండు నెలల్లో ఈ నోటీసుకు సమాధానం ఇవ్వకుంటే ప్రాసిక్యూట్ చేస్తామని కూడా హెచ్చరించామని వివరించారు. దీనిపై ఆ సంస్థ యాజమాన్యం స్పందించాల్సి ఉందన్నారు. 37 మంది డిశ్చార్జి విష వాయువుల లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురై అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా వైద్యాలయం, ఉషా ప్రైమ్ ఆస్పత్రి, సత్యదేవ్ ఆస్పత్రి, విశాఖలోని మెడికేర్, వైభవ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 123 మంది బాధితుల్లో 37 మందిని బుధవారం డిశ్చార్జి చేశారు. మిగిలిన 86 మందికి చికిత్స అందిస్తున్నామని, వారు క్రమంగా కోలుకుంటున్నారని డీఎంహెచ్‌వో హేమంత్‌కుమార్ చెప్పారు. -
విషవాయువు లీక్.. 12 మంది మృతి, 199 మందికి అస్వస్థత
విషపూరిత వాయువు లీకేజీ ఘటనలో 12 మంది చనిపోయారు. మరో 251 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన జోర్డాన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జోర్డాన్ దక్షిణ ఓడరేవు నగరమైన అకాబాలో క్లోరిన్ గ్యాస్ లీకేజీ అయ్యింది. జిబౌటికి ఎగుమతి చేస్తున్న 25 టన్నుల క్లోరిన్ గ్యాస్‌తో నిండిన ట్యాంకర్లను షిప్పుల్లో ఎక్కించే సమయంలో ప్రమాదం జరిగింది. క్లోరిన్ గ్యాస్ ఉన్న ట్యాంకర్ ప్రమాదవశాత్తు కిందిపడిపోవడంలో భారీ పేలుడు సంభవించింది. పసుపు రంగు క్లోరిన్ విష వాయువు ఆ ప్రాంతంలో విస్తరించింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 251 మంది గాయపడ్డారని ప్రభుత్వ ప్రతినిధి ఫైసల్ అల్ షాబౌల్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 199 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇదిలా ఉండగా.. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విష వాయువు వ్యాప్తి చెందిన నేపథ్యంలో ఓడరేవుకు ఉత్తరాన 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న అకాబా నగర ప్రజలు మాస్కులు ధరించి ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు. కిటికీలు, తలుపులు మూసివేసుకోవాలని హెచ్చరించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. At least 10 people have died and more than 250 injured after a toxic gas leak at Aqaba Port in Jordan. pic.twitter.com/kjTDaPkelw — Suzanne (@suzanneb315) June 27, 2022 ఇది కూడా చదవండి: అమెరికాలో విషాదం.. 42 మంది మృతి -
కర్ణాటకలో విషవాయువు లీకేజీ... ఐదుగురి దుర్మరణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో చేపల ప్రాసెసింగ్ పరిశ్రమలో విషవాయువు లీకై ఐదుగురు కార్మికులు మరణించారు. శ్రీ ఉల్కా మత్స్య సంస్కరణ కర్మాగారంలో ఈ ప్రమాదం జరిగింది. 20 అడుగుల లోతున్న ట్యాంకు నుంచి చేపలను బయటకు తీసేందుకు ఆదివారం రాత్రి 8 మంది కార్మికులు దిగారు. చేపల వ్యర్థాలను తొలగించేందుకు వాడే విష వాయువు లీకవడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు సోమవారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
చైనాలో గ్యాస్ లీక్: ఏడుగురు మృతి
బీజింగ్: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో టాక్సిక్ గ్యాస్ లీకైనది. ఈ విష వాయువు పీల్చుకుని ఏడుగురు మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో యిబిన్ నగరంలోని చాంగ్నింగ్ కౌంటీలోని ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఆ ఫ్యాక్టరీలో మరమ్మత్తు పనులు జరిగే సమయంలో ఈ గ్యాస్ లీకైనట్లు జిన్హువా కౌంటీ అధికారులు తెలిపారు. విషవాయువు పీల్చుకుని బాధితులు మొదట స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లారు. వారికి వైద్య చికిత్స అందించడానికి ఆస్పతికి తరలించగా మార్గమధ్యలోనే మరణించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. (చదవండి: తగ్గుతున్న కరోనా: 2 లక్షల దిగువకు కొత్త కేసులు) -
అంబర్‌పేట్‌లో విష వాయువుల కలకలం
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేటలో విష వాయువుల లీకేజీ కలకలం రేపింది. మారుతినగర్లో విష రసాయనాలు లీకేజీ కావడంతో శుక్రవారం ఉదయం స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రెసిడెన్షియల్ ఏరియాలో డెక్కన్ కెమికల్స్ కంపెనీ యాసిడ్ నిల్వలు ఉంచింది. ఈ రసాయనాలు నిల్వ చేసిన ట్యాంకర్ పగలడంతో విష వాయువులు లీకవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు ఊపరి ఆడక ఇబ్బంలు పడుతున్నారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు డెక్కన్ కంపెనీని సీజ్ చేశారు. -
విష వాయువు.. ఉక్కిరిబిక్కిరి
సాక్షి, మెదక్: అర్ధరాత్రి ఫార్మా కంపెనీ వదిలిన విషవాయువుతో ఉక్కిరి బిక్కిరి అయినట్లు చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామ శివారులోని కార్తికేయ ఫార్మా కంపెనీలో రసాయన లీకేజీతో ఒక్కసారిగా ఊరంతా పొగ కమ్మకుందని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో దుర్వాసనతో పొగ కమ్ముకోవడంతో ఊపిరి ఆడని పరిస్థితి నెలకొందన్నారు. కంట్లో మంటలతో పాటు ఊపిరిరాడని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు తెలిపారు. దీంతో విషయం గమనించిన గ్రామ యువకులు కొందరు పరిశ్రమ వద్దకు పరుగుతీసి విషయంపై నిలదీయడంతో అప్రమత్తమైన పరిశ్రమ సిబ్బంది ఉత్పత్తిని నిలిపివేశారు. ఉదయం పరిశ్రమ వద్దకు చేరుకున్న గ్రామ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెట్పీటీసీ రమణ విషయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోయి ఫిర్యాదు అందించారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయని రాత్రి మరోసారి జరగడంతో ఇబ్బందులకు గురైనట్లు తెలిపారు. ప్రజల ఫ్రాణాలతో ఆటలాడుతున్న పరిశ్రమను మూసివేయాలని కోరారు. ఈ విషయంపై పరిశ్రమ ఎండీ కార్తీకేయ మాట్లాడుతూ తమ పరిశ్రమలో ఉత్పత్తులు ప్రాణాంతకమైనవి కావని తెలిపారు. అమ్మోనియం సల్పేట్ ఉత్పత్తి చేస్తామని తెలిపారు. స్టీమ్ పైప్ లీకేజీ అవడంతో సమస్య వచ్చిందని తెలిపారు. ఫార్మా కంపెనీ సీజ్‌కు అదనపు కలెక్టర్ అదేశాలు చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామశివారులోని కార్తీకేయ ఫార్మా కంపెనీని సీజ్ చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆయన ఫార్మా పరిశ్రమను పరిశీలించి కనీస జాగ్రత్తలు కూడ తీసుకోవడంలేదని మేనేజర్‌ను ప్రశ్నించారు. పరిశ్రమ మేనేజర్ నుంచి సరైన సమా«ధానం రాకపోవడంతో వెంటనే పరిశ్రమను సీజ్‌చేస్తున్నట్లు తెలిపారు. పీసీబీ అధికారులు వచ్చి పరిశీలించి నివేదిక ఇచ్చేవరకు పరిశ్రమలో ఉత్పత్తులు నిర్వహించవద్దని హెచ్చరించారు. పరిశ్రమ రసాయన లీకేజీ విషయం అధికారులకు సమాచారం అందించడంలో విఫలమైన వీఆర్ఓకు మెమో జారీ చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. మెదక్ ఆర్డీఓ సాయిరామ్, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి గ్రామప్రజలతో మాట్లాడి వివరాలు సేకరించారు. పీసీబీ అధికారుల పరిశీలన... విషవాయువు లీకైన కార్తీకేయ ఫార్మా పరిశ్రమలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవి కుమార్, ఏఈ శిరీష, పరిశ్రమల కేంద్రం జిల్లా అధికారి కృష్ణమూర్తి, కర్మాగారాల మేనేజర్ లక్ష్మి విచారణ నిర్వహించారు. పరిశ్రమలో ప్రమాదానికి కారణంతో పాటు కాలుష్యంపై పరిశీలనలు జరిపారు. ఈ సందర్భంగా పరిశ్రమలోని రసాయానాలను సేకరించి ల్యాబ్‌కు తరలిచనున్నట్లు తెలిపారు. -
ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకేజీ
సాక్షి ప్రతినిధి విశాఖపట్నం/సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): విశాఖ పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సోమవారం అర్ధరాత్రి ఓ రియాక్టర్ నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్ విషవాయువు లీకైంది. విషవాయువును పీల్చిన ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు కోలుకోగా.. ఒకరికి వెంటిలేటర్‌పై చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద విషయం తెలియగానే జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కంపెనీని షట్‌డౌన్ చేయించారు. ప్రమాద ప్రభావం ఫ్యాక్టరీలో ఒక రియాక్టర్ ఉన్న విభాగానికి మాత్రమే పరిమితమవ్వడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన కలెక్టర్ వి.వినయ్‌చంద్.(ఇన్సెట్) ప్రమాదంలో మృతి చెందిన నరేంద్ర (ఫైల్) ప్రమాదం జరిగిందిలా.. విశాఖకు 42 కి.మీ. దూరంలో ఉన్న పరవాడ ఫార్మాసిటీలో 60 వరకు కెమికల్ కంపెనీలున్నాయి. ఫార్మాసిటీ రోడ్ నంబర్–3లోని 59 ప్లాట్‌లో ఉన్న సాయినార్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో రబీప్రజాల్ సోడియం, డోమ్పారిడోన్, ఓమోప్రజోల్ మొదలైన డ్రగ్స్ ఉత్పత్తుల తయారీ జరుగుతోంది. కంపెనీలో 137 మంది సిబ్బంది, కార్మికులు పనిచేస్తుండగా.. సోమవారం రాత్రి షిఫ్ట్‌లో 26 మంది ఉన్నారు. రాత్రి 11 గంటలకు షిఫ్ట్ ఇన్చార్జి రావి నరేంద్ర (33), కెమిస్ట్ మహంతి గౌరీశంకర్(26), హెల్పర్లు ఆనంద్‌బాబు, డి.జానకిరామ్, ఎం.సూర్యనారాయణ, ఎల్వీ చంద్రశేఖర్ కలసి ప్రొడక్షన్ బ్లాక్‌లోకి వెళ్లారు. 11.25 గంటలకు ఓమోప్రజోల్ అనే డ్రగ్‌కు సంబంధించిన బల్క్ రసాయనానికి చెందిన మదర్ లిక్కర్‌ను ఒక రియాక్టర్ నుంచి మరో రియాక్టర్‌కు పంపించడం ప్రారంభించారు. స్టేజ్–3 వద్ద సెంటర్ ఫేజ్ క్యాచ్ పాయింట్‌లోని వ్యర్థ రసాయనాన్ని మరో రియాక్టర్‌లోకి పంపించే క్రమంలో ఎస్ఎస్ఆర్–107 రియాక్టర్లో ఉన్న పాత కెమికల్‌తో కలిసి రసాయనిక చర్య వికటించింది. ప్రమాదకరమైన హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు వెలువడింది. షిఫ్ట్ ఇన్చార్జ్ నరేంద్ర, కెమిస్ట్ గౌరీశంకర్ కట్టడి చేసే ప్రయత్నం చేశారు. కానీ అదుపు చెయ్యలేకపోయారు. ఈలోగా విషవాయువు పీల్చడంతో కుప్పకూలిపోయారు. కాస్త దూరంలో ఉన్న నలుగురు హెల్పర్లు వెంటనే వీరి వద్దకొచ్చారు. వారు సైతం అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో.. వెంటనే అప్రమత్తమైన ఇతర సిబ్బంది యూనిట్‌ను షట్‌డౌన్ చేశారు. బాధితులను రాంకీ సంస్థకు చెందిన అంబులెన్స్‌లో గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నరేంద్ర, గౌరీశంకర్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో.. మృతదేహాల్ని కేజీహెచ్‌కి తరలించారు. ఆనంద్‌బాబు, జానకిరామ్, సూర్యనారాయణల ఆరోగ్యం నిలకడగా ఉంది. చంద్రశేఖర్(37) పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో విశాఖ కేర్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించండి: సీఎం ఆదేశం ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై సీఎంవో అధికారులను అడిగి ఆయన వివరాలు తెలుసుకున్నారు. రియాక్టర్ వద్ద లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు. ముందుజాగ్రత్తగా ఫ్యాక్టరీని షట్‌డౌన్ చేయించారని, ప్రమాదం ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్ ఉన్న విభాగానికి పరిమితమని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని నివేదించారు. పెళ్లయిన రెండు నెలలకే.. ప్రమాదంలో మృత్యువాత పడిన మహంతి గౌరీశంకర్(26)కు రెండు నెలల కిందటే వివాహం జరిగింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన ఈ యువకుడు మూడేళ్లుగా సాయినార్‌లో కెమిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఏప్రిల్‌లో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని సంచాం గ్రామ యువతితో వివాహమైంది. కరోనా వల్ల సమీప బంధువుల సమక్షంలో సాదాసీదాగా పెళ్లి జరిగింది. లాక్డౌన్ తరువాత ఘనంగా రిసెప్షన్ చేయాలనుకున్నారు. అంతలోనే మృత్యువాతపడ్డాడు. ► మరో మృతుడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నరేంద్ర(33) ఏడాది కిందటే హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చి ‘సాయినార్’లో షిఫ్ట్ ఇన్చార్జిగా చేరాడు. భార్య, కుమార్తె తెనాలిలో ఉంటున్నారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. తక్షణం స్పందించిన అధికార యంత్రాంగం ప్రమాద ఘటనపై అధికార యంత్రాంగం తక్షణం స్పందించింది. పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా హుటాహుటిన ఫార్మా కంపెనీకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కలెక్టర్ వినయ్‌చంద్.. అధికారులను ఘటనాస్థలికి పంపించారు. అనంతరం ఘటనాస్థలికి వెళ్లిన కలెక్టర్ ప్రమాదం జరిగిన తీరుపై ప్రభుత్వానికి నివేదించారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగ్రాతులను పరామర్శించారు. ► గ్యాస్ ప్రభావం పరిసర కంపెనీలు, సమీప జనావాసాలపై ఎంతమేరకు ఉంటుందనే విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఫోరెన్సిక్ విభాగ సిబ్బంది పరిశీలించారు. కంపెనీ నుంచి బయటకు గ్యాస్ లీకేజీ కాలేదని నిర్ధారించారు. ► గ్యాస్ లీకేజీ ఘటనకు కారణాలను అధ్యయనం చేయడానికి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎ.రామలింగేశ్వరరాజు, తదితరులతో కూడిన నలుగురు సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాత్రి షిఫ్ట్‌లో సిబ్బంది తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు సమాచారం. ► ఫ్యాక్టరీలోని ఒక యూనిట్‌కు పరిమితమని, దీనివల్ల చుట్టుపక్కల ఉన్న కంపెనీలకు ఎలాంటి ముప్పు లేదని తేలడంతో ఆ చుట్టూ ఉన్న 12 ఫార్మా కంపెనీలు తమ యూనిట్లను యధావిధిగా నిర్వహించాయి. ► మంత్రి అవంతి శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్ వేర్వేరుగా ఘటనా స్థలిని సందర్శించి.. ప్రమాదంపై ఆరా తీశారు. అనంతరం.. అస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. -
కౌంటర్లు దాఖలు చేయండి
సాక్షి, అమరావతి: విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకై ప్రాణనష్టం జరిగిన ఘటనకు సంబంధించి ఆయా కమిటీల నుంచి నివేదికలు రావాల్సి ఉందని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. ఈ నివేదికలు అందిన వెంటనే కోర్టు ముందుంచుతామని తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామన్నారు. అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్జీ పాలిమర్స్ ఘటనను హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎల్జీ పాలిమర్స్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. ఎటువంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే పలు కమిటీలు ఏర్పాటు చేసిందన్నారు. ఈ కమిటీల్లో ఏదో ఒక కమిటీకి విచారణ బాధ్యతలు అప్పగించినా అభ్యంతరం లేదన్నారు. ఇప్పటికే తమ డైరెక్టర్లు పాస్‌పోర్టులను అధికారులకు స్వాధీనం చేశారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని ఇరుపక్షాలను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. భూముల విక్రయంపై పిల్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు రాష్ట్రంలో ఖాళీ భూములను వేలం ద్వారా విక్రయించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం విక్రయించతలపెట్టిన భూముల్లో గతంలో ప్రైవేటు వ్యక్తులు ప్రజాప్రయోజనార్థం ఇచ్చిన భూములు కూడా ఉన్నాయని, అందువల్ల ఆ భూ విక్రయాలను అడ్డుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త తోట సురేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. -
ఆరుగురి ఊపిరి తీసిన విషవాయువు
కోల్‌కతా: విషవాయువు పీల్చడంతో ఆరుగురు మృతి చెందిన విషాదకర ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. హజీనగర్‌లోని పేపర్ మిల్లులో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. హజీనగర్‌లోని పేపర్ మిల్లులో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పంపులను సరిచేసేందుకు ఇద్దరు కార్మికులు మిల్లు లోపల గల బావిలోకి దిగారు. మిల్లు నుంచి వెలువడే వ్యర్థాలతో నిండిన బావిలో విషవాయువు వెలువడటంతో వారు స్పృహ తప్పి పడిపోయారు. లోపలికి దిగినవారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారికి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని మరో నలుగురు కార్మికులు కూడా బావిలోకి దిగారు. కానీ వారు కూడా విషవాయువు బారిన పడటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గమనించిన ఉద్యోగులు ఫైర్ బ్రిగేడ్‌ను అప్రమత్తం చేసి కార్మికులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. విషవాయువును అధికంగా పీల్చడంతో వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే.. పేపర్ మిల్లులోని వ్యర్థాలను బయటికి వదిలేందుకు సరైన వసతి లేకపోవడంతో బావిలోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు. విషవాయులున్న బావిలోకి దిగిన కార్మికులకు గ్యాస్ మాస్కులు కూడా అందించలేదు. కనీస రక్షణ చర్యలు తీసుకోకుండా, కార్మికుల మృతికి కారణమైన మిల్లు యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
పరిశ్రమలో విషవాయువు వెలువడి..
చిట్యాల (నకిరేకల్) : పరిశ్రమలో విషవాయువు వెలువడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోని అతులిత రసాయన పరిశ్రమలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని ఏపూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఉప్పల అంజయ్య కుమారుడు సాయికిరణ్(20) రెండు నెలలుగా మండలంలోని అతులిత రసాయన పరిశ్రమలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం పరిశ్రమలోని ఓ యూనిట్లో అకస్మాత్తుగా విషవాయువులు వెలువడ్డాయి. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న సాయికిరణ్ ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో సాయికిరణ్‌ను పరిశ్రమ నిర్వహణ అధికారులు ఆ గ్రామ శివారులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సాయికిరణ్‌ను పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. పరిశ్రమ ఎదుట ఆందోళన.. సాయికిరణ్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్నేహితులు పరిశ్రమ వద్దకు భారీగా చేరుకున్నారు. సా యికిరణ్ మృతదేహాన్ని పరిశ్రమ ఆవరణలో ఉంచి ఆందోళనకు దిగారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సాయికిరణ్ మృతి చెందాడని ఆరోపించారు. యజమాన్యం సాయికిరణ్ కుటుంబానికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. పరిశ్రమ యజమాన్యం కొంత పరిహారం చెల్లించేందుకు అంగీకరించటంతో ఆందో ళన విరమించారు. కాగా చేతికందిన కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. -
విష వాయువుతో వందలాది విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, లక్నో: ఓ చెక్కెర కర్మాగారం నుంచి వెలువడిన విష వాయువు(టాక్సిక్) ను పీల్చి 300 మంది విధ్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షామ్లి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ పక్కనే ఓ చెక్కెర కర్మాగారం ఉంది. మంగళవారం ఉదయం ఆ కర్మాగారం నుంచి వెలువడిన విష గాలులు పీల్చిన విధ్యార్థులు వాంతులు, శ్వాసకోశ, కడుపు నొప్పి, వికారాలతో ఇబ్బందులు పడ్డారు. దీంతో స్కూలు యాజమాన్యం దాదాపు 300 మంది విధ్యార్థిని విధ్యార్థులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ కర్మాగారం నుంచి వెలువడుతున్న రసాయనాలు విష పూరిత దుర్వాసన వెదజల్లుతున్నాయని, దీని కారణంగా పిల్లలు స్పృహతప్పి పడిపోయిన ఘటనలు చాలా ఉన్నాయని స్థానికులు చెప్పారు. -
షిప్ కంపెనీపై కేసు నమోదు
మోర్తాడ్(బాల్కొండ): విషవాయువు ప్రభావం తో ముగ్గురు భారతీయ కార్మికులు మృతి చెం దిన ఘటనపై ఒమన్ ప్రభుత్వం తీవ్రంగా స్పం దించింది. షిప్ కంపెనీ నిర్లక్ష్యం వల్లనే భారతీ య కార్మికులు మృతి చెందడంతో, ఈ ఘటనను ప్రభుత్వంపై పడిన మచ్చగా భావిస్తోంది. ఈ క్రమంలో షిప్ కంపెనీపై కేసు నమోదు చేసిన అక్కడి ప్రభుత్వం పరిహారం విషయం తేలిన తరువాతనే మృతదేహాలను స్వస్థలాలకు పంపిం చాలని నిర్ణయించింది. గత శనివారం రాత్రి ఒమన్‌లోని షిప్ యార్డులో సామగ్రిని లోడింగ్ అన్లోడింగ్ చేసే క్రమంలో విషవాయువు ప్రబలి నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌కు చెందిన తిరుమలేశ్, జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాయిపల్లికి చెందిన రమేశ్, తమిళనాడుకి చెందిన మణి మృతి చెందిన విషయం విదితమే. ఈ మరణాలకు కంపెనీ బాధ్యత వహించాలని ఒమన్ ప్రభుత్వం ఆదేశించిందని అక్కడే షిప్ యార్డులో పని చేస్తున్న మోర్తాడ్వాసి కుదురు పాక ప్రదీప్ ‘సాక్షి’కి ఫోన్లో వివరించారు. సదరు కంపెనీ అమెరికాకు చెందినది కావటంతో ఆ దేశ విదేశాంగ శాఖ దృష్టికి ఈ ఘటనను ఒమన్ ప్రభుత్వం తీసుకెళ్లిందని తెలిపారు. -
లెదర్ కాంప్లెక్స్‌లో విషాదం.. ముగ్గురి మృతి
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లోని ఓ లెదర్ కాంప్లెక్స్ లో విషాదం చోటుచేసుకుంది. డ్రైనేజీ పైప్ లైన్ నుంచి వెలువడిన విష వాయువులను పీల్చిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. కోల్ కతా లెదర్ కంపెనీలో సోమవారం ఐదుగురు కార్మికులు డ్రైనేజీ పైప్ లైన్ శుభ్రం చేస్తున్నారు. ఆ పైప్ లైన్ నుంచి విష వాయువులు వెలువడ్డాయి. అందులో పనిచేస్తున్న కార్మికులు ప్రమాదవశాత్తూ ఆ వాయువులను పీల్చడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్లు కోల్ కతా ఈస్ట్ జోన్ ఏఎస్పీ అరిజిత్ సిన్హా తెలిపారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన మిగతా కార్మికులు.. మృతిచెందిన తోటి కార్మికుల కుటుంబాలకు తగిన నష్ట పరిహారం అందించాలని ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్పీ వివరించారు.