అనకాపల్లిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శిస్తున్న మంత్రి అమర్‌నాథ్
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్ అపెరల్ పార్క్ సిటీలోని సీడ్స్ కంపెనీలో మరోసారి విష వాయువులు లీకైన దుర్ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలిసేంతవరకు సంఘటన జరిగిన యూనిట్‌లోని విభాగాన్ని తాత్కాలికంగా మూసివేయాల్సిందిగా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. సీడ్స్ కంపెనీలో జరిగిన ప్రమాదాలకు కంపెనీ యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్ స్పష్టం చేశారు.
ఆ విభాగాన్ని తాత్కాలికంగా మూసివేయడం వల్ల కార్మికులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూస్తామని హామీ ఇచ్చారు. బుధవారం ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డీఎంహెచ్‌ఓ డాక్టర్ హేమంత్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రావణ్‌కుమార్‌ను ఆరా తీశారు. బాధితులకు పూర్తిగా నయమయ్యే వరకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన కారణాలను తెలుసుకున్నారు.
బాధితులు మాట్లాడుతూ.. మంగళవారం సాయంత్రం తాము క్యాంటీన్‌కి వెళ్తున్నప్పుడు కాలిన వాసన వెలువడిందని, అప్పటికే తమకు కళ్లు తిరిగి, వికారంగా ఉండటం, వాంతులు రాగా.. కొంతమంది స్పృహ కోల్పోయారని వివరించారు. అనంతరం అక్కడ నుంచి అచ్యుతాపురం బ్రాండిక్స్ ఆవరణలో ఉన్న సీడ్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ అయిన ఎం–1 యూనిట్‌ను కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజుతో కలిసి మంత్రి అమర్‌నాథ్ పరిశీలించారు. సీడ్స్‌లో ఇటువంటి ఘటన రెండోసారి జరగడం బాధాకరమన్నారు.
భద్రతా ప్రమాణాలపై ఉన్నతస్థాయి కమిటీ
రాష్ట్రంలోని ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై ఉన్నతస్థాయి కమిటీ నియమించి సేఫ్టీ ఆడిట్ జరిపిస్తామని మంత్రి అమర్‌నాథ్ చెప్పారు. గతంలో అస్వస్థతకు గురైనవారు ఆరోగ్యపరంగా భవిష్యత్‌లో ఏవిధమైన ఇబ్బందులు పడతారనే విషయాన్ని తెలుసుకునేందుకు ఐసీఎంఆర్‌కు లేఖ రాశామని చెప్పారు. గతంలో ఆ కంపెనీలో గ్యాస్ లీకయినప్పుడు అందుకు గల కారణాలు తెలుసుకునేందుకు జిల్లాస్థాయి అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు, ఏయూ ప్రొఫెసర్లతో కమిటీని వేశామన్నారు.
ఆ కమిటీ సీడ్స్ నుంచి కొన్ని శాంపిల్స్ సేకరించి పరీక్షించగా అందులో ‘కాంప్లెక్స్ గ్యాస్’ ఉన్నట్లు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చిందన్నారు. చెదల నివారణకు వాడే క్రిమిసంహారక మందు ఏసీ యంత్రాల్లోకి వెళ్లి ప్రమాదకరమైన విషవాయువులు బయటకు వెలువడ్డాయని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందన్నారు. ఆ నివేదిక ఆధారంగా కంపెనీ యాజమాన్యానికి సెక్షన్–41 కింద జూన్ 30న షోకాజ్ నోటీసులు జారీ చేశామని, రెండు నెలల్లో ఈ నోటీసుకు సమాధానం ఇవ్వకుంటే ప్రాసిక్యూట్ చేస్తామని కూడా హెచ్చరించామని వివరించారు. దీనిపై ఆ సంస్థ యాజమాన్యం స్పందించాల్సి ఉందన్నారు.
37 మంది డిశ్చార్జి
విష వాయువుల లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురై అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా వైద్యాలయం, ఉషా ప్రైమ్ ఆస్పత్రి, సత్యదేవ్ ఆస్పత్రి, విశాఖలోని మెడికేర్, వైభవ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 123 మంది బాధితుల్లో 37 మందిని బుధవారం డిశ్చార్జి చేశారు. మిగిలిన 86 మందికి చికిత్స అందిస్తున్నామని, వారు క్రమంగా కోలుకుంటున్నారని డీఎంహెచ్‌వో హేమంత్‌కుమార్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment