tpcc complaints
-
పీసీసీ చీఫ్‌పై ఇన్ని ఫిర్యాదులా?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌పై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి సీనియర్లు, ఇతర నేతల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని.. దీనికి కారణాలేంటని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరా తీశారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను తీసుకోవాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, ఇన్చార్జి కార్యదర్శులు బోసురాజు, రోహిత్ చౌదరి, నదీం జావేద్‌లకు సూచించారు. పార్టీ సీనియర్లతో రేవంత్‌కు ఉన్న అభిప్రాయభేదాలు, సమన్వయలేమిని వెంటనే పరిష్కరించేలా నేతలందరితో మాట్లాడాలని మార్గదర్శనం చేశారు. పార్టీ వీడే అవకాశం ఉన్న నేతలతో ప్రత్యేకంగా చర్చించి వారి అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం వెంటనే చేపట్టాలని ఆదేశించారు. బుధవారం ఢిల్లీలో మాణిక్యం ఠాగూర్ సహా ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాలు, మునుగోడు ఉప ఎన్నిక, మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజు నోటీసులు, రేవంత్‌పై వస్తున్న వరుస ఫిర్యాదులపై చర్చించారు. ముఖ్యమైన అంశాల్లో సీనియర్ల అభిప్రాయాన్ని గౌరవించకపోవడం, సామాన్య కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం, భూముల వ్యవహారాలకు సంబంధించిన అంశాలు మినహా ఇతర ప్రజా సంబంధిత సమస్యలపై పోరాటం చేయకపోవడం వంటి అంశాలపై ఫిర్యాదు చేశారని.. వీటిని సరిదిద్దే బాధ్యతను మీరు తీసుకోవాలంటూ ఖర్గే సూచించారు. అసంతృప్త నేతలను గుర్తించండి మర్రి శశిధర్‌రెడ్డి వంటి సీనియర్ నేతలు పార్టీ వీడే అవకాశం ఉన్నా... పీసీసీ చీఫ్ సహా ఇతర రాష్ట్ర నేతలు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేయకపోవడంపై ఖర్గే అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సీనియర్లు ఎవరైనా అసంతృప్తితో ఉంటే, అలాంటి వారిని ముందే గుర్తించి చర్చలు జరపాలని.. అధిష్టానం దృష్టికి ఆయా అంశాలను తీసుకురావాలని పేర్కొన్నారు. పార్టీలో అసంతృప్తి పెరిగితే తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు అవకాశాలు పెరుగుతాయని, వీటిని కట్టడి చేసే చర్యలు ముందుగానే తీసుకోవాలని సూచించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యల విషయంలో తొందరపాటు వద్దని, ఆచితూచి నిర్ణయం తీసుకుందామని ఖర్గే చెప్పారని సమాచారం. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఏవిధంగా సమాయత్తం కావాలి? శ్రేణులను ఏ విధంగా కాపాడుకోవాలి? తదితర అంశాలపై అనుసరించాల్సిన ప్రణాళికలను ఖర్గే సూచించారు. ఇదీ చదవండి: రామోజీ మీ టూరిజానికి ఆ భూములే కావాలా?: సీపీఎం -
ఎంసెట్ లీకులో మంత్రులను బర్తరఫ్ చేయండి
గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన టీపీసీసీ బృందం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు వారు మంగళవారం గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మల్లన్నసాగర్ నిర్బంధం, ఎంసెట్ లీకుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ రెండు వేర్వేరు వినతిపత్రాలను సమర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీమంత్రి డి.కె.అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, జి.ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ ఎం.రంగారెడ్డి, మాజీ ఎంపీ ప్రభాకర్, టీపీసీసీ కిసాన్‌సెల్ నాయకుడు ఎం.కోదండ రెడ్డి తదితరులు గవర్నర్‌ను కలసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టేవిధంగా ఎంసెట్ ప్రశ్నపత్రాల లీక్ జరిగిందన్నారు. విద్య, వైద్య శాఖ మంత్రులతో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను బర్తరఫ్ చేసి, పారదర్శకంగా విచారణ జరపాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు. ప్రభుత్వ రంగసంస్థలకు కాకుండా బ్లాక్‌లిస్టులో ఉన్న ఒక ప్రైవేటు సంస్థకు ఎంసెట్ నిర్వహణ బాధ్యతను అప్పగించారని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మల్లన్నసాగర్ ముంపు గ్రామాలను సందర్శిస్తామంటే ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్లలో పెడుతున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. రైతు సంఘాల నేతలను, ప్రజా సంఘాల నేతలను, జేఏసీ నేతలను కూడా అరెస్టు చేసి జైళ్లలో పెడుతూ, పాశవిక పాలన చేస్తున్నారని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను నియోజకవర్గంలోనూ పర్యటించనీయకుండా పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం, రాజ్యాంగం ఏమీ అమలు కావడం లేదన్నారు. వీటిపై గవర్నర్ స్పందించి, తగిన చర్యలను తీసుకోవాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.