ఎంసెట్ లీకులో మంత్రులను బర్తరఫ్ చేయండి
గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన టీపీసీసీ బృందం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు వారు మంగళవారం గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మల్లన్నసాగర్ నిర్బంధం, ఎంసెట్ లీకుపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ రెండు వేర్వేరు వినతిపత్రాలను సమర్పించారు.
టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీమంత్రి డి.కె.అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, జి.ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, ఎమ్మెల్సీ ఎం.రంగారెడ్డి, మాజీ ఎంపీ ప్రభాకర్, టీపీసీసీ కిసాన్‌సెల్ నాయకుడు ఎం.కోదండ రెడ్డి తదితరులు గవర్నర్‌ను కలసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టేవిధంగా ఎంసెట్ ప్రశ్నపత్రాల లీక్ జరిగిందన్నారు. విద్య, వైద్య శాఖ మంత్రులతో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను బర్తరఫ్ చేసి, పారదర్శకంగా విచారణ జరపాలని గవర్నర్‌ను కోరినట్టు చెప్పారు.
ప్రభుత్వ రంగసంస్థలకు కాకుండా బ్లాక్‌లిస్టులో ఉన్న ఒక ప్రైవేటు సంస్థకు ఎంసెట్ నిర్వహణ బాధ్యతను అప్పగించారని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మల్లన్నసాగర్ ముంపు గ్రామాలను సందర్శిస్తామంటే ప్రతిపక్ష నేతలను అరెస్టు చేసి పోలీసుస్టేషన్లలో పెడుతున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. రైతు సంఘాల నేతలను, ప్రజా సంఘాల నేతలను, జేఏసీ నేతలను కూడా అరెస్టు చేసి జైళ్లలో పెడుతూ, పాశవిక పాలన చేస్తున్నారని విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను నియోజకవర్గంలోనూ పర్యటించనీయకుండా పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం, రాజ్యాంగం ఏమీ అమలు కావడం లేదన్నారు. వీటిపై గవర్నర్ స్పందించి, తగిన చర్యలను తీసుకోవాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.