ఖజానా భర్తీకి ‘పంచతంత్రం’
సాక్షి, సిటీబ్యూరో: ఖాళీ అవుతున్న ఖజానాను నింపుకునేందుకు జీహెచ్ఎంసీ శరవేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి రూ.500 కోట్లు డ్రా చేసుకున్న జీహెచ్ఎంసీ.. పరిస్థితి మెరుగపడకుంటే రెండునెలల తర్వాత సిబ్బంది వేతనాల చెల్లింపులు సైతం కష్టంగా మారనుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఐదు రకాల పన్నుల ద్వారా ఆదాయం పెంపునకు పంచతంత్రాన్ని అమలు చేయాలని భావిస్తోంది.
ఇందులో భాగంగా ట్రేడ్ లెసైన్సుల ఫీజులపై దృష్టి సారించింది. ట్రేడ్ లెసైన్సుల కోసం జీహెచ్ఎంసీలో పేర్లు నమోదు చేసుకున్న వ్యాపార సంస్థలు 1.50లక్షల వరకు ఉన్నప్పటికీ వాటిల్లో 48 వేల సంస్థలు కూడా ఫీజులు చెల్లించడం లేదు. వాణిజ్యపన్నుల శాఖ వద్ద ఉన్న వివరాలను చూసినా లక్షా పదివేలకు పైగా వ్యాపారాలున్నాయి. వీటన్నింటినుంచీ రావాల్సిన ట్రేడ్ లెసైన్సు ఫీజు వసూలైతే జీహెచ్ఎంసీకి వంద కోట్ల మేర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ, గత ఆర్థిక సంవత్సరం రూ. 30 కోట్లు కూడా వసూలు కాలేదు. దీంతో వ్యాపార సంస్థలన్నింటి వివరాలు జల్లెడ పట్టేందుకు జీహెచ్ ఎంసీ సిద్ధమైంది.
ఇందులో భాగంగా సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు మొదలు బిల్ కలెక్టర్లు, లెసైన్స్ ఆఫీసర్లు, శానిటేషన్ సిబ్బందితో సహ సమస్త యంత్రాంగం వ్యాపార సంస్థల వివరాలన్నింటినీ సేకరించనుంది. ఆపై ట్రేడ్ లెసైన్సులు లేని వారిని లెసైన్సులు తీసుకునేలా చర్యలు చేపడతారు. లై సెన్సులున్న వారి నుంచి ఫీజులు వసూలు చేస్తారు. ఆన్లైన్ ద్వారా సులభంగా ఫీజు చెల్లించే విధానాన్ని వివరిస్తారు. ఇలా..అతిత్వరలో ట్రేడ్ లెసైన్సుల ఫీజుల కోసం స్పెషల్ డ్రై వ్ నిర్వహించాలని కార్యాచరణ సిద్ధం చేశారు. అంతేకాకుండా లెసైన్సు పరిధిలోకి కొత్త సంస్థలను తేనున్నారు. మొబైల్ కంపెనీలు, వైన్స్ దుకాణాలు, హాస్టళ్లు తదితరమైన వాటికి సంబంధించి ట్రేడ్లెసైన్సు ఫీజులు వసూలు చేసే అంశంలో స్పష్టత లేదు. వీటిపై స్పష్టత నిస్తూ జీవోలను సవరించే అవకాశం ఉంది.