Trade unions strike
-
కొత్త ఏడాదిలో అలర్ట్ : దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల్లో పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆయా కంపెనీల ఉద్యోగుల్లో కొన్ని వర్గాలు జనవరి 4న సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రతిపాదిత పునర్వ్యవస్థీకరణతో ప్రభుత్వ రంగ సంస్థలు బలహీనం అవుతాయని జాయింట్ ఫోరం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (జేఎఫ్‌టీయూ) ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల లాభాల్లో ఉన్న ఆఫీసులతో పాటు పలు కార్యాలయాలను విలీనం చేయడమో లేదా మూసివేయడమో జరుగుతుందని పేర్కొంది. గత కొన్నేళ్లుగా దాదాపు 1,000 కార్యాలయాలు మూతబడ్డాయని జేఎఫ్‌టీయూ తెలిపింది. ఇవన్నీ ఎక్కువగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఉండేవని వివరించింది. ఫలితంగా పాలసీదారులపైనా ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొంది. ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ సౌరభ్ మిశ్రా ఇష్టా రీతిగా వ్యవహరిస్తూ నేషనల్ ఇన్సూరెన్స్ బోర్డుపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని జేఎఫ్‌టీయూ తెలిపింది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, జీఐసీ రీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీల్లోని 50,000 మంది పైచిలుకు ఉద్యోగులు, అధికారులు జనవరి 4న ఒక రోజు సమ్మెకు దిగనున్నట్లు జేఎఫ్‌టీయూ తెలిపింది. -
దేశవ్యాప్త సమ్మె పాక్షికం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు తలపెట్టిన రెండురోజుల దేశవ్యాప్త సమ్మె సోమవారం ప్రారంభమయ్యింది. సమ్మెకు మిశ్రమ స్పందన లభించింది. పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం కనిపించింది. బ్యాంకింగ్, ప్రజా రవాణా వ్యవస్థ సేవలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో సమ్మె పాక్షికంగా విజయవంతమయ్యింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగాయి. అత్యవసర సేవలకు ఎలాంటి విఘాతం కలగలేదు. సానుకూల స్పందన: ఏఐటీయూసీ దేశవ్యాప్త సమ్మెలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ తదితర జాతీయ కార్మిక సంఘాలు పాలుపంచుకున్నాయి. సమ్మెకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ తెలిపారు. అస్సాం, హరియాణా, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, బిహార్, పంజాబ్, రాజస్తాన్, గోవా, ఒడిశా తదితర రాష్ట్రాల్లో సమ్మెకు ప్రజలు మద్దతు తెలిపారని వెల్లడించారు. దేశవ్యాప్త సమ్మె మంగళవారం కూడా కొనసాగనుంది. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను తక్షణమే విరమించుకోవాలని, జాతీయ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ఆర్ఈజీఏ) కింద పనిచేసే కూలీలకు వేతనాలు పెంచాలని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
బ్యాంక్ సేవలపై భారత్ బంద్ ప్రభావం
న్యూఢిల్లీ/ముంబై/చెన్నై: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్... బ్యాంక్‌ల సేవలపై బాగానే ప్రభావం చూపించింది. వాహన కంపెనీల ప్లాంట్లపై సమ్మె ప్రభావం పాక్షికంగానే ఉంది. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎమ్ఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ తదితర పది కార్మిక సంఘాలు నిర్వహించిన ఈ సమ్మెకు పలు బ్యాంక్ సంఘాలూ మద్దతిచ్చాయి. ఆర్బీఐ కార్యాలయాల్లోనూ సమ్మె... పలు ఏటీఎమ్‌లలో డబ్బులు అయిపోయాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో క్యాష్ విత్‌డ్రాయల్, నగదు డిపాజిట్ చేయడం, చెక్ క్లియరెన్స్ వంటి బ్రాంచ్ కార్యకలాపాలపై ఈ సమ్మె ప్రభావం కనిపించింది. ముంబైతో సహా దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లోని 12,000 మంది సిబ్బంది కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఆర్బీఐకు చెందిన కరెన్సీ మేనేజ్మెంట్ తదితర విభాగాలపై తీవ్రమైన ప్రభావమే పడింది. ఎస్బీఐ, ప్రైవేట్ రంగ బ్యాంక్‌లు యథావిధిగా పనిచేశాయి. మరోవైపు హోండా మోటార్‌సైకిల్, బజాజ్ ఆటో, కొన్ని వాహన విడిభాగాల కంపెనీల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, హోండా కార్స్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ప్లాంట్లలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయి. ఈ కంపెనీల ప్లాంట్లలో సమ్మె ప్రభావం కనిపించలేదు. కాగా ఈ సమ్మెలో 25 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారని కార్మిక సంఘాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాల సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రభుత్వ వాటాల విక్రయం, ప్రైవేటీకరణ తదితర విధానాలకు నిరసనగా ఈ సమ్మె జరిగింది. -
సార్వత్రిక సమ్మె ప్రశాంతం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు బుధవారం చేపట్టిన సార్వత్రిక సమ్మె నగరంలో ప్రశాంతంగా ముగిసింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కార్మికులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ధర్నాలు నిర్వహించారు. అబిడ్స్, బ్యాంక్ స్ట్రీట్లలో వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగ సంఘాల నేతృత్వంలో భారీ ప్రదర్శన జరిగింది. ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ తదితర కార్మిక, ప్రజాసంఘాల నేతృత్వంలో నిరసన చేపట్టారు. నాయకులు, కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘాలు, జేఏసీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించాయి. డిమాండ్లు ఇవే.. కేంద్రం ప్రవేశపెట్టిన మోటారు వాహన చట్టాన్ని రద్దు చేయాలని, స్పీడ్ గవర్నర్స్ నిబంధనను ఎత్తివేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే క్యాబ్‌లపైన కొద్ది సంస్థల గుత్తాధిపత్యాన్ని తొలగించి పాత పద్ధతిలో మీటర్లను తిరిగి ప్రవేశపెట్టాలని డ్రైవర్లు కోరారు. రవాణా రంగానికి చెందిన డ్రైవర్లు, కార్మికుల కోసం ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రదర్శనల్లో పాల్గొన్న కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. -
రెండో రోజు కొనసాగుతున్న భారత్ బంద్..
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ రెండో రోజు కొనసాగుతోంది. కార్మిక సంఘాల నాయకుల చేపట్టిన బంద్ బెంగాల్లో కొంత హింసాత్మకంగా మారింది. బెంగాల్లో రోడ్డుపైకి వచ్చిన వాహనాలపై ఆందోళన కారులు రాళ్లు రువ్వడంతో వాహనాల అద్దాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ త్రీవంగా గాయపడ్డాడు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపున్న సీపీఎం నేత సుజన్ చౌదరీను పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. దేశ వ్యాప్తంగా వామపక్షాలు, కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా 32వేల మంది కార్మికులు బంద్‌ను పాటిస్తున్నారు. కార్మికుల హక్కులకై వారు డిమాండ్ చేస్తున్నారు. కేరళలో కూడా రెండో రోజు బంద్ కొనసాగుతోంది. తిరువనంతపురంలో రైలు పట్టాలపై కార్మికులు బైఠాయించడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కార్మికులు తెల్లవారుజాము నుంచే రోడ్లమీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ముందు కార్మిక సంఘాలు 12 డిమాండ్లను ఉంచిన విషయం తెలిసిందే. రెండు రోజుల బంద్‌కు పది ట్రేడ్ యూనియన్లు మద్దుతు ప్రకటించాయి. -
రవాణా బిల్లుకు నేడు నిరసన
పలు యూనియన్ల మద్దతు ఆర్టీసీ బస్సులు, ఆటోలు యథాతథం సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం రూపొం దించిన రవాణాబిల్లు-2014ను వ్యతిరేకిస్తూ గురువారం దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్లు బంద్ పాటించనున్నాయి. జిల్లాలో లారీ ఓనర్స్ అసోసియేషన్, ఇతర కార్మిక సంఘాలు, ఆర్టీసీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ట్రేడ్ యూనియన్లు బంద్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. అయితే ఆర్టీసీ సిబ్బంది కొంతమంది మాత్రమే ఇందులో పాల్గొంటారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు యథాతథంగా తిరుగుతాయి. ఈ రవాణా బిల్లులోని అనేక అంశాలపై అభ్యంతరాలను వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల దగ్గర్నుంచి పలు సంఘాల వరకు అందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బిల్లులో మార్పులు చేయాలన్న డిమాండ్‌తో ఒక రోజు బంద్ నిర్వహిస్తున్నారు. పెనాల్టీలే అభ్యంతరం.. జిల్లాలో కమర్షియల్ లారీలు 40 వేలకు పైగా ఉన్నాయి. 50 వేల మంది డ్రైవర్లు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. నగరంలో ప్రైవేట్ వాటితో కలిపి మొత్తం ఐదు వేల టాక్సీలున్నాయి. విజయవాడ టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించింది. డబుల్ టాక్స్ విధానం వల్ల ఇప్పటికే రాష్ట్రంలోని వాహనాలకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉండాలని కేంద్ర రవాణా శాఖ బిల్లును రూపొందించింది. దీనిపై అభ్యంతరమైతే లేదు కాని పెనాల్టీల విషయంలోనే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా షెడ్యూల్-3లోని అంశాలు పెనాల్టీలకు సంబంధించి ఉన్న సెక్షన్ 286 నుంచి 324 వరకు అపరాధ రుసుం వేలల్లో నిర్ణయించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును పెట్టి ఆమోదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి నిరసనగా బంద్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో గురువారం జిల్లాలో వేలాది సంఖ్యలో లారీలు, వందల సంఖ్యలో కార్లు నిలిచిపోనున్నాయి. లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోనేరు వెంకట రమేష్ ‘సాక్షి’తో మాట్లాడుతూ బంద్‌కు తాము మద్దతు ప్రకటించామని చెప్పారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రవాణారంగం పూర్తిగా నష్టపోతుందన్నారు. ఈ బిల్లును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు కూడా వ్యతిరేకించారని చెప్పారు.