పలు యూనియన్ల మద్దతు
ఆర్టీసీ బస్సులు, ఆటోలు యథాతథం
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం రూపొం దించిన రవాణాబిల్లు-2014ను వ్యతిరేకిస్తూ గురువారం దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్లు బంద్ పాటించనున్నాయి. జిల్లాలో లారీ ఓనర్స్ అసోసియేషన్, ఇతర కార్మిక సంఘాలు, ఆర్టీసీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ట్రేడ్ యూనియన్లు బంద్‌కు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి.
అయితే ఆర్టీసీ సిబ్బంది కొంతమంది మాత్రమే ఇందులో పాల్గొంటారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు యథాతథంగా తిరుగుతాయి. ఈ రవాణా బిల్లులోని అనేక అంశాలపై అభ్యంతరాలను వివిధ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల దగ్గర్నుంచి పలు సంఘాల వరకు అందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బిల్లులో మార్పులు చేయాలన్న డిమాండ్‌తో ఒక రోజు బంద్ నిర్వహిస్తున్నారు.
పెనాల్టీలే అభ్యంతరం..
జిల్లాలో కమర్షియల్ లారీలు 40 వేలకు పైగా ఉన్నాయి. 50 వేల మంది డ్రైవర్లు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. నగరంలో ప్రైవేట్ వాటితో కలిపి మొత్తం ఐదు వేల టాక్సీలున్నాయి. విజయవాడ టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించింది. డబుల్ టాక్స్ విధానం వల్ల ఇప్పటికే రాష్ట్రంలోని వాహనాలకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉండాలని కేంద్ర రవాణా శాఖ బిల్లును రూపొందించింది. దీనిపై అభ్యంతరమైతే లేదు కాని పెనాల్టీల విషయంలోనే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా షెడ్యూల్-3లోని అంశాలు పెనాల్టీలకు సంబంధించి ఉన్న సెక్షన్ 286 నుంచి 324 వరకు అపరాధ రుసుం వేలల్లో నిర్ణయించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును పెట్టి ఆమోదించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
దీనికి నిరసనగా బంద్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో గురువారం జిల్లాలో వేలాది సంఖ్యలో లారీలు, వందల సంఖ్యలో కార్లు నిలిచిపోనున్నాయి. లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోనేరు వెంకట రమేష్ ‘సాక్షి’తో మాట్లాడుతూ బంద్‌కు తాము మద్దతు ప్రకటించామని చెప్పారు. ఈ బిల్లు ఆమోదం పొందితే రవాణారంగం పూర్తిగా నష్టపోతుందన్నారు. ఈ బిల్లును రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు కూడా వ్యతిరేకించారని చెప్పారు.
రవాణా బిల్లుకు నేడు నిరసన
Published Thu, Apr 30 2015 4:22 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement