న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల్లో పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆయా కంపెనీల ఉద్యోగుల్లో కొన్ని వర్గాలు జనవరి 4న సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రతిపాదిత పునర్‌వ్యవస్థీకరణతో ప్రభుత్వ రంగ సంస్థలు బలహీనం అవుతాయని జాయింట్ ఫోరం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (జేఎఫ్‌టీయూ) ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది.
దీనివల్ల లాభాల్లో ఉన్న ఆఫీసులతో పాటు పలు కార్యాలయాలను విలీనం చేయడమో లేదా మూసివేయడమో జరుగుతుందని పేర్కొంది. గత కొన్నేళ్లుగా దాదాపు 1,000 కార్యాలయాలు మూతబడ్డాయని జేఎఫ్‌టీయూ తెలిపింది. ఇవన్నీ ఎక్కువగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఉండేవని వివరించింది. ఫలితంగా పాలసీదారులపైనా ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొంది.
ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ సౌరభ్ మిశ్రా ఇష్టా రీతిగా వ్యవహరిస్తూ నేషనల్ ఇన్సూరెన్స్ బోర్డుపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని జేఎఫ్‌టీయూ తెలిపింది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, జీఐసీ రీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీల్లోని 50,000 మంది పైచిలుకు ఉద్యోగులు, అధికారులు జనవరి 4న ఒక రోజు సమ్మెకు దిగనున్నట్లు జేఎఫ్‌టీయూ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment