మౌలిక వసతులతోనే చిక్కులకు చెక్..!
ఏప్రిల్ నుంచి నగరమే రాష్ట్ర పరిపాలన కేంద్రం
అమాత్యులు, అధికారులు ఇక్కడే మకాం
తక్షణమే 5 వేల కుటుంబాలూ వస్తాయి..
రోజూ లక్షలాది మంది వచ్చే అవకాశం
అందుకనుగుణంగా సదుపాయాలు కల్పించాలి
ట్రాఫిక్ సమస్య నివారించాలి
పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలి
తాగునీటి సమస్యపై దృష్టి పెట్టాలి
విజయవాడ : నగరం నాలుగు నెలల్లోనే నవ్యాంధ్రప్రదేశ్‌కు పరిపాలన కేంద్రం కానుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పారు. దీనిపై నగరవాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఆనందం ఇలాగే కొనసాగాలంటే పలు సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించాల్సి ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగరాన్ని తక్షణమే అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ట్రాఫిక్ భారీగా పెరిగింది. రానున్న నాలుగు నెలల్లో మరింత పెరుగుతుంది. ప్రస్తుతం తాగునీటి సమస్య కూడా నెలకొంది. నేరాలూ పెరిగాయి. అధికారులకు భవనాలు సమకూర్చడంతోపాటు కీలకమైన ట్రాఫిక్ సమస్యను పరిస్కరించాలి. డ్రెయిన్లు, తాగునీటి కష్టాలు కూడా తలెత్తకుండా చూడాలి. ఈ మేరకు సదుపాయల కల్పనపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ నగర అధికారులతో చర్చించారు. పాలకులు, అధికారులు ఒక్కసారిగా వస్తే అవసరాలు తీర్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు
వేధిస్తున్న ట్రాఫిక్ సమస్య
నగరంలో ఇటీవల ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. ప్రధాన రోడ్లతోపాటు అంతర్గత రహదారుల్లో సైతం గంటల తరబడి వాహనాలు బారులుతీరుతున్నాయి. దీంతో నిత్యం నగరవాసులు నరకయాతన పడుతున్నారు. ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక కార్యక్రమాలు జరిగిన సమయంలో హైదారాబాద్ వైపు వెళ్లే వాహనాలను జాతీయ రహదారి నుంచి నగరం మీదుగా మళ్లించాల్సి వస్తోంది. ఆ సమయంలో వన్‌టౌన్‌లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతోంది. ఆ ప్రభావం కృష్ణలంక జాతీయ రహదారిపై పడుతోంది. ఎర్రకట్ట, సింగ్‌నగర్ ఫ్లై ఓవర్లపై, రమేష్ ఆస్పత్రి జంక్షన్, నిర్మల కాన్వెంట్ జంక్షన్, ఎన్టీఆర్ సర్కిల్, పశువుల ఆస్పత్రి జంక్షన్లలో కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది.
ఇలా చేస్తే ట్రాఫిక్ సమస్య నివారించవచ్చు
► గొల్లపూడి బైపాస్ నుంచి సొరంగ మార్గం ద్వారా ఎర్రకట్ట కేదారేశ్వరపేట మీదుగా బీఆర్టీఎస్ రోడ్డులోకి వాహనాలను మళ్లించాలి. మధ్య, పశ్చిమ నియోజకవర్గాలను కలిపే ఎర్రకట్టపై పైప్లైన్ల లీకేజీలను అరికట్టాలి.
► గుణదల వంతెన పనులు పూర్తిచేయాలి. దీనివల్ల నూజివీడు వైపు నుంచి వచ్చే వాహనాలను జాతీయ రహదారిపైకి సులభంగా మళ్లించవచ్చు. తద్వారా సింగ్‌నగర్ ఫ్లై ఓవర్‌పై ఒత్తిడి తగ్గుతుంది.
►నగరం మీదుగా వెళ్తున్న రెండు జాతీయ రహదారులను కలిపేందుకు నిర్మిస్తున్న ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులను త్వరగా పూర్తిచేయాలి.
దీని వల్ల నగరంలోకి భారీ వాహనాలు రాకుండా నివారించవచ్చు.
► రోడ్ల విస్తరణ కూడా అత్యవసరం. బందరురోడ్డులో కంట్రోల్ రూం నుంచి ఆటోనగర్ చెక్‌పోస్టు వరకు విస్తరించాలి. గురునానక్ కాలనీ రోడ్డు, పటమటలంక రోడ్డు, పిన్నమనేని పాలిక్లినిక్‌రోడ్డు, టిక్కిల్‌రోడ్డు, ఎన్ఎస్ఎం రోడ్డు, రామలింగేశ్వరనగర్ కట్ట, రామకృష్ణాపురంరోడ్డు, గవర్నమెంట్ ప్రెస్ రోడ్డు, గుణదల నుంచి పడవల రేవు వరకు, గుణదల-పుల్లేటిడొంక రోడ్లు విస్తరించాల్సి ఉంది. చిట్టినగర్ జంక్షన్ నుంచి కాలేశ్వరరావు మార్కెట్ వరకు, రాజగోపాలాచారి వీధి, మ్యూజియంరోడ్డు, బీసెంట్రోడ్డులను విస్తరించాల్సి ఉంది.
తాగునీటికి కటకట
కృష్ణానది చెంతనే ఉన్నప్పటికీ నగర శివారు ప్రాంతాల్లో తాగునీటి కొరతతీవ్రంగా ఉంది. సింగ్‌నగర్, రాజీవ్‌నగర్, పాయకాపురం, రాజరాజేశ్వరీపేట పరిదిలోని పలు కాలనీలకు రెండు మూడు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఒక మనిషికి సగటున రోజుకు 150 లీటర్ల నీరు కావాలి. ప్రస్తుతం నగరంలో ఉన్న జనాభాకు రోజూ 15,72,36,000 లీటర్ల నీరు కావాలి ఉంది. నగరపాలక సంస్థ 12,14,52,000 లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తోంది. ఇందులో 2,63,84,000 లీటర్ల నీటిని బోర్ల ద్వారా తీస్తున్నారు. కేవలం 60 శాతం మాత్రమే కృష్ణానది ఉపరితల భాగం నుంచి సరఫరా అవుతోంది. ఏప్రిల్ నుంచి మరో 5వేల కుటుంబాలు నగరానికి వస్తాయని అంచనా. వీరితోపాటు సుమారు 3లక్షల మంది నగరానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో మరో 3కోట్ల లీటర్ల నీరు అవసరమవుతుంది. జనాభాకు ఏడాదికి 2.3 టీఎంసీలు అవసరమని అంచనా వేస్తున్నారు. పరిశ్రమలు, ఇతర అవసరాలకు కలిపి ఏడాదికి 5టీఎంసీలు నీరు నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా చేస్తే నీటి కష్టాల నుంచి గట్టెక్కవచ్చు
► ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రతి సంవత్సరం 400 నుంచి 800 టీఎంసీల వరకు నీటిని దిగువకు వదులుతున్నారు. దీనిలో 5 టీఎంసీలను తగిన ప్రాంతాల్లో నిల్వ చేసుకుంటే నగర ప్రజల నీటి కష్టాలను తొలగించవచ్చు.
► ఆటోనగర్‌లో తాగునీటి అవసరాల కోసం నగరపాలక సంస్థ రూ.53 కోట్లతో గుణదల గంగిరెద్దుల దిబ్బ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్‌ను త్వరగా పూర్తిచేయాలి. దీనివల్ల ఆటోనగర్‌లో తాగునీటి సమస్యను నివారించవచ్చు.
► రామలింగేశ్వరనగర్, గుణదల ప్రాంతాల్లో ఉన్న వాటర్ప్లాంట్లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి.
► కొండప్రాంతాల వాసుల అవసరాలు తీర్చేందుకు త్వరగా రిజర్వాయర్లు నిర్మించాలి. వీటికోసం ఇప్పటికే డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు రూపొందిస్తున్నారు.
కార్యాలయాల సమస్య...
నగరంలో ప్రభుత్వ కార్యాలయాల సమస్య తీవ్రంగా ఉంది. గెస్ట్‌హౌస్‌ల కొరత కూడా నెలకొంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా నగరంలోని తమ శాఖల కార్యాలయాల్లోనే క్యాంపు ఆఫీసులు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో భవిష్యత్తులో భవనాల కొరత వల్ల ఒక్కోచోట ఒక్కో కార్యాలయం ఏర్పాటుచేసే అవకాశం ఉంది.
► ఇలా చేస్తే మేలు : ఇప్పటికే అందుబాటులో ఉన్న పురాతన భవనాలకు మరమ్మతులు చేయించాలి.
► కేసరపల్లిలోని మేథా టవర్‌తోపాటు నగరం చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ సంస్థలను వినిగించుకోవాలి.
► ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాలను ముందస్తు ప్రణాళికతో తాత్కాలిక అవసరాలకు షెడ్లు, పార్కింగ్ స్థలాలుగా వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది.
► గెస్ట్‌హౌస్‌లను ఆధునికీకరించాలి. ఉన్న గదులను కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసురావాలి.
నేరాలకు అడ్డాగా మారుతోంది
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నగరంలో నేరాలు పెరిగాయి. ఈ విషయాన్ని పార్లమెంట్‌లోనే ప్రకటించారు. నగరంలో ఇటీవల గన్ సంస్కృతి వచ్చింది. శివారు ప్రాంతాల్లో ఖాళీ భూములను కైవసం చేసుకునేందుకు గ్యాంగ్‌లు బయలు దేరాయి. న్యూ రాజరాజేశ్వరీపేట, సింగ్‌నగర్, పాయకపురం, పెజ్జోనిపేట ప్రాంతాల్లో భూవివాదాలు పెరిగాయి. చెరువులు సైతం కబ్జాకు గురవుతున్నాయి.
నేరాలను నియంత్రించేందుకు ఇలా...
► పోలీసు అధికారులు, సిబ్బంది సంఖ్య పెంచి గస్తీని ముమ్మరం చేయాలి.
► కీలకమైన రైల్వేస్టేషన్, బస్టాండ్లలో నిఘా పెంచాలి.
► పాత నేరస్తులపై దృష్టిసారించాలి. నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి.
నగరంలోకి వచ్చే రహదారుల్లో నిఘా ఉంచాలి.
కమిషనరేట్ అధికారులు పొరుగు జిల్లాల పోలీసు అధికారులతో సమన్వయం కలిగి ఉండాలి. ఏదైనా ఘటన జరిగితే వెంటనే పొరుగుజిల్లా అధికారులను అప్రమత్తం చేయాలి. వాహనాల నంబరు ప్లేట్ల విషయంలోనూ ప్రత్యేక చర్యలుతీసుకోవాలి.
ఇంద్రకీలాద్రిపై..
నిత్యం రద్దీగా ఉండే ఇంద్రకీలాద్రికి భక్తుల తాకిడి మరింత పెరుగుతుంది. వీఐపీలు, వీవీఐపీలు రోజూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా తగిన జాగ్రత్తలుతీసుకోవాల్సి ఉంది. మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సి ఉంది.
ఇలా చేస్తే మేలు..
► రాజగోపురం నుంచి భక్తులు పైకి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలి.
► భక్తులు, వీఐపీల కోసం ప్రత్యేకంగా కాటేజీలు నిర్మించాలి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్నవాటిని వెంటనే పూర్తిచేయాలి.
► కొండ దిగువన ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలి.
► స్నానఘాట్లలో తగిన ఏర్పాట్లు చేయాలి.
► కొండదిగువన, పైనా భద్రతను కట్టుదిట్టంచేయాలి.