‘మహా’ మార్పు
నాలుగు జిల్లాలుగా రెవెన్యూ పాలన
కొత్తగా చార్మినార్, గోల్కొండ, సికింద్రాబాద్, భువనగిరి
బల్దియా చేతికి ఆర్టీసీ
ఎస్‌ఆర్‌డీపీతో ట్రాఫిక్ సమస్యకు చెక్
సిటీబ్యూరో: మహా నగర పాలనా స్వరూపం మారబోతోంది. సరి‘కొత్త’ రూపాన్ని సంతరించుకోబోతోంది. ఈ దిశగా రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు నగర శివారు ప్రాంతాలను కలుపుతూ కొత్త రెవెన్యూ జిల్లాలు ఆవిర్భవించనున్నాయి. దీనికోసం ప్రత్యేక కమిటీని నియమించారు. పీకల్లోతు నష్టాలతో అష్టకష్టాలు పడుతున్న హైదరాబాద్ ఆర్టీసీ రిజియన్‌ను జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్‌ఆర్‌డీపీ (స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం)లో రూ.2631 కోట్లతో 20 ప్రాంతాల్లో మల్టీలెవల్ ఫ్లై ఓవర్లు... గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. ఈ పనులన్నీ ఇక చకచకా కదలనున్నాయి.
కొత్త జిల్లాల స్వరూపం ఇదే...
హైదరాబాద్ -రంగారెడ్డి జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో మొత్తం ఐదు జిల్లాల ఏర్పాటు దిశగా సర్కారు అడుగులు వేస్తోంది. 1978లో ఏర్పాటైన రంగారెడ్డి జిల్లాను ఇకపై వికారాబాద్, చెవెళ్ల, పరిగి, తాండూరు నియోజకవర్గాలకు పరిమితం చేయాలని యోచిస్తున్నారు. మిగిలిన ప్రాంతాలతో గోల్కొండ, చార్మినార్, సికింద్రాబాద్ జిల్లాలు... ఉప్పల్ లేదా మలక్‌పేట కేంద్రంగా పని చేసే భువనగిరి జిల్లాను ఏర్పాటు చేసే దిశగా సన్నాహాలు మొదలయ్యాయి.
ఎస్‌ఆర్‌డీపీకి కదలిక
క్యాబినెట్ ఆమోదించిన నేపథ్యంలో నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్, ఎల్‌బీనగర్, బంజారాహిల్స్, బైరామల్‌గూడ, సంతోష్‌నగర్, రాయదుర్గం, మైండ్‌స్పేస్, అయ్యప్ప సొసైటీ, చింతలకుంట తదితర ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, జంక్షన్ల నిర్మాణ పనులు కదలనున్నాయి. ఇప్పటికే వీటికి సంబంధించిన కార్యాచరణ మొదలైంది. రూ.2631 కోట్ల పనులకు క్యాబినెట్ సైతం పచ్చజెండా ఊపేసింది. ఈ రహదారుల నిర్మాణ వ్యయం మొత్తం జీహెచ్‌ఎంసీ నిధుల నుంచే చెల్లించాలని నిర్ణయించడం విశేషం.