ట్రాఫిక్ రామస్వామి బయోపిక్‌లో ఎస్ఏసీ
తమిళసినిమా: ట్రాఫిక్ రామస్వామి జీవిత చరిత్ర తెరకెక్కనుంది. ఇందులో ట్రాఫిక్ రామస్వామిగా సీనియర్ దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ నటించడానికి సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ రామస్వామి గురించి తమిళనాడులో కాస్త లోకజ్ఞానం ఉన్న వారందరికీ తెలుసు. సామాజిక సమస్యలపై నిరంతర పోరాటయోధుడు ట్రాఫిక్ రామస్వామి.
ఇక మిల్లు వర్కర్‌గా జీవితాన్ని ప్రారంభించిన ఈయన తమిళనాడు హోమ్‌గార్డ్‌ల అసోషియేషన్‌లో శాశ్వత సభ్యుడిగా ఉన్నారు. అనేక ప్రజా సమస్యలపై కోర్టులో ప్రజావాజ్యం వేసి న్యాయం కోసం పోరాడుతున్నారు. మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌ల అవినీతి పైనా అలుపెరుగని పోరాటం చేశారు. 2013లో ప్రభుత్వ స్కీమ్‌లపై అమ్మ పేరు ఉండరాదంటూ అన్నాడీఎంకే నేత జయలలితపైనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి ట్రాఫిక్ రామస్వామి.
ఆయనతో పాటు పుట్టిన 10మంది దూరం అయినా, కట్టుకున్న భార్య వదిలి వెళ్లినా తన సామాజిక బాధ్యతలను మాత్రం విడనాడని నిజమైన సంఘసంస్కర్త ట్రాఫిక్ రామస్వామి. 83ఏళ్ల ఆయన ఇప్పటికీ తన పోరాట పఠిమ కొనసాగిస్తున్నారు. అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర వెండితెరకెక్కనుంది. ఆయన పాత్రలో సీనియర్ దర్శకుడు ఎస్ఏ.చంద్రశేఖర్ నటించనున్నారు. దీని గురించి ఎస్ఏ.చంద్రశేఖర్ తెలుపుతూ, మూడు నెలల క్రితమే ట్రిఫిక్ రామస్వామి గురించి పూర్తిగా తెలుసుకున్నానన్నారు. నిర్మాత భాస్కర్ వచ్చి ట్రాఫిక్ రామస్వామి జీవిత ఇతివృత్తంగా చిత్రం చేద్దాం.
దానికి మీరే దర్శకత్వం వహించాలని కోరారన్నారు. అయితే వయసు రీత్యా తాను దర్శకత్వం వహించలేనని, ఆయన పాత్రలో నటిస్తానని చెప్పానన్నారు. ఈ చిత్రానికి తన శిష్యుడు విజయ్ విక్రమ్ దర్శకత్వం వహించనున్నాడని తెలిపారు. ఈ చిత్రం కోసం ట్రాఫిక్ రామస్వామిని కలిసి అనుమతి పొందామని, తాను ఆయన పాత్రలో నటించనున్నట్లు చెప్పగా చాలా సంతోషించారని తెలిపారు. అయితే ఇందులో విజయ్ నటించనున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని, అసలు తానీ చిత్రంలో నటించనున్న సంగతి అతనికి ఇంకా చెప్పలేదని ఎస్ఏ.చంద్రశేఖర్ అన్నారు.