సెల్ఫీ తీసుకుంటూ రైలు చక్రాల కిందకు.....
బీజింగ్: పర్వత శిఖరాగ్ర అంచులపై, ప్రమాదకర జలపాతాల సన్నిధిలో నిలబడి సెల్ఫీలు తీసుకుంటూ పలువురు పర్యాటకులు మత్యువాత పడుతున్నా ప్రమాదకర సెల్ఫీల మోజు తగ్గడం లేదు. దక్షిణ చైనాలోని ఫోషన్‌లో వేగంగా వస్తున్న రైలు పక్కనే నిల్చొని సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ గుర్తుతెలియని పర్యాటకురాలు ప్రమాదవశాత్తు రైలు పట్టాల కిందకు దూసుకెళ్లి అక్కడికక్కడే మరణించింది. ఏప్రిల్ 9వ తేదీ మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనను చైనాకు చెందిన ‘పీపుల్స్ డెయిలీ ఆన్లైన్’ ఆమె ఫొటోతోని ఈ రోజు రిపోర్టు చేసింది.
రైలు పట్టాలకు సమీపంలోనే లియాంతంగ్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి కాపలా లేని రైలు క్రాసింగ్ ఉంది. రైలు పట్టాలకు ఆనుకొని 33 ఎకరాల్లో అందమైన గులాబీ వనం ఉంది. ఆ వనాన్ని చూడడం కోసం అనేక మంది పర్యాటకులు అక్కడికి వచ్చి పోతుంటారు. ఆరోజు కూడా అక్కడికి పర్యాటకులు పలువురు వచ్చారు. వారు కూడా గులాబీ వనంలో, రైలు వస్తుండగా సెల్ఫీలు తీసుకున్నారు.
వారిలాగే 19 ఏళ్ల ఓ అమ్మాయి రైలు పట్టాల పక్కన నిలబడి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించింది. తోటి పర్యాటకులు హెచ్చరించినా, రైలు కూత పెట్టినా పట్టించుకోలేదు. ఆమె పట్టాలపై లేకపోయిన వేగంగా వచ్చిన రైలు అమెను పట్టాల కిందకు లాక్కుంది. తలకు బలమైన గాయాలై ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆమె ప్రమాదానికి గురైన దశ్యాన్ని తోటి ప్రయాణికులు తీశారు. ప్రమాదం కారణంగా రైలు ఆగింది. కాపలాలేని క్రాసింగ్ వద్ద ఎన్నో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు అక్కడ ఒక్క యాక్సిడెంట్ కూడా జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.
పర్యాటకురాలి వివరాలు ఇప్పటివరకు తెలియలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. వేగంగా దూసుకొస్తున్న రైళ్ల పక్కనే కాదు, రైళ్ల ముందు కూడా నిలబడి సెల్ఫీలు దిగడం చైనా యువతలో ఇప్పుడు ఓ ట్రెండ్‌గా మారిపోయింది. తూర్పు చైనాలోని నాంజింగ్ వద్ద చెట్ల గుబుర్లతో సహజసిద్ధంగా ఏర్పడిన టన్కెల్ వద్ద ప్రతి రోజు వందల మంది టూరిస్టులు సెల్ఫీలు తీసుకుంటూ కనిపిస్తారు. మున్సిపల్ అధికారులు అభ్యంతరం పెట్టినా ప్రమాదాలు నివారించేందుకు అక్కడ రైల్వే అధికారులు చెట్లను కొట్టివేశారు.