Train charge
-
నిత్యావసరాల ధరలు పెరిగితే..రైలు చార్జీల మోత!
- ధరల సూచీతో రైలు టికెట్ ధరకు లింకుపెట్టే యోచన - ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మూడు నెలలకోసారి సవరించే అవకాశం - దీనిపై ఇప్పటికే సంకేతాలిచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిత్యావసరాల ధరలు పెరిగినప్పుడల్లా సామాన్యుడి జేబుకు చిల్లు తప్పదు.. ఇక నుంచి నిత్యావసరాల ధరలతో పాటుగా రైల్వే చార్జీలు మోతెక్కనున్నాయి. ప్రయాణికుల టికెట్లపై భారీగా నష్టాలను భరిస్తున్న రైల్వే... ఇకపై దానికి అడ్డుకట్ట వేసేందుకు ద్రవ్యో ల్బణంతో టికెట్ల ధరలకు ముడిపెట్టాలని యోచిస్తోంది. అంటే వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా రైలు టికెట్ల ధర నిర్ణయమవుతుంది. నిత్యావసరాల ధరలు పెరిగితే.. రైలు టికెట్ల ధరలు కూడా పెరుగుతాయన్న మాట (ధరల సూచీ ఆధారంగా ఉద్యోగులకు కరువు భత్యం అందినట్లుగా). రూ.30 వేల కోట్ల నష్టం.. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రవాణా ద్వారా రైల్వేకు వాటిల్లే నష్టం రూ.30 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. తొలి నుంచీ ప్రయాణికుల టికెట్ల ఆదాయంలో నష్టాలే వస్తున్నా.. చార్జీలు పెంచితే ఎక్కడ జనాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందోననే భయంతో కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరి స్తున్నాయి. ప్రయాణికుల ద్వారా వచ్చే నష్టాలను.. సరుకు రవాణా ద్వారా వచ్చే ఆదాయంతో పూడ్చుకుంటూ బండి లాగిస్తున్నాయి. ప్రయాణికుల నుంచి చార్జీల రూపంలో వసూలు చేసే మొత్తం వాస్తవానికి అయ్యే ఖర్చులో 57 శాతమే ఉంటోంది. సబర్బన్ రైళ్లలో అయితే 37 శాతమే చార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంత నష్టాన్ని భరిస్తున్నామో చెప్పడానికి రైల్వే గత జూన్ నుంచి ఈ వివరాలను ప్రతి టికెట్‌పై ముద్రించడం మొదలుపెట్టింది కూడా. ఇది ప్రయాణికుల్లో అవగాహన పెంచుతుందని రైల్వేల భావన. వసూలు చేసేందుకే మొగ్గు! ఇటీవల ‘రైల్వేల్లో అకౌంటింగ్ సంస్క రణలు’ అంశంపై జరిగిన ఓ సదస్సులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగిస్తూ... టికెట్ల ధరల పెంపుపై సంకేతాలిచ్చారు. జనాకర్షక విధానాలకు తాము దూరంగా ఉంటామని, తాము పొందుతున్న సేవలకు ప్రయాణికులు తగిన రుసుము చెల్లించాల్సిందేనని పేర్కొ న్నారు. ఏ సంస్థ అయినా వాణిజ్యపరమైన మనుగడ కూడా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రైల్వే ఉన్నతాధికారి ఒకరు హిందుస్తాన్ టైమ్స్ పత్రికతో మాట్లాడుతూ... ‘చాలా కఠిన నిర్ణయాలు తీసు కోవాల్సి ఉంది. ధరల సూచీతో ప్రయాణికుల టికెట్ ధరలను ముడిపెట్టడం అందులో ఒకటి. అలా చేస్తేనే ప్రతి ప్రయాణికుడి రవాణాకు వాస్తవంగా అయ్యే ఖర్చును రాబట్టగలము..’’ అని తెలిపారు. ఈ విధానంలో ధరల సూచీ ఆధారంగా మూడు నెలలకోసారి టికెట్ల ధరలను సవరిస్తారు. దీంతో ప్రయాణికులపై ఒక్కసారిగా భారం పడినట్లు అనిపించదు, రైల్వేలకు నష్టాలు తగ్గుతాయి. ఇక ఏడో వేతన సంఘం సిఫారసులను అమలు చేస్తే రైల్వేలపై రూ.32,000 కోట్ల అదనపు భారం పడుతుంది. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చూసినా రైల్వే బడ్జెట్లో భారీ సంస్కరణలు ఉండొచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన తొలిసారిగా సాధారణ బడ్జెట్లో భాగంగానే రైల్వే బడ్జెట్‌కు కూడా పార్లమెంటులో పెట్టనున్నారు. 30,000 కోట్లు ప్రయాణికుల రవాణా ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వేకు వాటిల్లే నష్టం అంచనా. 28 శాతం రైల్వే ఆర్జించే ప్రతి రూపాయిలో ప్రయాణికుల నుంచి చార్జీల రూపంలో వచ్చేది 28 పైసలే. ఏకంగా 66 పైసలు సరుకు రవాణా ద్వారా వస్తోంది. మిగతా ఆరు పైసలు ఇతర ఆదాయం. 57శాతం ప్రయాణికులను గమ్యం చేర్చడానికి అయ్యే ఖర్చులో.. 57 శాతమే రైల్వేలు చార్జీల రూపంలో వసూలు చేస్తున్నాయి. 2.3 కోట్లు ప్రతిరోజు 2.3 కోట్ల మంది ప్రయాణికులకు భారతీయ రైల్వే సేవలందిస్తోంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
భారీగా పెరిగిన రైలు టికెట్ల ధరలు
-
మోత మొదలైంది..
భారీగా పెరిగిన రైలు చార్జీలు పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలకు భారం అనంతపురం రూరల్ :రైలు చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. నిత్యావసర ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో ధరలకు కళ్లెం వేస్తాదనుకున్న కేంద్రం బాదుడు మొదలు పెట్టడంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. రైలు చార్జీలను 14.2 శాతం మేర, సరుకు రవాణా చార్జీలు 6.5 శాతం మేర పెంచడం దారుణమని వాపోతున్నారు. ఈ ధరలు ఈ నెల 25 నుంచి అమలు కానున్నాయని తెలియడంతో ప్రయాణికుల్లో అలజడి మొదలైంది. ఆర్టీసీ బస్సు చార్జీలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు దూర ప్రయాణాలకు ఎక్కువగా రైలుపైనే ఆధారపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది చిరు వ్యాపారులు, ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు రోజూ ఉద్యోగ రీత్యా సమీప ప్రాంతాలకు వెళ్లి వస్తున్నారు. వీరందరిపై ఇపుడు భారం పడనుంది. చార్జీల పెరుగుదలపై పలువురు ఇలా వ్యాఖ్యానించారు. ప్రత్యామ్నాయం లేకుండా చేశారు బస్సు టికెట్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా రైలు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులపై భారం మోపింది. రైల్వే చార్జీలు పెంచడం వల్ల ప్రత్యామ్నాయం లేకుండా చేశారు. - మహేష్, ప్రైవేట్ లెక్చరర్, అనంతపురం సామాన్యులకు భారం రైల్వే ప్రయాణ చార్జీలు పెంచడం వల్ల దిగువ, మధ్య తరగతి కుటుంబాలపై భారం పడింది. సేల్స్‌మన్‌గా నేను నిత్యం ఇతర ప్రాంతాలకు రైల్లోనే వెళ్తుంటారు. ఇప్పుడు చార్జీలు పెరిగాయి. ప్రభుత్వం పెంచిన చార్జీలు ఉపసంహరించుకోవాలి. - శ్రీనివాసులు, సేల్స్‌మన్, తపోవనం చార్జీల పెంపు దారుణం రైల్వే చార్జీల పెంపుపై కేంద్రం మరోసారి పునరాలోచించాలి. మామూలు చార్జీలతో పాటు విద్యార్థుల పాస్ చార్జీలను మినహాయిస్తే బాగుంటుంది. రోజూ వేలాది మంది విద్యార్థులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. చార్జీలు పెంచడం దారుణం. - వెంకటేష్, ఇంటర్ విద్యార్థి, ధర్మవరం సగం చార్జీలకే పోతుందేమో? ప్రతి రోజూ పనుల కోసం నేను అనంతపురం వస్తుంటాను. బస్సు చార్జీలు ఎక్కువ కావడంతో రైలు ప్రయాణం మంచిదని భావించా. కానీ ఇప్పుడు చార్జీలు పెరిగితే సంపాదించిన డబ్బు సగం దానికే పోతుంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి. - రాజేంద్ర, ఖాదర్‌పేట, పామిడి మండలం సీజనల్ పాస్‌లకు మినహాయింపు ఇవ్వాలి ప్రతి రోజు తిరిగే సీజన్ పాస్‌దారులకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇస్తే బాగుంటుంది. నిత్యం రైల్వేలో సీజన్ పాసు వల్ల వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. వీటి రేట్లు పెంచితే సామాన్యులకు భారమౌతుంది. - వెంకటరాముడు, ప్రైవేట్ టీచర్, కల్లూరు