మోత మొదలైంది..
భారీగా పెరిగిన రైలు చార్జీలు
పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలకు భారం
అనంతపురం రూరల్ :రైలు చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. నిత్యావసర ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో ధరలకు కళ్లెం వేస్తాదనుకున్న కేంద్రం బాదుడు మొదలు పెట్టడంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. రైలు చార్జీలను 14.2 శాతం మేర, సరుకు రవాణా చార్జీలు 6.5 శాతం మేర పెంచడం దారుణమని వాపోతున్నారు. ఈ ధరలు ఈ నెల 25 నుంచి అమలు కానున్నాయని తెలియడంతో ప్రయాణికుల్లో అలజడి మొదలైంది. ఆర్టీసీ బస్సు చార్జీలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు దూర ప్రయాణాలకు ఎక్కువగా రైలుపైనే ఆధారపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది చిరు వ్యాపారులు, ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు రోజూ ఉద్యోగ రీత్యా సమీప ప్రాంతాలకు వెళ్లి వస్తున్నారు. వీరందరిపై ఇపుడు భారం పడనుంది. చార్జీల పెరుగుదలపై పలువురు ఇలా వ్యాఖ్యానించారు.
ప్రత్యామ్నాయం లేకుండా చేశారు
బస్సు టికెట్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా రైలు ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులపై భారం మోపింది. రైల్వే చార్జీలు పెంచడం వల్ల ప్రత్యామ్నాయం లేకుండా చేశారు.
- మహేష్, ప్రైవేట్ లెక్చరర్, అనంతపురం
సామాన్యులకు భారం
రైల్వే ప్రయాణ చార్జీలు పెంచడం వల్ల దిగువ, మధ్య తరగతి కుటుంబాలపై భారం పడింది. సేల్స్‌మన్‌గా నేను నిత్యం ఇతర ప్రాంతాలకు రైల్లోనే వెళ్తుంటారు. ఇప్పుడు చార్జీలు పెరిగాయి. ప్రభుత్వం పెంచిన చార్జీలు ఉపసంహరించుకోవాలి.
- శ్రీనివాసులు, సేల్స్‌మన్, తపోవనం
చార్జీల పెంపు దారుణం
రైల్వే చార్జీల పెంపుపై కేంద్రం మరోసారి పునరాలోచించాలి. మామూలు చార్జీలతో పాటు విద్యార్థుల పాస్ చార్జీలను మినహాయిస్తే బాగుంటుంది. రోజూ వేలాది మంది విద్యార్థులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. చార్జీలు పెంచడం దారుణం.
- వెంకటేష్, ఇంటర్ విద్యార్థి, ధర్మవరం
సగం చార్జీలకే పోతుందేమో?
ప్రతి రోజూ పనుల కోసం నేను అనంతపురం వస్తుంటాను. బస్సు చార్జీలు ఎక్కువ కావడంతో రైలు ప్రయాణం మంచిదని భావించా. కానీ ఇప్పుడు చార్జీలు పెరిగితే సంపాదించిన డబ్బు సగం దానికే పోతుంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి.
- రాజేంద్ర, ఖాదర్‌పేట, పామిడి మండలం
సీజనల్ పాస్‌లకు మినహాయింపు ఇవ్వాలి
ప్రతి రోజు తిరిగే సీజన్ పాస్‌దారులకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇస్తే బాగుంటుంది. నిత్యం రైల్వేలో సీజన్ పాసు వల్ల వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. వీటి రేట్లు పెంచితే సామాన్యులకు భారమౌతుంది.
- వెంకటరాముడు, ప్రైవేట్ టీచర్, కల్లూరు