ఆహార వృథా ఎక్కడ..?
ఫైవ్ స్టార్ హోటళ్లలో ఎంత ఆహారం వడ్డించాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందట! అక్కడ బోలెడంత ఆహారం వృథా అవుతోందని.. చెత్తబుట్టల్లోకి చేరుతోందని కేంద్రమంత్రి ఒకరు ఆందోళన వ్యక్తం చేయడమే కాక.. ఈ వృథాకు చెక్ పెట్టేయాల్సిందేనని తీర్మానిం చేశారు. అనుకున్నదే తడవుగా జాతీయస్థాయిలో హోటల్ ఓనర్లతో సమావేశానికీ రంగం సిద్ధమైంది. ఈ వ్యవహారమంతా చూస్తూంటే.. గాయమైన చోటు ఒకటైతే మందు మరోచోట వేస్తున్నట్టుగా అనిపించడం లేదూ..? ఎందుకో చూద్దాం..! – సాక్షి నాలెడ్జ్ సెంటర్
- స్టార్ హోటళ్లలోనా..? వ్యవస్థలోనా..?
- దేశంలో అసమర్థంగా వ్యవసాయ రంగ నిర్వహణ
- లోపభూయిష్టంగా పంట ఉత్పత్తుల నిర్వహణ, సరఫరా
- వృథా అవుతున్న తిండిగింజల విలువ ఏటా లక్ష కోట్లు
- ఇది కేంద్ర వ్యవసాయ బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ
- శీతల గిడ్డంగులను నిర్మిస్తున్నా అది పాక్షిక పరిష్కారమే
- ప్యాక్‌హౌస్‌లు, పండ్లను మగ్గబెట్టే వ్యవస్థలు తక్కువే
- సరఫరాకు అవసరమైన శీతల వాహనాల సంఖ్యా అంతంతే
అన్నం పరబ్రహ్మ స్వరూపం..
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ దేశంలో కులమతాలకతీతంగా అందరూ విశ్వసించే మాట ఇదీ. ఈ విశ్వాసం కారణంగానే రాత్రి మిగిలిపోయిన అన్నం కాస్తా.. ఉదయానికి పులిహోర గానో.. చద్దన్నంగానో మారిపోయి ఉపయోగపడుతోంది. అంచనాలు తారుమారైతే మినహా పెళ్లిళ్లు.. పెద్దఎత్తున జరిగే ఉత్సవాల్లోనూ పారబోసే ఆహారం తక్కువే. అయితే సాధారణ హోటళ్ల సంగతి పక్కనబెడితే స్టార్ హోటళ్లు, హైక్లాస్ రెస్టారెంట్లలో ఎక్కువ మోతాదులో ఆహారం, పండ్లూ, కాయగూరలు వృథా అవుతాయనడంలో కొంత వాస్తవం లేకపోలేదు. అయితే దేశవ్యాప్తంగా ఇలాంటి హోటళ్లు, రెస్టారెంట్ల సంఖ్య తక్కువనే చెప్పాలి. పైగా స్తోమత కలిగిన వారే అక్కడకు వెళతారన్నది కూడా గమనించాల్సిన అంశం. దీన్ని పరిహరించాల్సిన అవసరమున్నప్పటికీ ఇది కేంద్రం జోక్యం చేసుకోదగ్గ స్థాయి అంశమా? అన్నదే ప్రశ్న.
అసలు సమస్య ఎక్కడుంది?
స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్న ప్పటికీ వ్యవసాయ ప్రధానమైన భారతదే శంలో ఆ రంగం నిర్వహణ మొత్తం అసమర్థం గానే ఉందన్నది నిష్టూర సత్యం. ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆచరించకపోవడం వల్ల చాలా పంటల దిగుబడి అంతర్జాతీయ స్థాయి కంటే చాలా తక్కువగా ఉంటోంది. పంట ఉత్పత్తుల నిర్వహణ, సరఫరాలు కూడా అత్యంత లోపభూయిష్టంగానే ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా దేశంలో వృథా అవుతున్న ఆహారం, తిండిగింజల విలువ ఏటా దాదాపు లక్ష కోట్ల వరకూ ఉం టోందని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ గత ఏడాది విడుదల చేసిన ఒక నివేదిక స్పష్టం చేస్తోంది. కేంద్ర వ్యవసాయ బడ్జెట్ కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. పంట ఉత్పత్తులు దీర్ఘకాలం నిల్వ ఉంచేందుకు తద్వారా వృథాను అరికట్టేందుకు ఇప్పుడు ఆధునిక శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. అయినప్పటికీ దేశం లో ఇలాంటి వ్యవస్థల ఏర్పాటుకు తీసుకుం టున్న చొరవ చాలా తక్కువ.
పోస్ట్ హార్వెస్ట్ నష్టాలను అరికట్టేందుకు పెద్ద ఎత్తున శీతల గిడ్డంగులను నిర్మిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఇది పాక్షిక పరిష్కారం మాత్రమేనని నిపుణులు అంటున్నారు. 2007 – 14 మధ్యకాలంలో వేర్వేరు కేంద్ర ప్రభుత్వ పథకాల కింద దేశం మొత్తమ్మీద దాదాపు 7,000 శీతల గిడ్డంగుల ఏర్పాటు జరిగింది. ఇందుకోసం సబ్సిడీల రూపంలో దాదాపు రూ. 2,395 కోట్లు ఖర్చు పెట్టారు కూడా. అయితే ప్యాక్‌హౌస్‌లు, పండ్లను మగ్గబెట్టే వ్యవస్థలు, సరఫరాకు అవసరమైన శీతల వాహనాల విషయాన్ని మాత్రం పూర్తిగా నిర్ల క్ష్యం చేశారు. ఫలితంగా పండించిన కాయ గూరలు, పండ్లలో దాదాపు 16 శాతం వృథా అవుతున్నట్లు సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ స్పష్టం చేస్తోంది. మాంస ఉత్పత్తుల్లో 60 శాతానికిపైగా పనికిరాకుండా పోతున్నాయని, అంచనా.
గిడ్డంగుల్లో పందికొక్కులు..
వడ్లు, గోధుమల వంటి తిండిగింజలను నిర్ణీత ఉష్ణోగ్రత, తేమ ఉన్న పరిస్థితుల్లో నిల్వ చేస్తే ఎక్కువ కాలం పాటు వాడుకునేందుకు అవకాశం ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయం. కానీ.. ఇలాంటి సౌకర్యాలు నామమాత్రంగానే ఉన్న జాతీయ ఆహార సంస్థ గిడ్డంగుల్లో ఏటా కొన్ని వేల టన్నుల తిండిగింజలు పందికొక్కులకు ఆహారంగా మారిపోతున్నాయి. తమ స్వార్థం కోసం గిడ్డంగి సిబ్బంది కొందరు ఈ నష్టాలను ఎక్కువ చేసి చూపుతున్నట్లు అంచనాలు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా తిండిగింజలతోపాటు ఇతర ఆహార ఉత్పత్తులను నిల్వ చేసేందుకు దాదాపు 32 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న గిడ్డంగుల అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘ద నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్ ఛెయిన్ డెవలప్‌మెంట్’ గత ఏడాది తన నివేదికలో స్పష్టం చేసింది.
కొన్నేళ్ల క్రితం పంజాబ్ ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీ భాగస్వామ్యంతో ఆధునిక గిడ్డంగులను నిర్మించినప్పుడు ఈ వృథా గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. దేశం మొత్తమ్మీద ఇలాంటి ఆధునిక గ్రెయిన్‌సైలోస్ ఏర్పాటు చేయడం, అవసరాలకు తగ్గట్టుగా, తగినన్ని గిడ్డంగులు, ఉద్యాన పంటలను వర్గీకరించి ప్యాక్ చేయగల ప్యాక్‌హౌస్‌లు, శీతల వాహనాలను ఏర్పాటు చేస్తే మిగిలే ఆహార ఉత్పత్తుల విలువ స్టార్ హోటళ్లలో జరుగుతున్న వృథా కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుందని నిపుణుల అంచనా.