రైలు టిక్కెట్ల జారీకి ప్రైవేట్ ఆపరేటర్లు
పీపీపీ విధానంలో రిజర్వేషన్ కేంద్రాలు
ఒక్కో ప్రయాణికుడి పై రూ.30 నుంచి 40 సర్వీస్ చార్జి
న్యూఢిల్లీ: రైలు టిక్కెట్ల జారీలో ప్రైవేటు ఆపరేటర్ల జోక్యానికి అధికారికంగా తెరలేచింది. రిజర్వుడు, అన్‌రిజర్వుడు టిక్కెట్ల జారీ కోసం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం ఇవ్వాలని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈమేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ నెల 8న అన్ని జోనల్ కార్యాలయాలకు బోర్డు సర్క్యులర్ ఇచ్చింది. ఈ విధానం కింద..‘యాత్రీ టికెట్ సువిధా కేంద్రం ’(వైటీఎస్‌కే) పేరుతో కంప్యూటరైడ్డ్ రిజర్వేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారని తెలిపారు. దీనికోసం కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో తగిన మార్పులు చేస్తారు. వైటీఎస్ఎక్ కేంద్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే గత ఐదేళ్లుగా రైల్వే టికెటింగ్ ఏజెంటుగా పనిచేస్తూ ఉండాలి. గత మూడేళ్లుగా దరఖాస్తుదారు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసి ఉండాలి.
తగిన మౌలిక వసతులతో కార్యాలయం కలిగి ఉండాలి. ఎంపికైన లెసైన్సుదారుకు నాలుగు టర్మినళ్లు కేటాయిస్తారు. ఈ విధానంలో టికెట్ బుక్ చేసుకునే ప్రతి ప్రయాణికుడు సెకండ్ క్లాస్(2ఎస్), స్లీపర్ తరగతులకు రూ. 30, ఇతర తరగతులకు రూ. 40ని సర్వీసు చార్జీగా చెల్లించాలి. రద్దు చేసుకున్నప్పుడు బుకింగ్‌కు అయిన మొత్తం చార్జీల్లో 50 శాతం కోత విధిస్తారు. కాగా, రైల్వేను ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే వైటీఎస్కేలను తెస్తున్నారని, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకరరావు చెప్పారు.