Trama care center
-
ట్రామా‘కేర్’ ఏమైనట్టు?
సాక్షి,సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై జరిగే ప్రమాదాల్లో గాయపడే వాహన చోదకులకు ప్రాథమిక చికిత్స అందించేందుకు తీసుకొస్తామన్న ‘ట్రామాకేర్’ సెంటర్ల ఏర్పాటు హామీలకే పరిమితమైంది. ప్రకటించి ఏడాది గడుస్తున్నా కనీసం ఒక్కటి కూడా ఏర్పాటు చేయకపోవడంతో హెచ్ఎండీఏ ఓఆర్ఆర్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓఆర్ఆర్పై గంటకు 120 కిలోమీటర్ల ఉన్న వేగ పరిమితిని 100కు తగ్గించినా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో గాయపడిన వారికి సత్వర వైద్యం అందక మృతి చెందుతున్నారు. ఈ క్రమంలో ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు తెరపైకి వచ్చింది. గతేడాది మే ఒకటిన ఓఆర్ఆర్ కండ్లకోయ జంక్షన్ సేవలు ప్రారంభించిన అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు తక్షణ వైద్యం కోసం ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే, ఇప్పటివరకు అధికారులు ఆ దిశగా ఏలాంటి ప్రగతి సాధించలేదు. తొలుత పటాన్చెరు, మేడ్చల్, ఘట్కేసర్, పెద్ద అంబర్‌పేట, నార్సింగ్ ప్రాంతాల్లో ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామంటూ పూర్వ కమిషనర్ టి.చిరంజీవులు ప్రతిపాదనలు రూపొందించి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంరక్షణ విభాగ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించారు. అయితే, తర్వాత అధికారులు వాటిని పట్టించుకోవడమే మానేశారు. ఎంతోమంది ప్రమాద బాధితులకు ప్రాణాలు పోసే ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటులో నిర్లక్ష్యంపై ఓఆర్ఆర్ వినియోగదారులు మండిపడుతున్నారు. వాహన ప్రయాణానికి టోల్ వసూలు చేస్తున్న అధికారులు అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకరాకపోవమేంటని ప్రశ్నిస్తున్నారు. కార్యరూపం దాల్చని భద్రత కండ్లకోయ జంక్షన్ పూర్తితో గతేడాది మే ఒకటిన సంపూర్ణ 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ అందుబాటులోకి వచ్చింది. అయితే, అతివేగంతో వెళ్లే సందర్భంలో రోడ్డు ప్రమాదాలు జరగుతుండటంతో పాటు ఓఆర్ఆర్ వినియోగించే వాహనదారుల సంఖ్య పెరుగుతోంది. దీంతో అదే స్థాయిలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని క్షతగాత్రులకు తక్షణ వైద్యం కోసం ట్రామాకేర్ సెంటర్లు ఏర్పాటుచేస్తే చాలా మందిని బతికించవచ్చని మంత్రి కేటీఆర్ సూచించడంతో ఆ దిశగా హెచ్ఎండీఏ పూర్వ కమిషనర్ టి.చిరంజీవులు చర్యలు తీసుకున్నారు. గోల్డెన్ అవర్‌లో క్షతగ్రాతుడికి తక్షణ వైద్యం కోసం తొలుత పటాన్చెరు, మేడ్చల్, ఘట్కేసర్, పెద్ద అంబర్‌పేట, నార్సింగ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలంటూ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంరక్షణ విభాగ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖను ఐదు నెలల క్రితం లేఖ రాశారు. దీంతో పాటు ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న పది అంబులెన్స్‌ల సంఖ్యను 16కు పెంచాలని తీసుకున్న నిర్ణయం కూడా అమలుకాలేదు. అలాగే హెచ్‌టీఎంఎస్ వ్యవస్థతో ఓఆర్ఆర్ను అనుసంధానం చేయడం వల్ల ఎక్కడ ప్రమాదం జరిగినా ఇట్టే తెలిసిపోయి అంబులెన్స్ ఘటనాస్థలికి త్వరగా చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కానీ ఆచరణ రూపంలోకి రావడం లేదు. ఇప్పటికైనా హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ దృష్టి సారించి ట్రామాకేర్ కేంద్రాల ఏర్పాటులో చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు కలేనా..!
విజయనగరం ఫోర్ట్ : ఈ నెల 13వ తేదీన భోగాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. 30 మంది వరకు గాయపడ్డారు. చిన్న చిన్న గాయాలు తగిలిన వారికి మాత్రమే భోగాపురం, జిల్లా కేంద్రాస్పత్రుల్లో చికిత్స అందింది. మరో 12 మంది వరకు క్షతగాత్రులను విశాఖపట్నం కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అలాగే ఈ నెల 6వ తేదిన గజపతినగరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరో క్షతగాత్రుడిని విశాఖపట్న కేజీహెచ్‌కు తరలిచారు. ప్రమాదాలు అధిక గాయాలైన వారికి జిల్లా ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందడం లేదు. ప్రతి ఒక్కరినీ విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేసేస్తున్నారు. ట్రామాకేర్ సెంటర్ జిల్లాలో ఉంటే క్షతగాత్రులకు మెరుగైన సేవలు అంది ఉండేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో జిల్లాలో ట్రామాకేర్ ఏర్పాటు చేయాలన్న హామీ కలగానే మిగిలిపోయింది. అధికారుల హడావుడే తప్ప ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు చేపడుతున్న దాఖలాలు లేవు. ట్రామాకేర్ సెంటర్ ప్రతిపాదించి దాదాపు మూడేళ్లవుతున్నా నేటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీన్ని బట్టి చూస్తే ప్రజల ప్రాణాలు కాపాడడంలో ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. జాతీయ రహదారిపై నిత్యం ఎక్కడో ఓ చోట ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రుల్లో చేర్చే లోపే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రమాదం జరిగిన 5, 10 నిమషాల్లో చికిత్స అందించగలిగితే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు. పరిశీలనలే మిగిలాయి.. ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు స్థల పరిశీలన అంటూ రాష్ట్ర స్థాయి అధికారులు కొన్నేళ్లుగా పరిశీలనలు చేయడం తప్ప ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. మూడేళ్ల కిందట కూడా ఓ అధికారి భోగాపురం, రామభద్రపురంల్లో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేశారు. కాని ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. కేజీహెచ్‌కు తరలించాల్సిందే.. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రతి ఒక్కరికీ స్థానికంగా వైద్యం అందకపోవడంతో విశాఖ కేజీహెచ్‌కు గాని, ప్రైవేట్ ఆస్పత్రికి గాని తరలిస్తున్నారు. కేజీహెచ్‌లో అయితే ఉచితంగా వైద్యం అందుతుంది. ప్రైవేటఆస్పత్రుల్లో అయితే రూ. వేలల్లో వెచ్చించాల్సిన పరిస్థితి. ట్రామ్కేర్లో మెరుగైన సౌకర్యాలు.. క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించేందుకు ఎముకల వైద్యులు ముగ్గురు, జనరల్ ఫిజీషియన్ ఒకరు, ఎంబీబీఎస్ వైద్యులు ముగ్గురు, నర్సింగ్ సిబ్బంది 10 మంది వరకు ఉంటారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ట్రామాకేర్ సెంటర్‌కు తీసుకుని వెళితే తక్షణ వైద్యసేవలు అందిస్తారు. దీని వల్ల నూటికి 80 శాతం మంది వరకు ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి జిల్లాలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుచేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. -
జాడలేని ‘ట్రామా’
తాండూరు : రాష్ట్రంలోనే అత్యధికంగా వికారాబాద్జిల్లాలోనే రొడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నాయని ఇటీవల ఉన్నతాధికారుల కమిటీ ప్రకటించింది. ఒక్కసారిగా పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదం జరిగితే జిల్లాలోనే క్షతగాత్రులకు వైద్యం అందించి ట్రామాకేర్ సెంటర్ ద్వారా చికిత్సలను అందించాలి. కానీ జిల్లాలో ప్రమాదాల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతున్నా అధికారులు ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శంలు వస్తున్నాయి. గత శనివారం రాజీవ్ జాతీయ రహదారిపై 11 మందికి పైగా ప్రయాణికులు రొడ్డు ప్రమాదంలో మృతి చెందడం. పదుల సంఖ్యలో క్షతగాత్రులు కావడం జిల్లా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ట్రామాకేర్ సెంటర్ అందుబాటులోకి తీసుకురాక పోవడంతో అధికారులు, ప్రజాప్రతినిదుల నిర్లక్ష్యంపై సర్వాత్ర చర్చనీయాంశమైంది. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలను చేపట్టేందుకు గతంలో వికారాబాద్ జిల్లాలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం, రాష్ట్ర ఆర్అండ్బీ అధికారుల బృందం జిల్లాలో పర్యటించింది. ప్రమాదాలు జరిగితే మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేసి క్షతగాత్రులకు వైద్యం అందించాలని నిర్ణయించారు. అందుకోసం మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రావాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకోసం మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు రూ.30 కోట్ల వరకు కేటాయించారు. అందుకు సంభందించి తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలోని ఇందుకు దాదాపు రెండేళ్ల క్రితమే సుమారు రూ.5.92కోట్ల నిధులు మంజూరు చేసి ట్రామా కేర్ సెంటర్ నిర్వహణ కోసం అభివృద్ధి పర్చారు..వికారాబాద్ జిల్లాలో ప్రతి ఏటా సూమారు 350 నుంచి 400 వరకు రోడ్డు, రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని తాండూరులోని జిల్లా ఆస్పత్రిలోని ట్రామాకేర్ సెంటర్లోని వైద్యం అందించి అవసరమైన శస్త్ర చికిత్సలను వెంటనే చేయాలి. జాతీయ రహదారిపై పర్యవేక్షణేది.. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు జాతీయ రహదారిగా మార్చారు. వికారాబాద్ జిల్లా మీదుగా రహదారిని ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లాలోని మన్యగుడ నుంచి కొడంగల్ నియోజకవర్గంలోని కర్ణాటక సరిహద్దు వరకు ఈ హైవే ఉంది. సూమారు 90 కిలో మీటర్ల వరకు ఈ రహదారి జిల్లా నుంచి వెలుతుంది. జాతీయ రహదారి భద్రత కోసం రవాణ, ఆర్అండ్బీ, పోలీసు శాఖ, వైద్య శాఖలు హైవేపై పనిచేసేలా ఏర్పాటు చేస్తారు. అందులోకి పోలీసు శాఖ హైవే పోలీస్ స్టేషన్లను, అవుట్ పొస్ట్లను అందుబాటులో ఉంచింది. జాతీయ రహదారి సమీపంలో ప్రభుత్వం క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించేందుకు రూ.కోట్ల నిధులు ఖర్చు పెట్టి ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో కూడా వాటిని ఏర్పాటు చేసేందుకు పనులు మొదలు పెట్టి అసంపూర్తిగా వదిలేసారు. కేవలం ప్రాథమిక చికిత్సలకే పరిమితం... రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్సలు మినహా పూర్తి స్థాయి వైద్య సేవలు అందని పరిస్థితి. క్షతగాత్రులను 120 కి.మీ దూరంలో ఉన్న హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు.. ఈ క్రమంలో హైదరాబాద్‌కు వెళ్లేలోపు ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు సకాలంలో వైద్య సేవలు అందక మరణిస్తున్నారని వైద్యులు అంటున్నారు. ప్రత్యేక వైద్య సదుపాయాలు ఇలా... జాతీయ రహదారుల పరిధిలోకి వచ్చే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రుల్లోనే కేంద్రం నిధులతో ఈ సెంటర్ నెలకొల్పనున్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే వైద్యం అందించేందుకు తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలపమెంట్ కార్ఫొరేషన్(టీఎస్ఎంఐడీసీ) ట్రామ సెంటర్‌ను ఏర్పాటుకు పనులను ప్రారంభించారు. ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్లతోపాటు స్టాఫ్ నర్సులు, ప్రత్యేక అత్యవసర వైద్య సదుపాయాలు కలిగిన అంబులెన్స్, ఆధునాతన సౌకర్యాలతో కూడిన ఆపరేషన్ థియేటర్లు తదితర ప్రత్యేక వైద్య సిబ్బందిని నియామకం చేయనున్నారు. ప్రత్యేకంగా ఐసీయూ ఏర్పాటు, ఈ ట్రామా సెంటర్ కోసం మొత్తం రూ.5.92 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో రూ.5కోట్లతో పరికరాలు, వసతులు, రూ.80లక్షలతో బిల్డింగ్ తదితర సివిల్ పనులు, మరో రూ.12లక్షలతో అంబులెన్స్‌ను ఏర్పాటుకు నిధులను కేటాయించారు. ట్రామా కేర్ కోసం చేసిన పనులు ఎక్కడికక్కడే తుప్పుపట్టి పోయాయి. వైద్యం కోసం వచ్చిన పరికరాలను గదిలో వేసి తాళం వేయడంతో తుప్పు పట్టాయి. -
'ఉత్తరాంధ్రలో విమ్స్‌లో ట్రామా కేర్ సెంటర్'
విశాఖ: ట్రామా బృందంతో ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్రలో అత్యాధునిక వైద్యాన్ని అందించేందుకు విమ్స్‌లో ట్రామా కేర్ సెంటర్‌ను అందుబాటులోకి తేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కేన్సర్ పేషంట్ల కోసం ప్రభుత్వాస్పత్రుల్లో ఆధునిక వైద్యం అందిస్తామన్నారు. ట్రామా లెవల్ త్రి, ట్రామా కేర్ పైలట్ సెంటర్ ఏర్పాటుకు జీవీకే ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. వైద్య సేవల్లో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు.