తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి (ఇన్‌సెట్) ట్రామాకేర్ ఏర్పాటుకు వేసిన శిలాఫలకం
తాండూరు : రాష్ట్రంలోనే అత్యధికంగా వికారాబాద్‌జిల్లాలోనే రొడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నాయని ఇటీవల ఉన్నతాధికారుల కమిటీ ప్రకటించింది. ఒక్కసారిగా పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదం జరిగితే జిల్లాలోనే క్షతగాత్రులకు వైద్యం అందించి ట్రామాకేర్ సెంటర్ ద్వారా చికిత్సలను అందించాలి. కానీ జిల్లాలో ప్రమాదాల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతున్నా అధికారులు ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శంలు వస్తున్నాయి.
గత శనివారం రాజీవ్ జాతీయ రహదారిపై 11 మందికి పైగా ప్రయాణికులు రొడ్డు ప్రమాదంలో మృతి చెందడం. పదుల సంఖ్యలో క్షతగాత్రులు కావడం జిల్లా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ట్రామాకేర్ సెంటర్ అందుబాటులోకి తీసుకురాక పోవడంతో అధికారులు, ప్రజాప్రతినిదుల నిర్లక్ష్యంపై సర్వాత్ర చర్చనీయాంశమైంది. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలను చేపట్టేందుకు గతంలో వికారాబాద్ జిల్లాలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం, రాష్ట్ర ఆర్‌అండ్‌బీ అధికారుల బృందం జిల్లాలో పర్యటించింది.
ప్రమాదాలు జరిగితే మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేసి క్షతగాత్రులకు వైద్యం అందించాలని నిర్ణయించారు. అందుకోసం మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రావాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకోసం మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు.
తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు రూ.30 కోట్ల వరకు కేటాయించారు. అందుకు సంభందించి తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలోని ఇందుకు దాదాపు రెండేళ్ల క్రితమే సుమారు రూ.5.92కోట్ల నిధులు మంజూరు చేసి ట్రామా కేర్ సెంటర్ నిర్వహణ కోసం అభివృద్ధి పర్చారు..వికారాబాద్ జిల్లాలో ప్రతి ఏటా సూమారు 350 నుంచి 400 వరకు రోడ్డు, రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని తాండూరులోని జిల్లా ఆస్పత్రిలోని ట్రామాకేర్ సెంటర్‌లోని వైద్యం అందించి అవసరమైన శస్త్ర చికిత్సలను వెంటనే చేయాలి.
జాతీయ రహదారిపై పర్యవేక్షణేది..
కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు జాతీయ రహదారిగా మార్చారు. వికారాబాద్ జిల్లా మీదుగా రహదారిని ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లాలోని మన్యగుడ నుంచి కొడంగల్ నియోజకవర్గంలోని కర్ణాటక సరిహద్దు వరకు ఈ హైవే ఉంది. సూమారు 90 కిలో మీటర్ల వరకు ఈ రహదారి జిల్లా నుంచి వెలుతుంది. జాతీయ రహదారి భద్రత కోసం రవాణ, ఆర్‌అండ్‌బీ, పోలీసు శాఖ, వైద్య శాఖలు హైవేపై పనిచేసేలా ఏర్పాటు చేస్తారు.
అందులోకి పోలీసు శాఖ హైవే పోలీస్ స్టేషన్‌లను, అవుట్ పొస్ట్‌లను అందుబాటులో ఉంచింది. జాతీయ రహదారి సమీపంలో ప్రభుత్వం క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించేందుకు రూ.కోట్ల నిధులు ఖర్చు పెట్టి ట్రామాకేర్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నది. తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో కూడా వాటిని ఏర్పాటు చేసేందుకు పనులు మొదలు పెట్టి అసంపూర్తిగా వదిలేసారు.
కేవలం ప్రాథమిక చికిత్సలకే పరిమితం...
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్సలు మినహా పూర్తి స్థాయి వైద్య సేవలు అందని పరిస్థితి. క్షతగాత్రులను 120 కి.మీ దూరంలో ఉన్న హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు.. ఈ క్రమంలో హైదరాబాద్‌కు వెళ్లేలోపు ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు సకాలంలో వైద్య సేవలు అందక మరణిస్తున్నారని వైద్యులు అంటున్నారు.
ప్రత్యేక వైద్య సదుపాయాలు ఇలా...
జాతీయ రహదారుల పరిధిలోకి వచ్చే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రుల్లోనే కేంద్రం నిధులతో ఈ సెంటర్ నెలకొల్పనున్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే వైద్యం అందించేందుకు తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలపమెంట్ కార్ఫొరేషన్(టీఎస్‌ఎంఐడీసీ) ట్రామ సెంటర్‌ను ఏర్పాటుకు పనులను ప్రారంభించారు. ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్లతోపాటు స్టాఫ్ నర్సులు, ప్రత్యేక అత్యవసర వైద్య సదుపాయాలు కలిగిన అంబులెన్స్, ఆధునాతన సౌకర్యాలతో కూడిన ఆపరేషన్ థియేటర్లు తదితర ప్రత్యేక వైద్య సిబ్బందిని నియామకం చేయనున్నారు.
ప్రత్యేకంగా ఐసీయూ ఏర్పాటు, ఈ ట్రామా సెంటర్ కోసం మొత్తం రూ.5.92 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో రూ.5కోట్లతో పరికరాలు, వసతులు, రూ.80లక్షలతో బిల్డింగ్ తదితర సివిల్ పనులు, మరో రూ.12లక్షలతో అంబులెన్స్‌ను ఏర్పాటుకు నిధులను కేటాయించారు. ట్రామా కేర్ కోసం చేసిన పనులు ఎక్కడికక్కడే తుప్పుపట్టి పోయాయి. వైద్యం కోసం వచ్చిన పరికరాలను గదిలో వేసి తాళం వేయడంతో తుప్పు పట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment