గణేష్ ఇంటివద్ద స్నేహితులు, బంధువులు
సాక్షి, తాండూర్(అదిలాబాద్): నిశీధి వేళ జరిగిన రోడ్డు ప్రమాదం మంచిర్యాల జిల్లా తాండూర్‌లో తీరని విషాదాన్ని నింపింది. ఒకే ప్రమాదంలో ముగ్గురు బలికావడంతో వారి కుటుంబాలను దుఖఃసాగరంలో ముంచింది. అవసరం నిమిత్తం హైదరాబాద్‌కు కారులో బయలుదేరిన ఆ ముగ్గురు వ్యక్తులకు ఆ ప్రయాణమే చివరి మజిలీ అయింది. గురువారం వేకువజామున సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, మంచిర్యాల జిల్లా సర్పంచ్‌ల ఫోరం అ«ధ్యక్షుడు కొండు అంజిబాబు (33), టీఆర్‌ఎస్ యువజన నాయకుడు ఇడిదినేని గణేష్ (27), మరో యువకుడు అంగల సాయిప్రసాద్ (27) సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. మరో యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. రోడ్డును ఆనుకుని ఆగి ఉన్న ట్యాంకర్‌ను కారు ఢీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.
హైదరాబాద్‌కు బయలుదేరి..
తాండూర్ సర్పంచ్ అంజిబాబు ఓ పని నిమిత్తం తన మిత్రుడు గణేష్‌తో కలిసి అతడి కారులో బుధవారం అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ బయలుదేరారు. అదే సమయంలో వారి మిత్రుడు అంగల సాయిప్రసాద్ తన తల్లి వైద్యానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎన్‌వోసీ తీసుకురావడం కోసం ఆ ఇద్దరితోపాటు అదే కారులో ఎక్కాడు. డ్రైవింగ్ నిమిత్తం బానేష్ అనే వ్యక్తిని వెంట తీసుకెళ్లినప్పటికీ గణేష్ కారు నడిపాడు. కారు ప్రజ్ఞాపూర్ వద్దకు చేరుకోగానే రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ట్యాంకర్ లారీని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు స్నేహితులు మృత్యు ఒడికి చేరడం కలిచివేసింది. బానేష్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
ఘటనాస్థలికి వెళ్లిన నాయకులు, స్నేహితులు
ప్రమాద విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన ప్రజ్ఞాపూర్‌కు బయలుదేరి వెళ్లారు. పోస్టుమార్టం, ఇతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని సాయంత్రం వరకు మృతదేహాలను తాండూర్‌కు తీసుకొచ్చారు. అందరితో కలుపుగోలుగా ఉండే అంజిబాబు, గణేష్, సాయిప్రసాద్ మరణవార్త విని తాండూర్ మండలం శోకసంద్రంలో మునిగిపోయింది. వీరి మృతదేహాలను చూసేందుకు బంధువులు, మిత్రులు, స్థానిక నాయకులు వేలాదిగా తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, పలువురు ప్రముఖులు వీరి మృతిపట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారును పరిశీలిస్తున్న సర్పంచ్‌లు
చేతికి అందివచ్చాడనుకుంటే..
తాండూర్‌కే చెందిన ఇడిదినేని కమల, చంద్రయ్యకు ఇద్దరు కుమారులు. గణేష్ పెద్దవాడు. మొదటి నుంచి అన్నింటా ముందుండే గణేష్ రాజకీయం వైపు మళ్లాడు. తండ్రి చంద్రయ్య సింగరేణి ఉద్యోగాన్ని గణేష్‌కు పెట్టిద్దామనుకునే సమయంలో విధి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదం రూపంలో గణేష్‌ను కబలించి ఆ కుటుంబంలో ఎనలేని విషాదాన్ని
నింపింది.
రాజకీయాల్లో రాణిస్తూ..
తాండూర్‌కు చెందిన కొండు సత్తమ్మ, భీమయ్యకు ఇద్దరు కుమారులు. నలుగురు కుమార్తెలు. అంజిబాబు నాలుగో సంతానం. విద్యాభాస్యం పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్‌లో మెడికల్ ఏజెన్సీతోపాటు పలు వ్యాపారాలు నిర్వహించారు. యూనివర్సిటీ రాజకీయాల నుంచి ప్రేరణ పొంది, అదే స్ఫూర్తితో ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో స్వగ్రామమైన తాండూర్‌కు చేరారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పోటీచేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. 20 నెలల్లోనే ప్రజలతో మమేకమై గ్రామ పంచాయతీ అభివృద్ధికి పాటుపడ్డారు. ప్రజల మదిలో తనదైన ముద్ర వేసుకున్నారు. కొద్దిరోజుల్లోనే రాజకీయాల్లో ఎదిగి అంతే అనతికాలంలో అంజిబాబు కానరాని లోకానికి వెళ్లడాన్ని ప్రజలు జీర్ణించుకోలేపోతున్నారు. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న అంజిబాబుకు ఒక కుమార్తె ఉంది. అంజిబాబు మరణంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.
పాడెమోసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురువారం తాండూర్ చేరుకుని అంజిబాబు, గణేష్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా అంజిబాబు, గణేష్ పాడె మోశారు. అంజిబాబు, గణేశ్ టీఆర్‌ఎస్ పార్టీకి చేసిన సేవలు, వారితో తనకున్న సాన్నిహిత్యాన్ని ఎమ్మెల్యే గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ అంజిబాబు, గణేష్ మృతదేహాలకు నివాళులర్పించారు. వారితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అంతిమయాత్రలో జెడ్పీటీసీ సాలిగామ బానయ్య, ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అంజిబాబు పాడె మోస్తున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య
మాకు దిక్కెవరు బిడ్డా..!
తాండూర్‌కే చెందిన అంగల విజయ, చంద్రయ్యకు సాయిప్రసాద్, ఇద్దరు కూతుళ్లు సంతానం. సాయిప్రసాద్ చిన్నతనంలోనే తండ్రి మృతి చెందడంతో ఆ కుటుంబబాధ్యత తల్లిపై పడింది. పిల్లలను పెంచి పెద్ద చేసి విశ్రాంతి తీసుకుందామనుకున్న సమయంలో అనుకోని దుర్ఘటన జరిగింది. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తూ.. కుటుంబబాగోగులు చూసుకుంటున్న సాయిప్రసాద్ అనుహ్యంగా మరణించడంతో ఆ కుటుంబంలో చీకట్లు అలుముకున్నాయి. ‘ఇక మాకు దిక్కెవరు బిడ్డా..’ అని ఆ తల్లి రోదించిన తీరు అందరిని కలిచివేసింది.
Comments
Please login to add a commentAdd a comment