దేవరగట్టు..ఆచారానిదే పైమెట్టు
- నేడు జైత్రయాత్ర
- అర్ధరాత్రి సంప్రదాయ సమరం
- పోలీసుల భారీబందోబస్తు
హొళగుంద/ఆలూరు రూరల్: కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధమైంది. విజయదశమి పర్వదినాన ప్రతి ఏటా ఇక్కడ బన్ని ఉత్సవం జరుగుతుంది. జైత్రయాత్ర పేరుతో కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించినా ఇక్కడ సంప్రదయానిదే పైమెట్టు అవుతోంది.
దేవరగట్టులోని మాళమల్లేశ్వర స్వామి కల్యాణమహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరగనుంది. తర్వాత నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు కొండపై ఉన్న ఉత్సవ విగ్రహాలను పల్లకిలో కొండ కిందకు తీసుకొస్తారు. ఆ సమయంలో వేలాదిమంది భక్తులు జైత్రయాత్ర నిర్వహిస్తారు. జైత్రయాత్ర నిర్వహించే సమయంలో దేవుని పల్లకి ముందుకు తీసుకెళ్లే పేరుతో భక్తులు కర్రలతో సమరం చేస్తారు. అలా ఆ యాత్ర దేవరగట్టు అటవీప్రాంతంలో ఉన్న ముండ్లబండ వద్దకు వెళ్తుంది. అక్కడి నుంచి మాళమల్లేశ్వరస్వామి తిరుగాడిన పాదాలగట్టు ప్రాంతానికి చేరుకుంటుంది. ఆ ప్రాంతం నుంచి రక్షపడి(రాక్షసగుండ్లు) వద్దకు వెళ్లి అక్కడ గొరవయ్య తనతొడ రక్తాన్ని ఆ గుండ్లకు రాస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి పాదయాత్రగా భక్తులు శమీవృక్షం కిందకు చేరుకుంటారు. అక్కడ కర్రలను, పల్లకిని కిందకు దించి పూజలు నిర్వహిస్తారు. అలా కొనసాగిన జైత్రయాత్ర శనివారం తెల్లవారుజామున దేవరగట్టు కొండకింద ఉన్న ఎదురుబసవన్న గుడిపైకి ఎక్కి పూజారి గిరిస్వామి భవిష్యవాణి వినిపిస్తారు.
సమాధానం లేని ప్రశ్నలు
ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లే పేరుతో నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల ప్రజలు డుర్రు... డుర్రు.. గోబారక్ బహూపరాక్ అంటూ ముందుకొస్తారు. ఆ సమయంలో మరికొన్ని గ్రామాల ప్రజలు మధ్యలోకి వెళ్తారు. ఉత్సవ విగ్రహాలను ముందుకు తీసుకెళ్లేందుకు మాత్రమే తాము రక్షణగా కర్రలను ఉపయోగిస్తున్నామని వారు పేర్కొంటున్నారు. ఉత్సవ విగ్రహాలను మూడు గ్రామాలు మినహా ఏ గ్రామాల ప్రజలు వాటిని ఎత్తుకెళ్లరని వారే పేర్కొంటున్నారు. అయితే మరి ఎందుకు కర్రల సమరం జరుగుతుందో భక్తుల తలలు ఎందుకు పగులుతాయో అనే ప్రశ్నలకు గత కొన్నేళ్లుగా సమాధానాలే లేవు.
క్రూర మృగాల దాడి చేస్తాయనే..
దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి వెలసిన కొండప్రాంతం దాదాపు 40 కి.మీ. వరకు విస్తరించిన దట్టమైన అడవిలో ఉంది. అడవిలో క్రూరమృగాల దాడి నుంచి తమను తాము కాపాడుకునేందు పూర్వం భక్తులు పెద్దపెద్ద బరిసెలు, రింగులు తొడిగిన కర్రలను తీసుకెళ్లే వారు. కాలక్రమేణా ఆ సంప్రదాయం ఇప్పటికీ కూడా వస్తుందని భక్తులు అంటున్నారు. ప్రస్తుతం మారుణాయుధాలను వదిలి బన్ని ఉత్సవంలో కర్రలను ధరించి ఉత్సవ విగ్రహాల జైత్రయాత్ర ముందుకు సాగేలా చూస్తున్నామని భక్తులు చెబుతున్నారు.
ఇవీ దుర్ఘటనలు..
మాళమల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవాల్లో ప్రతి ఏటా పలువురు గాయపడుతున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చి వివిధ కారణాల ఐదు సంవత్సరాల్లో ఇద్దరు మరణించారు. రెండేళ్ల క్రితం భక్తుల తొక్కిసలాటలో నెరణికి గ్రామానికి చెందిన ఒక బాలుడు మృతిచెందాడు. గాయపడిన వారు: 2010–11లో130 మంది, 2011–12లో 121 మంది, 2012–13లో 140 మంది, 2013–14లో 119 మంది, 2014–15లో కేవలం 103 మంది, 2015–16లో 57 మంది భక్తులు గాయపడ్డారు.
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తాం: కొల్లి శ్రీనివాసరావు, ఆదోని డీయస్పీ
బన్ని ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తాం. గతేడాదితో పోలిస్తే ఈ యేడాది పోలీస్ బందోబస్తు కూడా పెరిగింది. గత రెండేళ్లుగా ఉత్సవాల్లో రింగులు తొడిగిన కర్రలను ఉపయోగించకుండా, మద్యానికి దూరంగా ఉండాలని అవగాహన సదస్సులు కూడా నిర్వహించాం. ఈ యేడాది ఉత్సవాల్లో అల్లరిమూకలను గుర్తించేందుకు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశాం. ఉత్సవాలు జరిగే ప్రదేశంలో 30 సీసీ కెమెరాలను కూడా అమర్చాం. సంప్రదాయం పేరుతో ఘర్షణకు దిగే వారిని కఠినంగా శిక్షిస్తాం.
ఏర్పాట్లు పూర్తి– ఓబులేస్, ఆదోని ఆర్డీఓ
బన్ని ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఉత్సవం జరిగే ప్రదేశంలో విద్యుత్ కోతలు లేకుండా ప్రత్యేక జనరేటర్లను కూడా ఏర్పాటు చేసి ఉత్సవం జరిగే చోట ఉత్సవాలను తిలకించే భక్తులపై అగ్గి దివిటీలను, కర్రలతో దాడులు చేయకుండా ఉండేలా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కరెంట్ కోతలు లేకుండా కూడా ట్రాన్స్కో అధికారులను ఆదేశించాం.
సంప్రదాయ సమరమే– మల్లికార్జున, నెరణికి గ్రామసర్పంచు
బన్ని ఉత్సవం కేవలం సంప్రదాయ సమరమే. కొన్నేళ్లుగా నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ఉత్సవాలను జరుపుకుంటారు. కల్యాణోత్సవం తర్వాత దేవుళ్లను ఊరేగింపుగా మూడు గ్రామాల ప్రజలు ఊరేగింపుగా తీసుకెళ్లే టప్పుడు ఇతర గ్రామాల ప్రజలు జైత్రయాత్రలో పాల్గొంటారు. అప్పుడు ఉత్సవ విగ్రహాలను ముందుకు తీసుకెళ్లేందుకు దేవుళ్లకు రక్షణగా వచ్చే భక్తులు కర్రలను గాలిలో తిప్పుతారు. ఆ సమయంలో భక్తులు ప్రమాదవశాత్తు గాయపడతారు.