మహిళ ఆత్మహత్యాయత్నం
ఏలూరు అర్బన్ : పెదవేగి మండలానికి చెందిన ఓ వివాహిత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. సాయల మరియమ్మ, మంగయ్య దంపతులు పెదవేగి మండలం ముండూరులో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కొంత కాలంగా మరియమ్మ తనను ఎవరో పిలుస్తున్నారని, తమతో వచ్చేయమని చెవిలో చెబుతున్నారని కుటుంబసభ్యులతో చెబుతోంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఏదో పీడ ఆవరించిందని భావించి తాయిత్తులు, గండాలు కట్టించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు మంగళవారం ఉదయం ఇంటిలో ఎవరూలేని సమయంలో శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీనిని గమనించిన ఇరుగుపొరుగు వారు బాధితురాలి భర్త, తండ్రి త్సవటపల్లి బాలాస్వామికి సమాచారం అందించడంతో వారు బాధితురాలిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.