Tribal Association
-
‘పోరు’ ఎవరికోసం? మావోయిస్టులకు 25 ప్రశ్నలు ఎక్కుపెట్టిన ఆదివాసీలు
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా ఆదివాసీల సంఘాల పేరిట పలు గ్రామాల్లో ఆదివారం పెద్దఎత్తున కరపత్రాలు కనిపించాయి. మండల కేంద్రంతోపాటు ఆర్.కొత్తగూడెం, కుదునూరు, కలివేరు గ్రామాల్లో వెలసిన ఈ కరపత్రాలలో ఆదివాసీ సం ఘాలు 25 ప్రశ్నలను సంధించాయి. ‘మావోయిస్టులు ఉన్నది పేదలమైన ఆదివాసీల బతుకులు మార్చడం కోసమే అయితే, మీవల్ల మా బతుకులు ఏం మారాయి? రోడ్లు లేక వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రులకు వెళ్లలేక ఇంకా ఎంతమంది చనిపోవాలి? కరెంట్ లేక ఇంకెంతకాలం చీకటిలో మగ్గాలి? మా ఊళ్లకు రోడ్లు ఎందుకు వేయనియ్యరు? జల్ జంగిల్ జమీన్ మీ కోసమా.. మా కోసమా? అడవుల్లో బాంబులు పెడుతూ మమ్మల్ని తిరగనివ్వకుండా ఎందుకు చేస్తున్నారు? మీరు పెట్టే మీటింగులకు మమ్ముల్ని భయపెట్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి? మీకు, మీ పార్టీకి ఇలా భయపడుతూ ఎంతకాలం బతకాలి? అంటూ కరపత్రాల్లో పలు ప్రశ్నలను సంధించాయి. (చదవండి: 51 కేసులు, నేరాలు చేయడంలో దిట్ట.. ఏడేళ్లుగా అజ్ఞాతంలో.. చివరికి..) -
ఆ..శ్రమ పడాల్సిందేనా..
శ్రీకాకుళం , సీతంపేట: గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నాసిరక భోజనమే అందుతోంది. రుచీపచీ లేని కూరలు, రసంతో తినలేకపోతున్నామని వాపోతున్నారు. ప్రధానంగా చాలీచాలనీ వంట సిబ్బందితో వండి పెట్టడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ఈ పోస్టుల భర్తీలో మీనమేశాలు లెక్కించడంతో తప్పడం లేదు. జిల్లాలోని 47 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 5,176 వేల మంది బాలురు, 5,188 మంది బాలికలు చదువుతున్నారు. మొత్తం 11 వేల మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 16 పోస్టుమెట్రిక్ వసతిగృహాల్లో 4 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి మూడు పూటలా భోజనం వండి పెట్టాల్సి ఉంది. ఇందుకుగాను మొత్తం 203 మంది అవసరం కాగా, 113 మంది మాత్రమే ఉన్నారు. 90 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. వంటమనుషులు 29, సహాయకులు 33, వాచ్మెన్లు 28, ఆఫీస్ సభార్డినేట్లు 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా వంటశాలలు సైతం 15 పాఠశాలల వరకు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పరిస్థితి... స్థానిక ఆశ్రమ పాఠశాలల వసతి గృహాలతోపాటు మారుమూల గ్రామాల్లోని వసతి గృహాల్లోనూ ఇబ్బందులు తప్పడంలేదు. సీతంపేట బాలికల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 650 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి వండి వడ్డించడానికి ఇద్దరు వంటమనుషులు, మరో ఇద్దరు సహాయకులు, నైట్‌వాచ్‌వుమెన్ ఉండాలి. ఒక వాచ్మెన్, కుక్ మాత్రమే ఉన్నారు. పూతికవలసలో 500ల మందికి పైగా విద్యార్థులు ఉండగా ఒక వంట మనిషే ఉన్నారు. పొల్ల ఆశ్రమ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ఇంతవరకు నైట్‌వాచ్‌మెన్ లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే శంబాం, హడ్డుబంగి, చిన్నబగ్గ తదితర ఆశ్రమ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నిలిచిన పోస్టుల భర్తీ.. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో గిరిజన విద్యకు కల్పిస్తున్న మౌలిక వసతులకు పొంతన లేకుండా పోయింది. మూడేళ్ల క్రితం ఖాళీ పోస్టులను ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నప్పటకీ పైరవీలు చోటు చేసుకోవడంతో మధ్యలో నిలుపుదల చేశారు. పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాల పరిస్థితి మరీ దారుణం. అక్కడ పోస్టులే మంజూరు కాకపోవడం గమనార్హం. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో వసతిగృహ సంక్షేమాధికారులు సొంత డబ్బులు వెచ్చించి ప్రయివేటుగా వంటమనుషులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ విద్యాసంవత్సరం కూడా వచ్చే నెల 23వ తేదీతో ముగియనుంది. అప్పటివరకూ వీరితోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఏమన్నారంటే... ఈ విషయమై గిరిజన సంక్షేమశాఖ డీడీ భవానీశంకర్ వద్ద ప్రస్తావించగా వంటమనుషులు, సహాయకులు, ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ఐటీడీఏ పీవో ద్వారా ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. వాటి భర్తీకి అనుమతిరావాల్సి ఉందన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు లేవు ప్రభుత్వ మొద్దునిద్రతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మారుమూల ప్రాంతాల్లో వంటవారితోపాటు వంట పాకల సమస్య ఉంది. అది కూడా పరిష్కరించాల్సి ఉంది. ఇప్పట్లో ఇవి పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు.– ఎం కనకారావు,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు -
బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్
గిరిజన సంఘం, బాక్సైట్ వ్యతిరేక ఐక్యకార్యాచరణ కమిటీ హెచ్చరిక కలెక్టరేట్ వద్ద ధర్నా మహారాణిపేట (విశాఖ): గిరిజనుల గొంతు కోసే బాక్సై ట్ జోలికొస్తే అంతుచూస్తామని గిరి జన సంఘం, బాక్సైట్ వ్యతిరేక ఐక్య కార్యాచరణ కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. చింతపల్లి ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల కోసం జారీ చేసిన జీవో నెంబర్ 97ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి గిరిజనుల జీవనాన్ని ఫణంగా పెడుతూ బాక్సైట్ తవ్వకాలు చేపడతామంటూ మొండికేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుకు నిరసనగా సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. వీరికి పాడేరు, అరకు, పాలకొండ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వర్రావు, విశ్వరాయి కళావతి, ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ అధికారంలోకి రాక ముందు చంద్రబాబు 2012లో కేంద్రానికి, గవర్నర్‌కు రాసిన లేఖలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఇప్పుడు బాక్సైట్ తవ్వకాలు చేపడతామని ఇటీవల జారీ చేసిన జీవోను చూస్తే ఆయన ఊసరవిల్లి తనాన్ని చూసి ఎవరికైనా మతిపోతుందన్నారు. జీవో 97 గవర్నర్ ఆమోదం పొంది వస్తే ఆ జీవో గిరిజన సంక్షేమ శాఖా మంత్రికి తెలియకుండా వచ్చిందని సాక్షాత్తు సీఎం చెప్పడం ఆయన నక్కలమారి జిత్తు వేషాలకు నిదర్శనమన్నారు. గిరిజన చట్టాలపై మంత్రి అయ్యన్న మతీసుతీ లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీలో 1/70 చట్టం ప్రకారం గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో మైనింగ్ తవ్వితే లేని అభ్యంతరం ఇక్కడెందుకు వస్తుందో చెప్పాలనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులంతా నిద్రాహారాలు మాని ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటే బాక్సైట్ తవ్వొద్దని గిరిజనులెవరూ చెప్పడం లేదని, కొంతమంది నాయకులే వారిని రెచ్చగొడుతున్నారని అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గిరిజనులంటే మీకు అంతచులకనగా ఉందా? మీకు దమ్ము ధైర్యముంటే ఏజెన్సీ ప్రాంతానికి రండి.. మిమ్మల్ని గిరిజనులు తరిమి కొట్టకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేవారు. గిరిజనుల సంపదను దోచుకోవాలనే ముందు చూపుతోనే చంద్రబాబు రెండేళ్లవుతున్నా ఇంత వరకు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు మాట్లాడుతూ గిరిజనుల గురించి, గిరిజన చట్టాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏం తెలుసు? బాక్సైట్ తవ్వకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు చెప్పింది, సాక్షాత్తు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో నియమించిన కేంద్రమంత్రి వర్గ సమావేశం బాక్సైట్ తవ్వకాలు చేపట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇంకా అనేక సంస్థలు కోర్టుకెల్లి 1/70 చట్టం, పీసా, పర్యావరణ చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి చట్టాలకు అనుకూలంగా తీర్పులు తెస్తే వాటన్నింటినీ తుంగలో తొక్కి బాక్సైట్ తవ్వకాలు చేపట్టడానికి గిరిజనులు అమాయకులు కాదన్నారు. ఇప్పటికే ఏజెన్సీలో అభ్యర్థులను డిపాజిట్ల్లు రాకుండా ఓడించారని.. ఇంకా నువ్వు ముందుకెల్తే గిరిజనులు చూస్తూ ఊరుకోబోరని బాబును హెచ్చరించారు. ఈ ధర్నాకు ఆంధ్రప్రదేశ్ గిరిజన ఉద్యోగుల సంఘం, ఏపీ గిరిజన ఐక్యసంఘం, ఆదివాసీ రిజర్వేషన్ సంరక్షణ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం, ఏయూ గిరిజన ఉద్యోగుల సంఘం, గిరిజన మహిళా సమన్వయ కమిటీ, రిమోట్ ఏజెన్సీ ట్రైబల్ ఎంపవర్మెంట్ సొసైటీ సంఘీబావం పలికాయి.