బాక్సైట్ జోలికొస్తే ఖబడ్దార్
గిరిజన సంఘం, బాక్సైట్ వ్యతిరేక ఐక్యకార్యాచరణ కమిటీ హెచ్చరిక
కలెక్టరేట్ వద్ద ధర్నా
మహారాణిపేట (విశాఖ): గిరిజనుల గొంతు కోసే బాక్సై ట్ జోలికొస్తే అంతుచూస్తామని గిరి జన సంఘం, బాక్సైట్ వ్యతిరేక ఐక్య కార్యాచరణ కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. చింతపల్లి ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల కోసం జారీ చేసిన జీవో నెంబర్ 97ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి గిరిజనుల జీవనాన్ని ఫణంగా పెడుతూ బాక్సైట్ తవ్వకాలు చేపడతామంటూ మొండికేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుకు నిరసనగా సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. వీరికి పాడేరు, అరకు, పాలకొండ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వర్రావు, విశ్వరాయి కళావతి, ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ అధికారంలోకి రాక ముందు చంద్రబాబు 2012లో కేంద్రానికి, గవర్నర్‌కు రాసిన లేఖలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఇప్పుడు బాక్సైట్ తవ్వకాలు చేపడతామని ఇటీవల జారీ చేసిన జీవోను చూస్తే ఆయన ఊసరవిల్లి తనాన్ని చూసి ఎవరికైనా మతిపోతుందన్నారు. జీవో 97 గవర్నర్ ఆమోదం పొంది వస్తే ఆ జీవో గిరిజన సంక్షేమ శాఖా మంత్రికి తెలియకుండా వచ్చిందని సాక్షాత్తు సీఎం చెప్పడం ఆయన నక్కలమారి జిత్తు వేషాలకు నిదర్శనమన్నారు.
గిరిజన చట్టాలపై మంత్రి అయ్యన్న మతీసుతీ లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీలో 1/70 చట్టం ప్రకారం గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో మైనింగ్ తవ్వితే లేని అభ్యంతరం ఇక్కడెందుకు వస్తుందో చెప్పాలనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులంతా నిద్రాహారాలు మాని ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటే బాక్సైట్ తవ్వొద్దని గిరిజనులెవరూ చెప్పడం లేదని, కొంతమంది నాయకులే వారిని రెచ్చగొడుతున్నారని అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గిరిజనులంటే మీకు అంతచులకనగా ఉందా? మీకు దమ్ము ధైర్యముంటే ఏజెన్సీ ప్రాంతానికి రండి.. మిమ్మల్ని గిరిజనులు తరిమి కొట్టకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేవారు. గిరిజనుల సంపదను దోచుకోవాలనే ముందు చూపుతోనే చంద్రబాబు రెండేళ్లవుతున్నా ఇంత వరకు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు మాట్లాడుతూ గిరిజనుల గురించి, గిరిజన చట్టాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏం తెలుసు? బాక్సైట్ తవ్వకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు చెప్పింది, సాక్షాత్తు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో నియమించిన కేంద్రమంత్రి వర్గ సమావేశం బాక్సైట్ తవ్వకాలు చేపట్టొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
ఇంకా అనేక సంస్థలు కోర్టుకెల్లి 1/70 చట్టం, పీసా, పర్యావరణ చట్టం, అటవీ హక్కుల చట్టం వంటి చట్టాలకు అనుకూలంగా తీర్పులు తెస్తే వాటన్నింటినీ తుంగలో తొక్కి బాక్సైట్ తవ్వకాలు చేపట్టడానికి గిరిజనులు అమాయకులు కాదన్నారు. ఇప్పటికే ఏజెన్సీలో అభ్యర్థులను డిపాజిట్ల్లు రాకుండా ఓడించారని.. ఇంకా నువ్వు ముందుకెల్తే గిరిజనులు చూస్తూ ఊరుకోబోరని బాబును హెచ్చరించారు. ఈ ధర్నాకు ఆంధ్రప్రదేశ్ గిరిజన ఉద్యోగుల సంఘం, ఏపీ గిరిజన ఐక్యసంఘం, ఆదివాసీ రిజర్వేషన్ సంరక్షణ సంఘం, గిరిజన విద్యార్థి సంఘం, ఏయూ గిరిజన ఉద్యోగుల సంఘం, గిరిజన మహిళా సమన్వయ కమిటీ, రిమోట్ ఏజెన్సీ ట్రైబల్ ఎంపవర్‌మెంట్ సొసైటీ సంఘీబావం పలికాయి.