గిరిజన మహిళా డీఎస్పీకి అన్యాయం
- ఉద్యోగంలో చేరిన నెలకే శ్రీలక్ష్మి వీఆర్‌కు బదిలీ
- మంత్రి యనమల వియ్యంకుడిని కలవకపోవడమే కారణం
- ఐదు నెలలుగా పోస్టింగ్ ఇవ్వని ఉన్నతాధికారులు
సాక్షి, అమరావతి: పేద గిరిజన కుటుంబంలో పుట్టినా ఆమె కష్టపడి చదువుకుంది. చదువుకు తగ్గట్టే గ్రూప్–1 పరీక్ష రాసి డీఎస్పీగా ఉద్యోగం సాధించింది. శిక్షణ కాలం పూర్తయ్యాక ఉద్యోగంలో చేరి విధులు నిర్వర్తించడంలో నిమగ్నమైంది. అయితే ఉద్యోగంలో చేరిన వెంటనే అధికార పార్టీ నేతలకు సలాం కొట్టాలనే విషయాన్ని తెలుసుకోలేక పోయింది. అదే ఆమె తప్పయింది. దాంతో కారణాలు చెప్పకుండానే ఆమెపై బదిలీవేటు పడింది. కొత్తగా నియమితురాలైన డీఎస్పీ కె.శ్రీలక్ష్మి తనను కలవలేదనే నెపంతో వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్.. ఆమెను బదిలీ చేయించారని పోలీసు వర్గాలంటున్నాయి. 2016 డిసెంబర్ 30న మైదుకూరు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీలక్ష్మిని 2017 ఫిబ్రవరి 5న వీఆర్‌కు పంపుతూ డీజీపీ ఆదేశాలిచ్చారు. టీడీపీ నేతలను ముందుగా కలవాలని తెలియనందునే కలవలేకపోయానని ఆమె చెప్పినా డీజీపీ వినిపించుకోలేదనేది సమాచారం.
బదిలీ వెనుక యనమల వియ్యంకుడు
కాంట్రాక్టర్ అయిన సుధాకర్ యాదవ్.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణునికి వియ్యంకుడు. దీంతో మంత్రిని అడ్డుపెట్టుకొని నచ్చని వారిని బదిలీ చేయిస్తుంటారన్న ఆరోపణలున్నాయి.
ఐదు నెలలుగా జీతం లేక..
వీఆర్‌లో ముగ్గురికంటే ఎక్కువ మంది ఉండటంతో నిబంధనల ప్రకారం శ్రీలక్ష్మికి 5 నెలలుగా జీతం, భత్యం లేదు. శ్రీలక్ష్మిపై ఇలా కక్షగట్టడం దారుణమని పోలీసు వర్గాలు అంటున్నాయి.