హక్కు పత్రాలేవి..?
సాక్షి, ఏటూరునాగారం: పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని గిరిజనులు తొమ్మిదేళ్లుగా ఐటీడీఏ చుట్టు చెప్పులు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకునేవారే లేరు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2009లో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన గిరిజనులకు అటవీ హక్కు చట్టం కింద పాసు పుస్తకాలను అందజేశారు. అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14,016 మందికి 41,314 ఎకరాల విస్తీర్ణంతో కూడిన పత్రాలు ఇచ్చారు. వైఎస్సార్ అకాల మరణం అనంతరం అధికారంలోకి వచ్చిన పాలకులు పట్టించుకోలేదు.
ఇప్పటి వరకు 23,154 మంది సుమారు 71వేల ఎకరాలకు సంబంధించి హక్కు పత్రాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. తొమ్మిది సంవత్సరాలుగా గిరిజనులు ఎదురు చూస్తున్నారు. అయినా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి(జనరల్), స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌తో పాటు ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లు, అటవీశాఖ అధికారులు ఈ అటవీ హక్కు పత్రాలు ఇచ్చేందుకు ఎలాంటి కమిటీలు వేయలేదు. సర్వేలు చేపట్టడం లేదు. దీంత ప్రతి నెలలో సోమవారం జరిగే గ్రీవెన్స్‌కు హక్కు పత్రాలు ఇప్పించాలని గిరిజనులు దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. అధికారులు వాటిని చూసి మిన్నకుండి పోతున్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం–2006..పోడు భూమిలో 2005 డిసెంబర్ 13 తేదీలోపు వ్యవసాయం చేస్తున్న వారికి మాత్రమే షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసితుల(అటవీ హక్కుల గుర్తింపు) చట్టం వర్తిస్తుందని నిబంధన ఉంది.
ఫారెస్ట్ రైట్స్ కమిటీ(ఎఫ్ఆర్సీ కమిటీ)..
గ్రామ పెద్ద చైర్మన్‌గా.. డిప్యూటీ తహసీల్దార్, వీఆర్ఓ, బీట్ ఆఫీసర్ 15 మంది కమిటీ సభ్యులతో కలిసి అటవీ హక్కుల కమిటీని ఎన్నుకుంటారు. వీరి ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో సభ నిర్వహించి గిరిజన రైతుల పేర్లను ప్రకటించి అందులో అర్హులను ఎంపిక చేసి తీర్మానం చేస్తారు.
సబ్ డివిజన్ లెవల్ కమిటీ(ఎస్డీఎల్సీ )
ఆర్డీఓ చైర్మర్‌గా, ఏటీడీఓ, ముగ్గురు ఎంపీటీసీలు, ఫారెస్ట్ రేంజ్ అధికారి, సబ్ డివిజన్ అటవీశాఖ అధికారితో కమిటీ ఉంటుంది. ఈ కమిటీలోని సభ్యులు గ్రామ సభలో తీర్మానం చేసిన వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, అందులో తప్పులుంటే వెతికి మరో తీర్మానాన్ని తయారు చేసి డీఎల్సీ కమిటీకి పంపిస్తారు.
డిస్టిక్ లెవల్ కమిటీ(డీఎల్సీ)
డిస్టిక్ లెవల్ కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కన్వీనర్‌గా సభ్యులుగా డీఎఫ్ఓతో పాటు మరో ముగ్గురు జెడ్పీటీసీలు ఉంటారు. ఈ కమిటీలో కింద కమిటీ తీర్మానం చేసి పత్రాలను పూర్తిగా పరిశీలిస్తారు. క్షేత్ర స్థాయిలో కొంత మందిని పంపించి అర్హుల పేర్లు నిజమా.. లేదా ఏదైనా బినామీనా అని తేల్చుకుంటారు. తర్వాత అర్హత ఉంటే వెంటనే ఆ గిరిజన రైతును అర్హుడిగా ప్రకటించి హక్కు పత్రం అందజేస్తారు. ఈ కమిటీల్లో ప్రస్తుతం ఒక్కటి కూడా పనిచేయడంలేదు. ఎక్కడ కూడా ఆర్ఓఎఫ్ఆర్ సమస్యలను పరిష్కరించడంలేదు. క్లెమ్‌లు సైతం చేయలేదు. గిరిజన రైతులకు ఎదరు చూపులు తప్పడం లేదు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం..
గిరిజన రైతులకు పోడు భూముల హక్కు పత్రాలు ఇచ్చే విషయమై ఇటీవల మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో డీఎల్సీ కమిటీ సమావేశమైంది. అధికారులతో పలు విషయాలను చర్చించాం. పోడు రైతుల దరఖాస్తులను పరిశీలించాం. పోడు భూముల రైతుల ససమ్యల పరిష్కారానికి కృషి చేస్తాం. – చక్రధర్‌రావు, ఐటీడీఏ పీఓ ఏటూరునాగారం