టీఆర్ఎస్ కుటుంబ పార్టీ
వికారాబాద్, పూడూరు, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని, కేసీఆర్‌ను ఎవరూ విశ్వసించొద్దని కేంద్ర మంత్రి జైరాంరమేష్ పిలుపునిచ్చారు. గురువారం ఆయన వికారాబాద్‌లోని గౌలీకర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో, అనంతరం పూడూరు మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో విద్యార్థుల బలిదానాలకు ప్రధాన కారణం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులేనని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధేనని ఆయన స్పష్టంచేశారు. కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు తెలంగాణ కోసం ఎంతోమంది మహానుభావులు పోరాటాలు చేశారన్నారు. టీడీపీ హయాంలో మంత్రి పదవి దక్కలేదనే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించారన్నారు. 60 ఏళ్ల ప్రజా పోరాటాలను దృష్టిలో ఉంచుకొనే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని ఆయన కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవారంతా చుట్టాలేనని అందులో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఎక్కడున్నారని ఆయన దుయ్యబట్టారు.
‘కారు’కు కాలం చెల్లింది
‘దే శంలో ప్రస్తుతం ఎక్కడైనా.. ఎవరైనా అంబాసిడర్ కారును వాడుతున్నారా.. కాలం చెల్లిన కారును స్టార్ట్ చేయాలంటే తాళం చెవిని ఇరవైసార్లు ఉపయోగించినా ఫలితం ఉండదు. ఈ నేపథ్యంలో కారును ఎవైరె నా తోసి స్టార్ట్ చేసినా అది ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది.. ఆ కారులాగే కేసీఆర్ కూడా ఎక్కడో ఓ చోట ఆగిపోయి.. ఏదో ఓ పార్టీలో తన పార్టీని కలిపే పరిస్థితి వస్తుంది.. అలాంటి పార్టీకి ప్రజలు ఓటేస్తే నక్కతోకను పట్టుకొని నదిని ఈదినట్లే అవుతుంద’ని కేంద్రమంత్రి తనదైన శైలిలో వ్యంగ్యంగా అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ ఇన్నాళ్లూ అదిగో తెలంగాణ.. ఇదిగో తెలంగాణ అని కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిందని.. దీంతో ప్రజలు తమ విలువైన ప్రాణాలను త్యాగం చేశార న్నారు. కేసీఆర్ అనే ఒక్క వ్యక్తితో సామాజిక తెలంగాణ ఎలా సాధ్యమవుతుందో ప్రజలే గుర్తించాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే అది హైదరాబాద్‌పై వచ్చే ఆదాయంతో సాధ్యమవుతుందన్నారు. వికారాబాద్‌లో ప్రసాద్‌కుమార్ గెలిస్తే ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన్నట్లేనని ఆయన జోస్యం చెప్పారు.
కార్యక్రమంలో మాజీ మంత్రులు ప్రసాద్‌కుమార్, చంద్రశేఖర్, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్, న్యాయవాది గోవర్ధన్‌రెడ్డి, కొప్పుల రాజు పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో ప్రచారం..
పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల, కంకల్ గ్రామాల్లో కేంద్ర మంత్రి జైరాంరమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ దెబ్బతింటుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి ఇప్పుడు మాటమారుస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి టీఆర్‌ఆర్‌ను, చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి కార్తీక్‌రెడ్డిని భారీ మెజార్టీలో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏఐసీసీ ఎస్సీ, ఎస్టీ కమిటీ విభాగం ప్రతినిధి కొప్పుల రాజు మాట్లాడుతూ టీఆర్‌ఆర్‌ను గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ పూడూరు మండల అధ్యక్షుడు సుభానయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి, సునంద బుగ్గన్నయాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, కంకల్ వెంకటేశం, సర్పంచ్‌లు రాజు, మధుసూదన్‌రెడ్డి, షకీల్, మాజీ ఎంపీపీ భగవాన్దాన్, కంకల్ ప్రభాక్గుప్త, బాదం శ్రీనివాస్‌గుప్త, శ్యాం, మేఘమాల, సురేఖ తదితరులు పాల్గొన్నారు.