trs govenment
-
తెలంగాణ ఆకాంక్షలేవీ నెరవేరలేదు
-
ఆ మంత్రికి టికెట్ రాదు.. వస్తే డిపాజిట్ రాదు..!
సాక్షి, నల్గొండ : ‘నాకు మంత్రి పదవి వద్దు.. ముఖ్యమంత్రి పదవి వద్దు.. కేసీఆర్ను గద్దె దింపడమే ధ్యేయంగా పనిచేస్తానని’ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం నలుగురి చేతిలో నలిగిపోతుందని కోమటిరెడ్డి అన్నారు. అంతేకాక వారి చేతిలో నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు నల్గొండలో పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు విదేశాల నుంచి విమానాలలో మిషనరీ తెస్తున్నారు.. కానీ నల్గొండలోని ఎస్ఎల్బీసీ సొరంగం పనులకు, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయడం లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డిపై కోమటిరెడ్డి తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. మంత్రి జగదీశ్ రెడ్డికి టికెట్ రాదని.. ఒకవేళ టికెట్ వచ్చినా డిపాజిట్ కూడా దక్కదని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్లమెంట్, 12 అసెంబ్లీ సీట్లను గెలిపించి కాంగ్రెస్ పార్టీ సినీయర్ నాయకురాలు సోనియాగాంధీకి అంకితం ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఎలాగైనా తనను తప్పించి, శాసనసభ్యత్వం రద్దు చేసి, గన్మెన్లను తీసేశారని గుర్తుచేశారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవినీతిని బయటికి తీస్తామని ఆయన ధ్వజమెత్తారు. పాత ప్రాజెక్టులు పూర్తి చేస్తే కాంగ్రెస్కు పేరు వస్తుందని, కొత్త ప్రాజెక్టులు కడితే కమిషన్లు వస్తాయని, పాత ప్రాజెక్టులు పూర్తి చేయడంలేదని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సత్తా చూపించారు.. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. కాకలు తీరిన కార్యకర్తలు.. ఉద్దండులైన నాయకులందరూ నల్గొండలో ఉన్నారన్నారు. జిల్లా ప్రజలు అవసరం వచ్చినప్పుడు తమ శక్తిని చూపెడతారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ సత్తా చూపించారని జానారెడ్డి గుర్తు చేశారు. జిల్లాకు వీర చరిత్ర ఉంది.. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కానుకగా అన్ని స్థానాలు గెలిపించి ఇవ్వాలని జానారెడ్డి కోరారు. ఈ పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ పద్మావతి, దామోదర్ రెడ్డి, మల్లు రవి, బూడిద బిక్షమయ్య గౌడ్, భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశానికి విచ్చేసిన వారికి బాణసంచా కాల్చి కోమటిరెడ్డి అభిమానులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. -
ఉపాధ్యాయ బదిలీలపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో పాలకులు అహంకారంతో వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఏ మాత్రం జరగడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు గౌరవం దక్కడం లేదన్నారు. పక్క రాష్ట్రంలో 10వేల ఉద్యోగాలు నియామకాలు చేపడితే.. తెలంగాణలో 10 కూడా జరగలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. 4 సంవత్సరాల కాలంలో డీఎస్సీ, టీచర్ల నియామకాలను ప్రభుత్వం చేపట్టలేదని ఉత్తమ్ పేర్కొన్నారు. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డు కష్టాలు తప్పడం లేదన్నారు. -
పంచాయతీలకు కొత్త మ్యాపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ పటాల రూపకల్పనలో ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ప్రస్తుతమున్న రెవెన్యూ గ్రామాలవారీ మ్యాపులు కాకుండా ప్రతి గ్రామ పంచాయతీకి ఓ మ్యాపును సిద్ధం చేస్తోంది. ఈ మ్యాపుల్లో సరిహద్దులు, రైల్వే, రోడ్డు మార్గాలతోపాటు కొత్తగా సర్వే నంబర్లవారీ భూముల వివరాలు, ప్రభుత్వ భూముల వివరాలను సర్వేశాఖ ప్రత్యేకంగా పేర్కొననుంది. ప్రతి సర్వే నంబర్ స్పష్టంగా... రెవెన్యూ గ్రామాలవారీగా ఉన్న మ్యాపుల్లో రెవెన్యూ గ్రామ సరిహద్దులతోపాటు రైల్వే, రోడ్డు మార్గాలు, అటవీ భూములు, నీటివనరులు, వృథాగా ఉన్న భూములు తదితర వివరాలే ఉండేవి. సర్వే నంబర్లను కేవలం ఉదహరించేవారు కానీ ఏ నంబర్లో ఎంత భూమి ఉందన్న వివరాలు ఉండేవి కావు. ఇప్పుడు సర్వే నంబర్లవారీ భూముల వివరాలతోపాటు ప్రత్యేకంగా ప్రభుత్వ భూములను కూడా మ్యాపుల్లో గుర్తించనున్నారు. గతంలో ఉన్న దాదాపు 9 వేల పంచాయతీలకుతోడు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న 4 వేల పంచాయతీలను కలిపి మొత్తం 13 వేల మ్యాపులను సర్వేశాఖ సిద్ధం చేస్తోంది. వనరుల్లో స్పష్టత... రెవెన్యూ గ్రామాల మ్యాపుల స్థానే గ్రామ పంచాయతీ మ్యాపుల తయారీ ద్వారా ప్రతి గ్రామానికి ఉన్న వనరుల విషయంలో స్పష్టత తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ గ్రామాలవారీ మ్యాపుల ద్వారా ఆయా గ్రామాల్లో ఉన్న పంచాయతీలన్నింటినీ ఒకే సరిహద్దు కింద చూపిస్తున్నారు. మరికొన్ని చోట్ల రెండు, మూడు రెవెన్యూ గ్రామాలు కలిపి ఓ పంచాయతీగా ఉంటే ఒకే పంచాయతీకి రెండు, మూడు మ్యాపులున్నాయి. ఈ నేపథ్యంలో ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వనరుల విషయంలో స్పష్టత రావాలంటే గ్రామ పంచాయతీలవారీగా మ్యాపులు తయారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి హామీ పథకం పనులు, భూ లావాదేవీలను స్పష్టంగా గ్రామ పంచాయతీలవారీగా విభజించే అవకాశం కలగనుంది. అయితే ఈ మ్యాపుల తయారీకి నిధుల కొరత ఉందని సర్వేశాఖ అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వం మ్యాపులను తయారు చేయాలని చెప్పింది కానీ ఇందుకు అయ్యే ఖర్చును ఏ పద్దు కింద తీసుకోవాలో పేర్కొనలేదని జిల్లాస్థాయి అధికారులు చెబుతున్నారు. జిల్లాకు సగటున రూ. 2 లక్షల వరకు ఖర్చవుతోందని, కొన్ని చోట్ల కలెక్టర్లు ఈ ఖర్చును ఇచ్చేందుకు అంగీకరిస్తున్నా మరికొన్ని జిల్లాల్లో సర్వేశాఖ అధికారులు ఎప్పటికైనా రాకపోతాయా అనే ఆలోచనతో సొంత నిధులను వినియోగిస్తున్నట్లు సర్వేశాఖలో చర్చ జరుగుతుండటం గమనార్హం. -
వినాశకర విధానాలతో ముందుకు వెళుతోంది
హైదరాబాద్: పరిపాలన మీద ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సూచించారు. మహాజన పాదయాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకోవాలని.. లేదంటే సీపీఎం తయారుచేసిన ప్రజా సమస్యల ప్రణాళికలను పాటించండని సూచించారు. సమాజంలో అనేక మార్పులు రావాల్సిన పరిస్థితి ఉందన్నారు. అట్టడుగు వర్గాలు 93 శాతం ఉన్న తెలంగాణలో అభివృద్ధి ఫలాలు వారికే ముందు అందాల్సి ఉందని గుర్తు చేశారు. వీర తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తిని మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన సందర్బం వచ్చిందన్నారు. విభజన జరిగిన తరువాత కూడా తెలంగాణలో విధానాలు మారలేదని అన్నారు. ప్రజా ఆగ్రహానికి కేసీఆర్ నవ్వుతున్నారని.. ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూసే రోజు దగ్గర్లోనే ఉన్నదని హెచ్చరించారు. నోట్ల రద్దు వ్యవహారం ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని.. వంద మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వినాశకర విధానాలతో ముందుకు వెళుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు కేంద్ర ప్రభుత్వం సృష్టించిన ఒక వైపరిత్యమని చెప్పారు. గుజరాత్ లోని అత్యధికంగా దొంగనోట్లు బయటపడ్డాయని పేర్కొన్నారు. బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ ప్రారంభించిన ఈ పాదయాత్ర క్షేత్ర స్థాయిలో పనిచేసిందన్నారు. ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులే పాదయాత్ర విజయవంతం అవడానికి కృషి చేశాయన్నారు.