పంచాయతీలకు కొత్త మ్యాపులు | new maps to gram panchayat in telangana | Sakshi
Sakshi News home page

పంచాయతీలకు కొత్త మ్యాపులు

Published Mon, Jan 29 2018 2:46 AM | Last Updated on Mon, Jan 29 2018 2:46 AM

new maps to gram panchayat in telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామ పటాల రూపకల్పనలో ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. ప్రస్తుతమున్న రెవెన్యూ గ్రామాలవారీ మ్యాపులు కాకుండా ప్రతి గ్రామ పంచాయతీకి ఓ మ్యాపును సిద్ధం చేస్తోంది. ఈ మ్యాపుల్లో సరిహద్దులు, రైల్వే, రోడ్డు మార్గాలతోపాటు కొత్తగా సర్వే నంబర్లవారీ భూముల వివరాలు, ప్రభుత్వ భూముల వివరాలను సర్వేశాఖ ప్రత్యేకంగా పేర్కొననుంది. 

ప్రతి సర్వే నంబర్‌ స్పష్టంగా... 
రెవెన్యూ గ్రామాలవారీగా ఉన్న మ్యాపుల్లో రెవెన్యూ గ్రామ సరిహద్దులతోపాటు రైల్వే, రోడ్డు మార్గాలు, అటవీ భూములు, నీటివనరులు, వృథాగా ఉన్న భూములు తదితర వివరాలే ఉండేవి. సర్వే నంబర్లను కేవలం ఉదహరించేవారు కానీ ఏ నంబర్‌లో ఎంత భూమి ఉందన్న వివరాలు ఉండేవి కావు. ఇప్పుడు సర్వే నంబర్లవారీ భూముల వివరాలతోపాటు ప్రత్యేకంగా ప్రభుత్వ భూములను కూడా మ్యాపుల్లో గుర్తించనున్నారు. గతంలో ఉన్న దాదాపు 9 వేల పంచాయతీలకుతోడు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న 4 వేల పంచాయతీలను కలిపి మొత్తం 13 వేల మ్యాపులను సర్వేశాఖ సిద్ధం చేస్తోంది.  

వనరుల్లో స్పష్టత... 
రెవెన్యూ గ్రామాల మ్యాపుల స్థానే గ్రామ పంచాయతీ మ్యాపుల తయారీ ద్వారా ప్రతి గ్రామానికి ఉన్న వనరుల విషయంలో స్పష్టత తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రెవెన్యూ గ్రామాలవారీ మ్యాపుల ద్వారా ఆయా గ్రామాల్లో ఉన్న పంచాయతీలన్నింటినీ ఒకే సరిహద్దు కింద చూపిస్తున్నారు. మరికొన్ని చోట్ల రెండు, మూడు రెవెన్యూ గ్రామాలు కలిపి ఓ పంచాయతీగా ఉంటే ఒకే పంచాయతీకి రెండు, మూడు మ్యాపులున్నాయి. ఈ నేపథ్యంలో ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వనరుల విషయంలో స్పష్టత రావాలంటే గ్రామ పంచాయతీలవారీగా మ్యాపులు తయారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

తద్వారా రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి హామీ పథకం పనులు, భూ లావాదేవీలను స్పష్టంగా గ్రామ పంచాయతీలవారీగా విభజించే అవకాశం కలగనుంది. అయితే ఈ మ్యాపుల తయారీకి నిధుల కొరత ఉందని సర్వేశాఖ అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వం మ్యాపులను తయారు చేయాలని చెప్పింది కానీ ఇందుకు అయ్యే ఖర్చును ఏ పద్దు కింద తీసుకోవాలో పేర్కొనలేదని జిల్లాస్థాయి అధికారులు చెబుతున్నారు. జిల్లాకు సగటున రూ. 2 లక్షల వరకు ఖర్చవుతోందని, కొన్ని చోట్ల కలెక్టర్లు ఈ ఖర్చును ఇచ్చేందుకు అంగీకరిస్తున్నా మరికొన్ని జిల్లాల్లో సర్వేశాఖ అధికారులు ఎప్పటికైనా రాకపోతాయా అనే ఆలోచనతో సొంత నిధులను వినియోగిస్తున్నట్లు సర్వేశాఖలో చర్చ జరుగుతుండటం గమనార్హం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement