సర్వే టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమా?
షబ్బీర్ అలీ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల సర్వే టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమా అని శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. సోమవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం భూ సర్వేపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో మాత్రమే మాట్లాడటం సరికాదన్నారు. భూ సర్వేపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. సర్వేలంటూ హడావిడి చేయడం, వాటిని మూలకు పడేయడం ముఖ్యమంత్రి కేసీఆర్కు అలవాటుగా మారిందన్నారు.
గతంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఎందుకు బయటపెట్టడంలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో లేదని, డూప్లికేట్ టీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలో ఉందని విమర్శించారు. టీఆర్ఎస్లో నుంచి ఇతరపార్టీల్లోకి ఎమ్మెల్యేలు ఫిరాయించనున్నారనే భయంతోనే అందరికీ టికెట్లు ఇస్తామంటూ కేసీఆర్ మభ్యపెడ్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 90 శాతం మంది సిట్టింగ్ సభ్యులకు సీఎం కేసీఆర్ టికెట్లు ఇవ్వరని ఆయన చెప్పారు.