‘ఖేడ్’ టీఆర్ఎస్ కైవసం
నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘన విజయం
♦ 53,625 ఓట్ల మెజారిటీతో భూపాల్‌రెడ్డి గెలుపు
♦ రెండో స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్.. టీడీపీ డిపాజిట్ గల్లంతు
నారాయణఖేడ్: నారాయణఖేడ్ శాసనసభ స్థానం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి 53,625 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిట్టింగ్ సీటు కోల్పోయిన కాంగ్రెస్ రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. టీడీపీ డిపాజిట్ గల్లంతయింది. ఈనెల 13న నారాయణఖేడ్ ఉప ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో మొత్తం 1,88,373 ఓట్లకుగాను 1,54,912 ఓట్లు పోలైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ ఓట్ల లెక్కింపు మంగళవారం జరిగింది. నారాయణఖేడ్ మండలంలో జూకల్ శివారులోని పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది.
మొత్తంగా 21 రౌండ్లలో ఓట్లు లెక్కించగా... చివరి రౌండ్ పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి 93,076 ఓట్లు పొంది విజయం సాధించారు. ఈ అసెంబ్లీ స్థానం చరిత్రలోనే ఓ అభ్యర్థి ఇన్ని ఓట్లు సాధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇక సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి పట్లోళ్ళ సంజీవరెడ్డికి 39,451 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ఎం.విజయపాల్‌రెడ్డి కేవలం 14,787 ఓట్లను పొంది డిపాజిట్ కోల్పోయారు. స్వతంత్ర అభ్యర్థులు జాజుల భాస్కర్ 5,377 ఓట్లు, బోరంచ సంగారెడ్డి 509, ఐ.మాదప్ప 235, ముదిరాజ్ వెంకటేశం 291, మురళీ గోవింద్ 333 ఓట్ల పొందారు. నోటాకు 853 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం కోసం మంత్రి హరీశ్‌రావు చేసిన కృషి ఫలించింది. ఈ ఫలితాన్ని బుధవారం నాటి సీఎం కేసీఆర్ పుట్టినరోజుకు కానుకగా ఇద్దామంటూ హరీశ్‌రావు ఇచ్చిన పిలుపునకు అనుగుణంగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.
సీఎంకు కానుక: భూపాల్‌రెడ్డి
తన గెలుపును సీఎం కేసీఆర్‌కు పుట్టిన రోజు కానుకగా అందజేస్తున్నట్టు నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా గెలిచిన ఎం.భూపాల్‌రెడ్డి అన్నా రు. మంగళవారం ఖేడ్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు సహకారంతో ఈ అపూర్వ విజయం సాధ్యమైందన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి నియోజకవర్గాన్ని బంగారు ఖేడ్గా మారుస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
మాట నిలబెట్టుకుందాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన భూపాల్‌రెడ్డిని సీఎం కేసీఆర్ అభినందించారు. భూపాల్‌రెడ్డి మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్‌ను అధికారిక నివాసంలో కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టాలని మెదక్ జిల్లా నాయకులకు సూచించారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతలను తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావుకు సూచించారు.
రౌండ్లవారీగా మూడు పార్టీలకు పోలైన ఓట్లు, ఆధిక్యత వివరాలు..
రౌండ్ నెంబర్
టీఆర్ఎస్
ఆధిక్యం
కాంగ్రెస్
టీడీపీ
1
3,922
1,952
1,970
701
2
3990
2,003
1,987
832
3
4,730
3,347
1,383
1,608
4
4,635
2,360
2,275
712
5
4,387
1,903
2,484
1,043
6
4,024
2,590
1,434
664
7
4,529
3,211
1,318
1,110
8
4,429
2,606
1,823
793
9
4,863
2,558
2305
295
10
4,558
2,781
1,777
551
11
5,008
2,582
2,426
735
12
5,032
3,301
1,731
635
13
5,399
3,370
2,029
415
14
5,669
4,098
1,571
331
15
5,129
3,044
2085
580
16
3,774
2,393
1381
614
17
4,555
2,243
2,312
761
18
3,374
1,151
2,223
1,128
19
5,199
3,120
2,079
463
20
4,484
2,491
1,993
485
21
1384
519
865
105
మొత్తం
93,076
53,625
39,451
14,787