‘విభజన’ వేగవంతం చేయండి
రాజ్‌నాథ్‌కు టీఆర్ఎస్ ఎంపీల వినతి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కి టీఆర్ఎస్ ఎంపీల బృందం విజ్ఞప్తి చేసింది. టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత ఏపీ జితేందర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు వినోద్‌కుమార్, బీబీ పాటిల్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కొత్తా ప్రభాకర్‌రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి తేజావత్ రామచంద్రు మంగళవారం నార్త్‌బ్లాక్‌లో హోంమంత్రితో సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, ఆర్థిక ప్రోత్సాహకాలు, హార్టికల్చర్, ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం స్టీల్‌ప్లాంట్, 400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ తయారీ యూనిట్, పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా, కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏర్పాటు, తెలంగాణకు ప్రత్యేక హోదా అంశాలను పేర్కొంటూ వినతిపత్రం సమర్పించారు.
అనంతరం జితేందర్‌రెడ్డి, వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజన పూర్తికాకపోవడంతో రాష్ట్రంలో పాలనాపరంగా ఇబ్బందులు వస్తున్నాయని, వీలైనంత త్వరగా అధికారులను విభజించాలని హోంమంత్రిని కోరినట్టు తెలిపారు. తెలంగాణ, ఏపీ మధ్య తలెత్తుతున్న సమస్యలను వివరించామన్నారు. హోంమంత్రి నుంచి ఎలాంటి స్పందన వచ్చిందని విలేకరులు ప్రశ్నించగా..‘ఇవన్నీ ఇంకా పూర్తికాలేదా’అని రాజ్‌నాథ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారని, అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు జితేందర్‌రెడ్డి చెప్పారు.