True caller app
-
10కోట్ల స్మార్ట్ ఫోన్లే టార్గెట్! ట్రూకాలర్ కీలక నిర్ణయం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్ యాప్ సైతం ప్రీలోడ్ కానుంది. ఇప్పటి వరకు కస్టమర్లు ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. భారత్, ఇండోనేషియా, మలేషియా, లాటిన్ అమెరికా దేశాల్లో కొత్తగా విడుదలయ్యే ఫోన్లలో ఈ సౌకర్యం ఉంటుందని కంపెనీ సోమవారం ప్రకటించింది. రెండేళ్లలో 10 కోట్ల స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్ ప్రీలోడెడ్ యాప్‌గా ఉండాలన్నది లక్ష్యమని వివరించింది. ఇందుకోసం మొబైల్స్ తయారీలో ఉన్న ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. భారత్‌లో ప్రస్తుతం 22 కోట్ల మంది ట్రూకాలర్ వాడుతున్నారు. -
‘ఘోస్ట్’ ఫీచర్లతో ట్రూ కాలర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ కొత్త ఫీచర్లను భారత్‌లోని ఆన్‌డ్రాయిడ్ ఫోన్ యూజర్లకు త్వరలో జోడిస్తోంది. వర్షన్–12లో భాగంగా వీడియో కాలర్ ఐడీ, కాల్ రికార్డింగ్ వీటిలో ఉన్నాయి. అలాగే ప్రీమియం చందాదార్ల కోసం ఘోస్ట్ కాల్, అనౌన్స్ కాల్ ఫీచర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. వీడియో కాలర్ ఐడీ కోసం యూజర్లు షార్ట్ వీడియోను యాప్‌నకు పొందుపర్చాల్సి ఉంటుంది. సొంతంగా వీడియో తీసుకోవడం లేదా బిల్ట్ ఇన్ టెంప్లేట్స్ వాడుకోవచ్చు. యూజర్లు తమకు నచ్చిన ఫోటో, నంబర్, పేరుతో ఘోస్ట్ కాల్ చేయవచ్చు. కాల్ చేసే వారి పేరు వినపడేలా కాల్ అనౌన్స్ ఫీచర్ దోహదం చేస్తుంది. చదవండి: ట్రూకాలర్‌లో ఒకేసారి 8 మందితో కాన్ఫరెన్స్ కాల్ -
భలే ఫీచర్స్.. ట్రూకాలర్‌లో ఒకేసారి 8 మందితో కాన్ఫరెన్స్ కాల్
సాక్షివెబ్‌డెస్క్: ప్రముఖ యాప్ ట్రూలర్ కాలర్ వినియోగదారులకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా అప్ డేట్ చేసిన ఫీచర్లతో ఒకే సారి 8మందితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడే అవకాశం లభించింది. దీంతో పాటు మరికొన్ని అప్ డేట్ గురించి తెలుసుకుందాం. వాయిస్ కాల్స్ ట్రూ కాలర్ వినియోగదారులు అంతర్జాతీయ స్థాయిలో ఒకేసారి ఎనిమిది మంది మాట్లాడే అవకాశం ఉంది. స్పామ్ వినియోగదారులను గుర్తిస్తుంది. గ్రూప్ కాల్ సభ్యులను కాంటాక్ట్ లో యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా మాట్లాడుకోవచ్చు. ఇతర వినియోగదారులను మరొక కాల్లో లేదా ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ పంపిస్తుంది. స్పామ్ ఎస్ఎంస్ స్పామ్ కాల్స్‌ను గుర్తించటన్లుగా స్పామ్ మెసేజ్ లను ఫిల్టర్ చేస్తుంది. ఇప్పటికే ఓటీపీలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, చెల్లింపు రిమైండర్లు మెసేజ్‌లను హైలైట్ చేస్తుండగా, తాజాగా ఈ ఫీచర్ ను అప్ డేట్ చేసి అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ వల్ల ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. స్మార్ట్ ఎస్ఎంఎస్ ప్రస్తుతం భారత్, కెన్యా, నైజీరియా, దక్షిణాఫ్రికాలో సౌలభ్యంగా ఉంది. ఇది త్వరలో యుఎస్, స్వీడన్, మలేషియా, ఇండోనేషియా, ఈజిప్ట్లకు విస్తరించబడుతుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఇన్ బాక్స్ క్లియర్ ఓటీపీలు,స్పామ్ మెసేజెస్, ఓల్డ్ మెసేజ్ లను హైలెట్ చేస్తుంది. వాటి అవసరం లేదనుకుంటే ఒకే క్లిక్‌తో వాటిని తొలగించడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది. దీంతో మెసేజ్ ఫోల్డర్ లో ఓల్డ్ మేసేజ్ లు కాకుండా లేటెస్ట్ మెసేజ్ లు మనకు హైలెట్ అవుతాయి. -
ట్రూ కాలర్ యాప్‌లో మరో కొత్త ఫీచర్
ఏదైనా కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తే వెంటనే అది ఎవరో ట్రూ కాలర్‌లో సెర్చ్ చేసేవాళ్లం. అయితే తాజాగా ట్రూ కాలర్‌లో ఎందుకు ఫోన్ చేస్తున్నారో అన్న కాల్ రీజన్ కూడా కనపడనుందట. వాస్తవానికి ఈ ఫీచర్‌ను 2009లోనే ప్రవేశపెట్టినప్పటికీ, ఇప్పుడు మరింత అప్డేటెడ్ వెర్షన్లో ట్రూ కాలర్ రిలీజ్ చేసింది. పర్సనల్, బిజినెస్ లేదా ఎమర్జెన్సీ ఇలా..అవతలి వ్యక్తికి ఎందుకు కాల్ చేస్తున్నామన్న రీజన్‌ను టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ఫీచర్‌తో కాల్ పికప్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నాయని ట్రూ కాలర్ ఆశిస్తుంది. ప్రత్యేకించి కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు యూజర్‌కు మరింత ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది. అయితే గూగుల్ సైతం వెరిఫైడ్ కాల్స్ అనే సిమిలార్ ఫీచర్స్‌ను డీఫాల్ట్‌గా తీసుకురాబోతుంది. (దేశీ స్మార్ట్ఫోన్ల రీఎంట్రీ...) ఈ 2020లో అత్యధికంగా కోరుకున్న ఆప్షన్ ఇదేనని స్వీడన్‌కు చెందిన ప్రధాన కార్యాలయ సంస్థ స్టాక్‌హోమ్ తెలిపింది. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ట్రూకాలర్ వెల్లడించింది. ఐఓఎస్‌లో వచ్చే ఏడాది నుంచి ఇది అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. స్కామ్ ప్రొటెక్షన్ అల్గారిథమ్ని ఉపయోగించి కాల్ని ప్రైవేట్‌గా ఉంచేలా డిజైన్ చేశారు. దాదాపు 59 భారతీయ భాషల్లో ఇది పనిచేస్తుందని పేర్కొన్నారు. ట్రూ కాలర్ సగటున రోజుకు 9వేల కోట్ల ఫోన్ కాల్స్, మెసేజ్‌లను గుర్తిస్తుండంగా నెలకు 300 కోట్ల ఫోన్‌కాల్స్‌ను బ్లాక్ చేస్తుంది. (భారత్‌లో యాపిల్ రికార్డు ) -
ఆఫీసర్ @ ట్రూ కాలర్
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇప్పిస్తానంటూ ఎర వేసి అనేక మంది నిరుపేదల్ని నిండా ముంచిన వై.రాకేష్ యాదవ్ ‘సాంకేతిక పరిజ్ఞానాన్నీ’ వినియోగించుకున్నాడు. ట్రూ కాలర్ యాప్‌లో తన నెంబర్‌ను కలెక్టరేట్లో అధికారి అంటూ నమోదు చేసుకున్నాడు. దీని ఆధారంగానే బాధితులకు కాల్స్ చేస్తూ వారిని నమ్మించి నిండా ముంచాడు. 17 మంది నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి మోసం చేసిన రాకేష్ యాదవ్‌ను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం విదితమే. ఇతడి విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఉప్పుగూడలోని కందిగల్గేట్ ప్రాంతానికి చెందిన వై.రాకేష్ యాదవ్ పదో తరగతి వరకు చదివి స్థానికంగా ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. ఇతడి తండ్రి వై.అంజయ్య రేషన్ కార్డులు ఇప్పించడానికి దళారిగా వ్యవహరించాడు. (‘జేసీ బ్రదర్స్’ బాగోతం.. బిగుస్తున్న ఉచ్చు ) ఆయన ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల పని తీరుపై రాకేష్‌కు అవగాహన వచ్చింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు భారీగా డిమాండ్ పెరిగిందని రాకేష్ తెలుసుకున్నాడు. దీంతో తానే ఓ ప్రభుత్వ అధికారిగా చెప్పుకుంటూ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిని గుర్తించడం మొదలెట్టాడు. ఇలా చేయడానికి ముందు తన స్మార్ట్ ఫోన్లో ట్రూ కాలర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. అందులో తన నెంబర్‌ను ‘ఆఫీసర్ రంగారెడ్డి కలెక్టరేట్’ అంటూ సేవ్ చేసుకున్నాడు. దీంతో ఈ నెంబర్ నుంచి ఎవరికైనా కాల్స్ చేసినప్పుడు ఆ పేరునే ట్రూ కాలర్ చూపేది. దీంతో శ్రీనివాస్‌గా చెప్పుకున్న రాకేష్ కలెక్టరేట్ అధికారి అని తేలిగ్గా నమ్మేవాళ్ళు. దరఖాస్తుదారులకు పూర్తి నమ్మకం కలగడానికి వారి నుంచి దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, పాస్‌పోర్టు ఫొటోలను సంగ్రహించేవాడు. ముందుగా డీడీ కట్టాలంటూ రూ.40 వేల వరకు అడ్వాన్సుగానూ తీసుకునేవాడు. ఆపై తన ఫోన్లో సేవ్ చేసి ఉండే ‘మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరైంది. మొదటి ఇన్స్టాల్మెంట్ రూ.40 వేలు అందింది. రెండోది చెల్లించండి’ అనే ఎస్సెమ్మెస్‌ను బాధితులకు చూపేవాడు. దీని ఆధారంగా మిగిలిన మొత్తం కూడా తీసుకుని మోసం చేసేవాడు. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం రాకేష్ అబిడ్స్, గోషామహల్, కోఠి తదితర ప్రాంతాలకు చెందిన 17 మంది నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశాడు. ఇతడిని అరెస్టు చేసే సమయానికి బ్యాంకు ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదని అధికారులు చెప్తున్నాడు. దేవరయాంజాల్‌లో ఓ విల్లా అద్దెకు తీసుకుని ఉంటున్న రాకేష్ జల్సాలకు ఎక్కువగా ఖర్చులు చేశాడని వివరిస్తున్నారు. రాజకీయ నాయకుడి మాదిరిగా వైట్ అండ్ వైట్ ధరించడం, కార్లలో తిరగడం చేస్తూ డబ్బు ఖర్చు చేసినట్లు గుర్తించారు. ఇతడి గతం, తాజా వ్యవహారాలను ఆరా తీస్తున్న పోలీసులు విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. -
ట్రూ కాలర్ యాప్, ఫేస్ బుక్ లు పట్టించేశాయి..
హైదరాబాద్ : మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్లో జరిగిన రూ.1.21 లక్షల విలువైన రాడో వాచ్ చోరీ కేసును పోలీసులు ఫేస్బుక్, ట్రూ కాలర్ యాప్, సీసీ కెమెరాల సాయంతోనే చేధించారు. సాధారణ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సింపుల్ ఇన్వెస్టిగేషన్ చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శశాంక్‌రెడ్డి చాకచక్యంగా వ్యవహరించి గురువారం నిందితుల్ని అరెస్టు చేయగలిగారు. సరదాగా వచ్చి చోరీ చేసి... కూకట్‌పల్లికి చెందిన బీటెక్ విద్యార్థులు ఆర్.సుహాస్ చౌదరి, జి.తేజ గత నెల 9న మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌కు వెళ్లారు. అటూ ఇటు తిరిగిన ఈ ద్వయం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మాల్లో ఉన్న ఇతోస్ వాచ్ స్టోర్‌లోకి ప్రవేశించారు. కొద్దిసేపు వాచీలను ఖరీదు చేసే నెపంతో పరిశీలించారు. షాపు యజమాని మరో వినియోగదారుడితో మాట్లాడుతుండగా.. అదను చూసి రూ.1.21 లక్షల విలువైన రాడో కంపెనీ వాచ్‌ను తస్కరించారు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ నుంచి జారుకున్న ద్వయం తమ బైక్‌పై మాదాపూర్ వైపు వెళ్లిపోయారు. తన దుకాణంలో వాచ్ చోరీకి గురైందని గుర్తించిన యజమాని అదే రోజు మాదాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ప్రాథమిక ఆధారాలిచ్చిన సీసీ కెమెరాలు... ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన ఇన్స్పెక్టర్ శశాంక్‌రెడ్డి నేతృత్వంలోని బృందం ప్రాథమికమైన ఆధారాలపై దృష్టి పెట్టింది. తొలుత మాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన నిందితుల ఫుటేజ్ సేకరించింది. ఎంట్రీ వద్ద ఉన్న సీసీ కెమెరాలో ఇద్దరూ ఓ క్యారీబ్యాగ్ తీసుకుని లోపలకు వచ్చినట్లు రికార్డయ్యింది. మాల్‌కు సమీపంలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించిన నేపథ్యంలో ఆ ఇద్దరు యువకులూ పల్సర్ వాహనంపై వచ్చి వెళ్లినట్లు వెల్లడైంది. యాప్స్, సోషల్ మీడియా ద్వారా క్లూస్... సీసీ టీవీ ఫీడ్‌లో ఉన్న వాహనం నంబర్‌ను గుర్తించిన దర్యాప్తు అధికారులు ఆర్టీఏ అధికారుల సాయంతో రిజిస్టర్ అయి ఉన్న చిరునామా, రికార్డుల్లో పొందుపరిచిన సెల్‌ఫోన్ నంబర్ సేకరించారు. అయితే వాహనాన్ని ప్రస్తుతం రిజిస్టర్ చేసుకున్న యజమాని (నిందితుడు) వినియోగిస్తున్నాడా? చేతులు మారిందా? అనే అంశాలను తెలుసుకోవడానికి దర్యాప్తు అధికారి యాప్స్, సోషల్ మీడియాలను ఆశ్రయించారు. ఆ సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా మొబైల్ యాప్ ట్రూ కాలర్‌లో, ఆర్టీఏ రికార్డుల్లో ఉన్న పేరును సోషల్ మీడియా ఫేస్‌బుక్స్‌లో సెర్చ్ చేశారు. వాటిలో ఉన్న ఫొటో, సీసీ కెమెరా ఫీడ్స్‌లో నమోదైన ఫీడ్‌లోని దాంతో సరిపోలడంతో అతడే నిందితుడిగా గుర్తించారు. గురువారం నిందితులు ఉంటున్న ఇంటిపై దాడి చేసి ఇద్దరినీ అరెస్టు చేయడంతో పాటు వాచ్ రికవరీ చేశారు.