TS-budget 2015
-
సంక్షేమానికి రూ. 12,740 కోట్లు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. తాజా బడ్జెట్లో సంక్షేమ రంగానికి 12,740.52 కోట్లు కేటాయించింది. కేవలం ప్రణాళికా వ్యయంలోనే 11,450 కోట్లు వ్యయం చేయనుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుధవారం సమర్పించిన బడ్జెట్లో ప్రణాళికా వ్యయం కింద కేటాయించిన మొత్తంలో ఇది 21.86 శాతం. గతంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. వర్తమాన ఆర్థిక సంవత్సరం ప్లాన్ వ్యయంలో సంక్షేమానికి 14.2 శాతం నిధులు మాత్రమే కేటాయించింది. ఎస్సీల సంక్షేమానికి రూ. 5,547 కోట్లు షెడ్యూల్ కులాల సంక్షేమానికి ప్రణాళిక వ్యయం కింద రూ. 5,547 కోట్లు కేటాయించగా, అందులో విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ. 646.52 కోట్లు, ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు రూ. 121.82 కోట్లు కేటాయించింది. ఎస్సీలకు ఆర్థిక మద్దతు పథకాల కోసం రూ.1,005 కోట్లు, ఎస్సీ గృహాలకు ఉచిత విద్యుత్‌కు రూ. 65 కోట్లు, కళ్యాణలక్ష్మికి రూ. 157 కోట్లు, ఇందిరమ్మ పథకం కింద బలహీనవర్గాల ఇళ్ల స్థలాల సేకరణకు రూ. 21 కోట్లు కేటాయించింది. ఎస్టీల సంక్షేమానికి: షెడ్యుల్డ్ తెగల సంక్షేమానికి ప్రణాళిక వ్యయం కింద రూ. 2,878 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించగా, అందులో ప్రధానంగా క్యాపిటల్ ఔట్లే కింద రూ.182.48 కోట్లు, ఎస్టీల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ. 239.20 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రూ.162 కోట్లు, విద్యాసంస్థల కోసం రూ. 138.92 కోట్లు, ఎస్టీల ఆర్థికాభివృద్ధి కోసం రూ. 38 కోట్లు, విద్యార్థులకు అదనపు సౌకర్యాల కల్పనకు రూ. 200 కోట్లు, కళ్యాణలక్ష్మి కింద రూ.80 కోట్లు కేటాయించారు. బీసీల సంక్షేమం: బీసీ సంక్షేమానికి ప్రణాళిక వ్యయం కింద రూ. 1,925 కోట్లను కేటాయించగా అందులో ప్రధానంగా బీసీ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజురీయింబర్స్‌మెంట్‌కు రూ.1,367 కోట్లు, ఈబీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ. 252 కోట్లు, బీసీ స్టడీ సర్కిళ్లకు రూ. 20 కోట్లు, డైట్‌చార్జీలకు 100 కోట్లు కేటాయించారు. మహిళా, శిశుసంక్షేమం: మహిళా, శిశు సంక్షేమానికి ప్రణాళిక వ్యయం కింద రూ. 1,481 కోట్లను ప్రభుత్వం కేటాయించగా, ఐసీడీఎస్ ప్రాజెక్టుకు వేతనాల కోసం రూ. 107 కోట్లు, అంగన్వాడీల్లో మొత్తం పౌష్టికాహార పథకానికి రూ. 704 కోట్లు, ఎస్‌ఆర్‌సీడబ్ల్యూ పథకాల కోసం రూ. 427కోట్లు, ఆరోగ్యలక్ష్మి పథకం కోసం రూ.259 కోట్లు, సబలా పథకం కింద రూ.102 కోట్లు కేటాయించారు. మైనారిటీ సంక్షేమానికి ప్రణాళిక వ్యయం కింద రూ. 1,100 కోట్లు కేటాయించారు. -
పేరుకే పెంపు!
విద్యకు నిధులు పెరిగినా.. తగ్గిన వాటా! గతేడాది 10.88 శాతం కేటాయించగా ఈసారి 9.7 శాతమే ఈసారి బడ్జెట్లో విద్యారంగానికి రూ. 11,216 కోట్లు కేంద్ర పథకాల కింద భారీగా తగ్గిన నిధులు.. కేజీ టు పీజీకి నిధుల్లేవ్, మోడల్ స్కూళ్లు, ఆర్‌ఎంఎస్‌ఏకు అరకొర సాక్షి, హైదరాబాద్: విద్యారంగానికి ఈసారి బడ్జెట్లో నిధులు పెరిగాయి. కానీ గతంకన్నా కేటాయింపుల శాతం తగ్గింది. గతేడాది విద్యారంగానికి రూ. 10,956.36 కోట్లు(మొత్తం బడ్జెట్లో 10.88%) కేటాయించగా, ఈసారి రూ. 11,216.10 కోట్లు(9.7%) దక్కాయి. ప్రధానంగా ఉన్నత విద్య, సాంకేతిక విద్యకు సర్కారు పెద్దపీట వేసింది. వర్సిటీల అభివృద్ధికి కేటాయింపులను పెంచింది. పాఠశాల విద్యకు మాత్రం ప్రణాళిక కేటాయింపులను కుదించింది. మోడల్ స్కూల్స్ వంటి పథకాలను కేంద్రం రద్దు చేయడం, ఇతర పథకాలకూ నిధుల్లో కోత విధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కాగా, కేజీ టు పీజీ పథకానికి ఈసారి నిధులను కేటాయించలేదు. ప్రైవేటు స్కూళ్లలో 25% పేద విద్యార్థులకు రీయింబర్స్మెంట్ ద్వారా ఉచిత విద్యను అందించేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కే జీ టు పీజీకి పైసా కేటాయించలేదు. పాఠశాల విద్యలో ప్రణాళిక వ్యయం కింద గత ఏడాది రూ. 3,510.56 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ. 1,078.06 కోట్లకు తగ్గించింది. గురుకులాల్లో భాగంగానే కేజీ టు పీజీ వచ్చే విద్యా సంవత్సరంలో కేజీ టు పీజీని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. అవసరమైతే తెలంగాణ గురుకుల విద్యాలయాల నిధులనే ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అందుకే గురుకులాలకు రూ. 75 కోట్లను కేటాయించింది. మోడల్ స్కూళ్ల పథకాన్ని కేంద్రం రద్దు చేయడంతో ఇప్పటికే ప్రారంభించిన స్కూళ్ల కోసం రూ. 216 కోట్లు కేటాయించింది. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్(రూసా) పథకానికి పెద్దగా నిధులివ్వకపోగా, సర్వ శిక్ష అభియాన్‌కూ రాష్ట్ర వాటా నిధులను తగ్గించింది. మొత్తానికి కేంద్ర సహకారంతో కొనసాగే పథకాలకు రాష్ర్టం తరఫున గత ఏడాది రూ. 2,795.48 కోట్లు కేటాయించగా.. ఈసారి రూ. 713.35 కోట్లను మాత్రమే ఇచ్చింది. బాసరలోని ట్రిపుల్ ఐటీ నిర్వహణ కోసం గతేడాది రూ. 119 కోట్లు కేటాయించగా.. ఈసారి దాన్ని రూ. 93 కోట్లకు తగ్గించింది. కేంద్ర నిధులపై సన్నగిల్లిన ఆశలు కేంద్ర పథకాలైన సర్వశిక్ష అభియాన్ కు(ఎస్ఎస్ఏ) గత ఏడాది కేంద్రం నుంచి రూ. 3,307.29 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. ఈసారి కేవలం రూ. 929.39 కోట్లు మాత్రమే వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అలాగే ఉన్నత విద్యలో గతేడాది రూ. 101.60 కోట్లుగా ఉన్న కేంద్ర నిధుల అంచనాను ఈసారి రూ. 50.61 కోట్లుగానే పేర్కొంది. నిరాశే మిగిల్చింది బడ్జెట్లో విద్యాశాఖకు కేటాయించిన బడ్జెట్ నిరాశ కలిగించేలా ఉంది. మాధ్యమిక విద్యకు నిధులు తగ్గాయి. నిధులు లేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. - వెంకట్‌రెడ్డి, సరోత్తంరెడ్డి, పీఆర్టీయూ నేతలు చేతల్లో కనిపించలేదు కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అంటూ సీఎం గొప్పలు చెప్పారే తప్ప అందుకు అవసరమైన నిధులను కేటాయించలేదు. 10 శాతానికంటే తక్కువ నిధులను కేటాయించారు. - నర్సిరెడ్డి, రవి, యూటీఎఫ్ నేతలు కేజీ టు పీజీకి నిధులేవీ? బడ్జెట్లో 30% నిధులను విద్యాశాఖకు కేటాయిస్తేనే కేజీ టు పీజీ అమలవుతుంది. దీన్ని 2016లో ప్రారంభించాలని యోచిస్తున్న నేపథ్యంలో ఈసారి నిధులు కేటాయిస్తే ఏర్పాట్లు వేగంగా జరిగేవి. - కొండల్‌రెడ్డి, రాజిరెడ్డి, హర్షవర్థన్‌రెడ్డి, టీపీటీఎఫ్, ఎస్టీయూ, పీఆర్టీయూ నేతలు