TSRTC city buses
-
స్టూడెంట్స్పై ఆర్టీసీ దెబ్బ.. భారీగా పెరిగిన బస్ పాస్ చార్జీలు
సాక్షి, హైదరాబాద్: ‘ఉరుము ఉరిమి మంగళం మీడ పడ్డట్టు’ చమురు ధరలు విపరీతంగా పెరగడంతో విద్యార్థుల బస్‌పాస్‌లపై పెను ప్రభావం చూపింది. ఆర్టీసీ పిడుగుపాటులా పెంచిన చార్జీలతో విద్యార్థి లోకంపై అశనిపాతమే అయింది. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు ఆఫ్‌లైన్ చదువులతో ఢక్కామొక్కీలు తిన్న విద్యార్థులు.. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న పరిస్థితులతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ పెంచిన బస్‌పాస్ చార్జీలు గ్రేటర్‌లోని లక్షలాది మంది విద్యార్థులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం రూ.165 తో నెల రోజుల పాటు ప్రయాణం చేసినవారు.. ఇక నుంచి ఏకంగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా బస్‌పాస్ చార్జీలను పెంచడంతో పాటు రెండు దశాబ్దాల క్రితం నాటి రాయితీలను కూడా సవరించడంతో భారం రెండింతలైంది. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులకు ఇప్పుడు ఆర్టీసీ చార్జీలే గుదిబండగా మారాయి. మరోవైపు విద్యార్థుల బస్‌పాస్ రాయితీల నుంచి ఆర్టీసీ క్రమంగా తప్పుకొనేందుకే ఈ భారాన్ని మోపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామం పట్ల విద్యార్ధి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కొత్త చార్జీల ప్రకారమే.. సుమారు 5 లక్షల మంది విద్యార్ధులు నెలవారీ, మూడు నెలల సాధారణ బస్‌పాస్‌లతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పాస్‌లు,రూట్ పాస్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. జిల్లా బస్సుల్లో నగర శివార్ల వరకు అనుమతించే బస్‌పాస్‌లు కూడా ఉన్నాయి. మూడు నెలల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు తీసుకొనే క్వార్టర్లీ పాస్ ధర రూ.490 నుంచి ఇప్పుడు ఏకంగా రూ.1200కు పెరిగింది. ప్రతి రోజు ఒకే మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీసుకొనే రూట్‌పాస్‌లు 8 కిలోమీటర్ల వరకు రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.600కు పెంచారు. చదవండి: ఉప్పల్ కష్టాల్: అడుగడుగునా ట్రాఫికర్.. నలుదిక్కులా దిగ్బంధనం ప్రస్తుతం వివిధ రకాల విద్యార్థుల పాస్‌లపై ఆర్టీసీకి ప్రతి నెలా రూ.8 కోట్ల వరకు ఆదాయం లభిస్తుండగా చార్జీల పెంపుతో మరో రూ.15 కోట్లకుపైగా అదనంగా లభించనుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులపై రూ.180 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది. ఈ విద్యా సంవత్సరం కోసం విద్యార్థుల నుంచి ఆర్టీసీ బస్‌పాస్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 10 నుంచి దరఖాస్తులను స్వీకరించి 15 నుంచి జారీ చేయనుంది. కొత్త చార్జీల ప్రకారమే ఈ పాస్‌లను అందజేయనున్నారు. ఆందోళన ఉద్ధృతం చేస్తాం: ఇప్పటికే కోవిడ్ కారణంగా చదువులకు దూరమైన విద్యార్థులపై బస్‌పాస్ చార్జీల భారం మోపడం దారుణం. నిరుపేద పిల్లలు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది, బస్‌పాస్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన ఉద్ధృతం చేస్తాం. – రాథోడ్ సంతోష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోయలేని భారం బస్‌పాస్ చార్జీలు ఒక్కసారిగా ఇలా పెంచడం అన్యాయం. సిటీబస్సులపై ఆధారపడి కాలేజీకి వెళ్లే నాలాంటి వారికిది ఎంతో భారం. పెంచిన బస్‌పాస్ చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. – వంశీ, ఇంటర్ విద్యార్ధి రూట్ పాస్‌లు కిలోమీటర్లు ప్రస్తుతం పెంచిన చార్జీ (రూ.లలో) 4 165 450 8 200 600 12 245 900 18 280 1150 22 330 1350 -
Hyderabad: ఆర్టీసీ చార్జీల బాదుడు.. ఏ స్టాప్‌కు ఎంత పెంచారంటే?
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ గుట్టుచప్పుడు కాకుండా చార్జీలు పెంచింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చేలా గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని డిపోలకు సందేశాలు చేరాయి. సాధారణ చార్జీల పెంపు కాకుండా సేఫ్టీ సెస్ రూపంలో వీటిని పెంచింది. ప్రమాదాలు, విపత్తులు, వాహనాల బీమా తదితర అవసరాల దృష్ట్యా ఆర్టీసీ మూలనిధి కోసం కొత్తగా భద్రతా సెస్ చార్జీలను విధించినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు గ్రేటర్లో ఆర్డినరీ బస్సులకు నాలుగు స్టేజీల వరకు అంటే 8 కిలో మీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న చార్జీలే యథాతథంగా ఉంటాయి. ఆ తర్వాత ప్రతి మూడు, నాలుగు స్టేజీలకు రూ..5 చొప్పున పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో మొదటి రెండు స్టేజీల వరకు చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. ఆ తర్వాత రూ.5 చొప్పున పెరిగాయి. ప్రయాణికులపై తప్పని భారం.. ఆర్టీసీ మూల నిధి కోసం ఇప్పుడు ఉన్న చార్జీలపై భద్రతా సెస్ రూపంలో మాత్రమే అదనపు చార్జీలను విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని ప్రయాణికులపై ప్రతి నెలా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది. నగరంలో ప్రతిరోజు సుమారు 16 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. వీరిలో మెట్రో బస్సుల్లో మొదటి రెండు స్టేజీలు, ఆర్డినరీ బస్సుల్లో మొదటి నాలుగు స్టేజీలు ప్రయాణించే వారు నాలుగైదు లక్షల మంది మాత్రమే ఉంటారు. మిగతా ప్రయాణికులకు సిటీ బస్సుల్లో ప్రయాణం భారంగా మారింది. చదవండి: యూనివర్సల్ బేకరీ.. ఓ స్వీట్ మెమొరీ.. మూతపడటానికి కారణాలేమిటి? ఆర్డినరీ బస్సుల్లో.. ►ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో మొదటి రెండు స్టేజీలకు ప్రస్తుతం ఉన్న రూ.10 చార్జీలో ఎలాంటి మార్పు ఉండదు. ఆ తర్వాత మరో రెండు స్టేజీల వరకు ప్రస్తుతం ఉన్న రూ.15 చార్జీ యథావిధిగా ఉంటుంది. అంటే ప్రయాణికులు తాము బయలుదేరిన చోటు నుంచి 4 స్టేజీల వరకు అంటే 8 కి.మీ వరకు పాత చార్జీల ప్రకారమే చెల్లించాల్సి ఉంటుంది. ►10 కి.మీ తర్వాత చార్జీల పెంపు అమల్లోకి వస్తుంది. ఈ మేరకు 5వ స్టేజీ నుంచి రూ.5 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు 5 స్టేజీల వరకు ఇప్పటి వరకు రూ.15 చార్జీ ఉండగా ప్రస్తుతం రూ.20 కి పెంచారు. ► 6వ స్టేజీ నుంచి 9వ స్టేజీ వరకు అంటే 12 కి.మీ నుంచి 18 కి.మీ వరకు ఇప్పుడు ఉన్న చార్జీని రూ.20 నుంచి రూ.25కు పెంచారు. ►ఆ తర్వాత 10వ స్టేజీ అంటే 20 నుంచి 28 కి.మీ (14వ స్టేజీ) వరకు ఇప్పటి వరకు రూ.25 ఉండగా తాజాగా రూ.30కి పెంచారు. ►30 కి.మీ నుంచి 40 కి.మీ వరకు అంటే 15వ స్టేజీ నుంచి 19వ స్టేజీ వరకు ఇప్పటి వరకు రూ.30 చార్జీ ఉండగా దానిని తాజాగా రూ.35కు పెంచారు. ► 40 కి.మీ వరకు (20వ స్టేజీ) ఇప్పటి వరకు రూ.35 ఉండగా, తాజాగా రూ.40కి పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో... ►మూడో స్టేజీ వరకు అంటే 6 కి.మీ వరకు ఇప్పుడున్న రూ.15ను రూ.20కి పెంచారు. ఆ తర్వాత 8 నుంచి 14 కి.మీ వరకు అంటే 4వ స్టేజీ నుంచి 7వ స్టేజీ వరకు ఇప్పుడు ఉన్న రూ.20 చార్జీలను రూ.25కు పెంచారు. ►16 కి.మీ నుంచి 24 కి.మీ వరకు అంటే 8వ స్టేజీ నుంచి 12వ స్టేజీ వరకు రూ.25 నుంచి రూ.30కి పెంచారు. ఆ తర్వాత 4 స్టేజీల వరకు రూ.5 చొప్పున అంటే రూ.30 నుంచి రూ.35కు పెంచారు. 36 కి.మీ నుంచి (17వ స్టేజీ నుంచి) 40 కి.మీ వరకు (20వస్టేజీ వరకు) రూ.35 నుంచి రూ.40కి పెంపు. మెట్రో డీలక్స్ బస్సుల్లో.. ►మొదటి 2 కి.మీ వరకు రూ.15 చార్జీలో ఎలాంటి మార్పు లేదు. 4 కి.మీటర్లకు రూ.15 నుంచి రూ.20కి పెంచారు. ఆ తర్వాత 6 కి.మీ నుంచి (3వ స్టేజీ నుంచి) 12 కి.మీ వరకు (6వ స్టేజీ) రూ.20 నుంచి రూ.25కు చార్జీలు పెంచారు. ► 8వ స్టేజీ నుంచి అంటే 14 నుంచి 22 కి.మీ వరకు (11వ స్టేజీ)రూ.25 నుంచి రూ.30కి పెంచారు. ఆ తర్వాత రెండు స్టేజీల వరకు అంటే 26 కి.మీ వరకు రూ.30 నుంచి రూ.35 చొప్పున, ఆ తర్వాత వచ్చే రెండు స్టేజీల వరకు అంటే 30 కి.మీ వరకు రూ.35 నుంచి రూ.40 చొప్పున చార్జీలు పెరిగాయి. ►17వ స్టేజీ నుంచి 18వ స్టేజీ వరకు అంటే 34 కి.మీ నుంచి 36 కి.మీ వరకు రూ.40 నుంచి రూ.45కు పెంచారు. ►18వ స్టేజీ నుంచి 20వ స్టేజీ వరకు అంటే 36 నుంచి 40 కి.మీ వరకు ఇప్పటి వరకు ఉన్న చార్జీ రూ.45 నుంచి రూ.50కి పెంచారు. -
‘ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు ధరించడం లేదు. ఇబ్బందిగా ఉంది’
సాక్షి, హైదరాబాద్: ‘సిటీబస్సుల్లో ప్రయాణికులు మాస్కులు ధరించి ప్రయాణం చేస్తున్నారు. కండక్టర్లు, డ్రైవర్లు మాత్రం మాస్కులు సరిగా ధరించడం లేదు.ఇది ఇబ్బందిగా ఉంది’ అంటూ కొద్దిరోజుల క్రితం ఓ ప్రయాణికురాలు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన వెంటనే ఆర్టీసీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సంక్రాంతి రద్దీ సమయంలో స్వయంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో తనిఖీలు సైతం నిర్వహించారు. ప్రయాణికులు, కండక్టర్లు, డ్రైవర్లు తప్పనిసరిగా మాస్కు ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్లో ఈ ఆదేశాలు పెద్దగా అమలుకు నోచుకోవడం లేదు. యథావిధిగా కండక్టర్లు, డ్రైవర్లు మాస్కులు సరైన పద్ధతిలో ధరించకుండానే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రోజుకు 20 లక్షల మంది ప్రయాణం.. రెండు రోజులగా సంక్రాంతి దృష్ట్యా సిటీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గింది. సాధారణంగా రోజుకు 20 లక్షల మంది ప్రయాణం చేస్తారు. కోవిడ్ రెండో ఉద్ధృతి అనంతరం ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడంతో సిటీ బస్సుల రాకపోకలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. దీంతో పలు మార్గాల్లో ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఇలాంటి బస్సులో ఏ కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా వైరస్ వేగంగా వ్యాపించేందుకు అవకాశం ఉంటుంది. చదవండి: సర్కారీ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచే ఆంగ్లంలో విద్యా బోధన ప్రయాణికులతో పాటు, డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్లతో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరం. కోవిడ్ ఆరంభంలో ఈ దిశగా ఆర్టీసీ విస్తృత స్థాయిలో అవగాహన కల్పించింది. ప్రయాణికులను, సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేసింది. బస్సులను సైతం పూర్తిగా శానిటైజ్ చే శారు. కానీ మూడో ఉద్ధృతి మొదలైనప్పటి నుంచి ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడ ంపై ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మెట్రో రైల్ తరహాలో నియంత్రణ.. మెట్రో రైళ్లలో ప్రయాణం చేయాలంటే మాస్కు తప్పనిసరిగా ఉండాల్సిందే. మాస్కులేని ప్రయాణికులను గుర్తించి అవగాహన కల్పించేందుకు ఇటీవల మెట్రో రైళ్లలో తనిఖీలను విస్తృతం చేశారు. సిటీ బస్సుల్లోనూ ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించే విధంగా డిపో స్థాయి అధికారులు అవగాహన చర్యలు చేపట్టడం మంచిది. చదవండి: Telangana: రూ.786 కోట్లతో కొత్త పథకాలు పెరగనున్న రద్దీ.. సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లిన నగరవాసులు రానున్న రెండు రోజుల్లో తిరిగి నగరానికి చేరుకోనున్నారు. దూరప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లలో నగరానికి చేరుకొనే ప్రయాణికులతో సిటీ బస్సుల్లో రద్దీ పెరగనుంది. మాస్కుల విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా వైరస్ విజృంభించే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సులతో పాటు సిటీ బస్సుల్లోనూ మాస్కులను కచ్చితంగా అమలు చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీనిని అధిగమించేందుకు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించడం ఒకటే పరిష్కారం అని వైద్యులు సూచిస్తున్నారు. -
హైదరాబాద్‌లో బస్‌పాస్‌కు రూ.1200.. ఇలా చేస్తే బెటరేమో!
సాక్షి, హైదరాబాద్: సిటీబస్సుల్లో రూట్‌పాస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు కేవలం పదోతరగతి వరకు చదివే విద్యార్థులకే పరిమితమైన రూట్‌పాస్‌లను అన్ని కేటగిరీలకు చెందిన విద్యార్థులకు, సాధారణ ప్రయాణికులకు కూడా విస్తరించేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. కోరుకున్న దూరానికే పాస్‌లు ఇవ్వడం వల్ల ప్రయాణికులకు డబ్బు ఆదా అవుతుంది. అలాగే ఆర్టీసీకి గణనీయంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇంటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు రాకపోకలు సాగించే ఉద్యోగులు ప్రతి నెలా రూ.1200 పైన చెల్లించి సాధారణ బస్‌పాస్‌లు తీసుకోవలసి వస్తోంది. వీటిపై సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడ వరకైనా ప్రయాణం చేయవచ్చు. చదవండి: TSRTC: దసరా పండగకు ప్రయాణికులకు తీపికబురు.. కానీ ఉద్యోగులు, విద్యార్థులు చాలా వరకు ఇంటి నుంచి కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలకు మాత్రమే ప్రయాణం చేస్తారు. దీంతో సాధారణ పాస్‌లపైన తాము ప్రయాణం చేయని దూరానికి కూడా అదనంగా డబ్బు చెల్లించవలసి వస్తోంది. దీంతో బస్‌పాస్‌ల అవసరం ఉన్నప్పటికీ డిమాండ్ కనిపించడం లేదు. గ్రేటర్లో లక్షలాది మంది చిరుద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పని చేసేవారు ఉన్నారు. అలాగే నగర శివార్లలోని కళాశాలలకు రాకపోకలు సాగించే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. కానీ బస్‌పాస్ వినియోగదారుల సంఖ్య మాత్రం 5 లక్షలకు పైగా ఉంది. సాధారణ పాస్‌లతో పాటు ప్రయాణికులు కోరుకున్న రూట్ వరకు పాస్ ఇవ్వడం వల్ల ఈ వినియోగదారుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. చదవండి: TSRTC: ఉద్యోగులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఉభయ తారకంగా... ముషీరాబాద్‌కు చెందిన సురేష్ ప్రతి రోజు కోఠి వరకు సిటీ బస్సులో ప్రయాణం చేస్తాడు. అందుకోసం అతడు ప్రతి నెలా రూ.1150 వరకు వెచ్చించి సాధారణ మెట్రో బస్‌పాస్ (జీబీటీ) తీసుకోవలసి వస్తుంది. కానీ అదే మార్గంలో అతనికి రూట్‌పాస్ తీసుకొనే సదుపాయం ఉంటే కేవలం రూ.800 లోపే లభిస్తుంది. ప్రతి నెలా రూ.350 వరకు ఆదా అవుతుంది. ఈ తరహా రూట్‌పాస్‌లను ఆర్టీసీ అందజేస్తే ఉద్యోగులు, విద్యార్థులతో పాటు నిర్ణీత స్థలాలకు రాకపోకలు సాగించే చిరువ్యాపారులకు కూడా ప్రయోజనంగా ఉంటుంది. ఎక్కువ మంది పాస్‌లు తీసుకోవడం వల్ల ఆర్టీసీకి ముందస్తుగానే ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్జీవో పాస్‌లు ఉన్నాయ. అలాగే విద్యార్థులకు జీబీటీలతో పాటు పరిమిత సంఖ్యలో రూట్‌పాస్‌లు, గ్రేటర్ పాస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని స్కూళ్లు, కాలేజీలు పని చేస్తున్నాయి. దసరా తరువాత మరిన్ని విద్యాసంస్థలు తెరుచుకునే అవకాశం ఉంది. దీంతో రూట్‌పాస్‌లను విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. చదవండి: ఆర్టీసీ బస్సులకు కొత్త రంగులు -
సెప్టెంబరులో మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలలుగా నిలిచిపోయిన ప్రజా రవాణా తిరిగి పట్టాలెక్కనుందా? నిలిచిపోయిన సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అన్‌లాక్ 4.0లో భాగంగా కేంద్రం సెప్టెంబరులో మెట్రో రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న దృష్ట్యా గ్రేటర్లో ఎంఎంటీఎస్ రైళ్లు, సిటీబస్సుల రాకపోకలపై ఆశలు చిగురిస్తున్నాయి. మరోవైపు ఏ క్షణంలోనైనా వీటికి అనుమతి లభించవచ్చనే అంచనాలతో ఆర్టీసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. లాంగ్ రూట్లకే పరిమితం.. ప్రభుత్వం అనుమతిస్తే ప్రధాన రూట్లలో మాత్రమే బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా అధికారులు ఇప్పటికే కొన్ని మార్గాలను ఎంపిక చేశారు. హయత్‌నగర్– పటాన్చెరు, లంగర్‌హౌస్– రిసాలాబజార్, ఉప్పల్–మెహిదీపట్నం, సికింద్రాబాద్– బీహెచ్ఈఎల్, జీడిమెట్ల– ఎంజీబీఎస్ వంటి కొన్ని రూట్లలో మాత్రమే నడపనున్నారు. సికింద్రాబాద్ నుంచి, కూకట్పల్లి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకు టికెట్లు ఎలా ఇవ్వాలనే అంశంపై కూడా ఆర్టీసీలో చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ సెప్టెంబరు 1 నుంచి బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చినప్పటికీ కోవిడ్ ఉద్ధృతి మాత్రం ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో బస్సులోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ థర్మల్ స్క్రీనింగ్ చేయడం సాధ్యమవుతుందా అనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎంఎంటీఎస్ లిమిటెడ్ సర్వీసులు... కేంద్రం అనుమతిస్తే సికింద్రాబాద్– లింగంపల్లి రూట్లో మాత్రమే మొదట ఎంఎంటీఎస్ సర్వీసులు నడిచే అవకాశం ఉంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు ఎక్కువగా హైటెక్ సిటీ, లింగంపల్లి తదితర ప్రాంతాల నుంచి రావాల్సివస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి వెళ్లే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనిని దృష్టిలో కొన్ని సర్వీలను మాత్రమే ఈ రూట్‌కు పరిమితం చేయనున్నారు. కాగా.. ఎంఎంటీఎస్ రైళ్లకు కేంద్రం అనుమతిస్తుందా లేదా వేచి చూడాల్సిందే. వచ్చే నెలలో మెట్రో.. మెట్రో రైళ్లు వచ్చే నెల తొలివారంలో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల రాకపోకలకు కూడా అనుమతులు లభించనున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లిఖిత పూర్వకంగా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని.. ఆ తర్వాతే తేదీలను ప్రకటించనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. -
ఒక్క రూపాయి వివాదంతో.. నిలిచిన బస్సులు
ప్రయాణికులకు, కండక్టర్‌కు ఒక్క రూపాయి చిల్లర విషయంలో జరిగిన వివాదంతో జంట నగరాల్లో దాదాపు సగం సిటీబస్సులు నిలిచిపోయాయి. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని డిపోల కార్మికులు సమ్మె చేస్తున్నట్లు సమాచారం. ఆర్టీసీ కార్మిక వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఉప్పల్ డిపో పరిధిలో పనిచేసే రత్నకుమారి అనే కండక్టర్‌కు, ఒక ప్రయాణికురాలికి గొడవ జరిగింది. సదరు ప్రయాణికురాలికి ఒక రూపాయి చిల్లర ఇవ్వాల్సి ఉండగా, కండక్టర్ వద్ద చిల్లర లేదని.. దానిపై ఇద్దరికీ మాట మాట పెరగడంతో ప్రయాణికురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని అంటున్నారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు రత్నకుమారిని సస్పెండ్ చేశారని.. అందుకు నిరసనగా హైదరాబాద్ రీజియన్ పరిధిలోని పలు డిపోలకు చెందిన కార్మికులు సమ్మె చేస్తున్నారని కొందరు ఆర్టీసీ కార్మికులు చెప్పారు. ఉదయం నుంచి బస్సులు తక్కువగా తిరగడం, షేర్ ఆటోల మీదే ఆధారపడాల్సి రావడంతో అసలు ఏంజరిగిందో కూడా సామాన్య ప్రజలకు చాలాసేపటి వరకు తెలియలేదు. ఉన్నట్టుండి బస్సులు నిలిచిపోవడంతో ఉదయం కళాశాలలకు, కార్యాలయాలకు వెళ్లాల్సిన వారు చాలా ఇబ్బందులకు గురయ్యారు.