tungabhadhra Dam
-
కాలుష్య మండలిలో తప్పిన నియంత్రణ
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: ఇప్పటికీ అదే దుర్వాసన.. ముక్కుకు గుడ్డకుట్టుకోకుండా తిరగలేని పరిస్థితి.. వృద్ధులు, చిన్నారులకు రాత్రి సమయాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. ఆస్తమా రోగులు నరకాన్ని అనుభవిస్తున్నారు. కర్నూలు నగరం పాతబస్తీలోని ప్రజల అవస్థ ఇది. ఒకటి రెండు రోజులుగా కాదు.. నెలన్నర్ర అవుతోంది. సమస్యకు పరిష్కారం ఇప్పటికీ కనిపించలేదు. నగరపాలక సంస్థ అధికారులు తూతూ మంత్రంగా తుంగభద్ర నదీ తీరం వెంబడి బ్లీచింగ్ పౌడర్ చల్లి చేతులు దులుపుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాత్రం చేష్టలుడి చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కర్నూలు నగరంలో ఈ సంస్థకు జోనల్, రీజనల్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిని పనితీరుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. కంట్రోల్ తప్పిన పాలన... కర్నూలు నగరం క్రిష్ణానగర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో పాలన అస్తవ్యస్తంగా ఉంది. నాలుగు జిల్లాలకు జోనల్ కార్యాలయం, రెండు జిల్లాలకు ప్రాంతీయ కార్యాలయం ఇక్కడే ఉన్నాయి. జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, టాస్క్‌ఫోర్స్ విభాగంలో సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, సైంటిఫిక్ ఆఫీసర్లు పనిచేస్తున్నారు. అయితే వీరు అందుబాటులో ఉండరనే ఆరోపణలున్నాయ. పలువురు ఇంజినీర్లు సైతం ఫీల్డ్ విజిట్ పేరుతో విధులకు డుమ్మా కొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కార్యాలయానికి వెళ్లి అడిగితే.. సార్..! క్యాంప్‌కు వెళ్లాడు అనే సమాధానం అటెండెర్ల నుంచి వస్తుంది. అధికారులు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు ఉంటారో తెలియని పరిస్థితి. జోనల్ కారా్యాలయంలో సిబ్బంది కొరత ఉంది. దీంతో పనుల్లో జాప్యం జరుగుతోందని కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు ఏఈల అవసరం ఉంది. అలాగే రెండు సంవత్సరాలుగా సీనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ కాలేదు. జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్‌గా పని చేస్తున్న మధుసూదన్‌రావు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. కార్యాలయానికి ఆయన సక్రమంగా రావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతిదీ గోప్యమే.. రెండు జిల్లాల(అనంతపురం, కర్నూలు)కు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయం నిర్వహణ అటెండర్లదే. ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ కార్యాలయంలో ఎప్పుడు అందుబాటులో ఉంటారన్న విమర్శలు ఉన్నాయి. కార్యాలయంలో ప్రతీదీ గోప్యంగా ఉంచుతారు. పారదర్శక పాలన ఎక్కడ కనిపించదు. అంతా నిర్లక్ష్యమే.. సమాచార హక్కు చట్టం ప్రకారం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి పేరు నమోదు చేయాలి. అయితే జోనల్ కార్యాలయంలో నాలుగు నెలల క్రితం బదిలీ అయిన శివారెడ్డి పేరు ఇప్పటికీ కనిపిస్తోంది. దీన్ని బట్టి కార్యాలయంలో పనితీరు ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇవీ ఇబ్బందులు.. జిల్లాలో పలు పరిశ్రమలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే కాలుష్యం ప్రమాదకరమైనదా లేనిదా అని తేల్చాల్సింది వీరే. అయితే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్నూలు నగరంలో దుర్వాసనతో పాతబస్తీ ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. ఓ వృద్ధురాలు శ్వాస ఆడక మృతి చెందింది కూడా. అయినా అధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
హెచ్చెల్సీకి సమాంతర వరద కాలువ అవసరం
సాక్షి,బళ్లారి : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తాగు, సాగు నీరందించే తుంగభద్ర డ్యాం పరిధిలోని హెచ్ఎల్సీకి సమాంతర వరద కాలువలను నిర్మించడం చాలా అవసరమని, ఈ విషయాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. ఆయన గురువారం జిల్లాలోని తుంగభద్ర డ్యాంను పరిశీలించారు. అనంతపురం జిల్లాకు నీరు సక్రమంగా అందడం లేదంటూ హెచ్ఎల్సీ ఈఈ ఇంగళగి, ఎస్డీఓ వెంకటరామయ్యలకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు ప్రతి రోజు 1200 క్యూసెక్కుల నీరు చేరుతున్నందున దామాషా ప్రకారం నీరు చేరుతుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా అనంతపురం జిల్లాకు 32.5 టీఎంసీలు నీరు అందాల్సి ఉండగా, 24 టీఎంసీల కన్నా ఎక్కువ నీరు చేరడం లేదని గుర్తు చేశారు. అందువల్ల జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి తుంగభధ్ర డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 207 టీఎంసీలు నది ద్వారా బయటకు వెళ్తోందన్నారు. ఆ నీరు వృథాగా వెళుతున్నప్పుడు అనంతపురం జిల్లాకు నీరు ఉపయోగించుకునే విధంగా సమాంతర వరద కాలువ నిర్మాణంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కాలువతో కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు మేలు జరుగుతున్నందున ఇరు రాష్ట్రాలు సమ్మతిస్తాయనే నమ్మకం ఉందన్నారు. ఈ ఏడాది హెచ్ఎల్సీ ద్వారా 32 టీఎంసీలతోపాటు అదనంగా 10 టీఎంసీలు సరఫరా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం హెచ్ఎల్సీ పరిధిలో నానాయకట్టు ఎక్కువగా ఉన్నందున ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అధికారులు తగిన చొరవ తీసుకుని అక్రమ ఆయకట్టు దారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఏడాది వర్షాలు బాగా పడుతున్నందున హెచ్ఎల్సీ ద్వారా పీఏబీఆర్, ఎంపీఆర్ డ్యాంలకు పూర్తి స్థాయిలో నీరు అందే విధంగా హెచ్ఎల్సీకి నీరు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తుంగభద్ర డ్యాం నుంచి 207 టీఎంసీలు నీరు నది ద్వారా బయటకు వెళ్లిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. హెచ్ఎల్సీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే రూ.460 కోట్లు, ఎల్ఎల్సీకి రూ.1000 కోట్లు, డ్యాం మరమ్మతులకు రూ.260 కోట్ల నిధులు కావాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు నిధులు విడుదలయ్యే విధంగా ఇరు రాష్ట్రాల సీఎంలు సంసిద్ధత వ్యక్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, సీపీఐ సీనియర్ నాయకులు ఎం.వీ.రమణ, జిల్లా సీపీఐ నాయకులు కాటమయ్య, మల్లికార్జున, హంపాపురం నాగరాజు, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.