సాక్షి,బళ్లారి : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తాగు, సాగు నీరందించే తుంగభద్ర డ్యాం పరిధిలోని హెచ్‌ఎల్‌సీకి సమాంతర వరద కాలువలను నిర్మించడం చాలా అవసరమని, ఈ విషయాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్షుడు రామకృష్ణ అన్నారు. ఆయన గురువారం జిల్లాలోని తుంగభద్ర డ్యాంను పరిశీలించారు. అనంతపురం జిల్లాకు నీరు సక్రమంగా అందడం లేదంటూ హెచ్‌ఎల్‌సీ ఈఈ ఇంగళగి, ఎస్‌డీఓ వెంకటరామయ్యలకు ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు ప్రతి రోజు 1200 క్యూసెక్కుల నీరు చేరుతున్నందున దామాషా ప్రకారం నీరు చేరుతుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా అనంతపురం జిల్లాకు 32.5 టీఎంసీలు నీరు అందాల్సి ఉండగా, 24 టీఎంసీల కన్నా ఎక్కువ నీరు చేరడం లేదని గుర్తు చేశారు. అందువల్ల జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈసారి తుంగభధ్ర డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 207 టీఎంసీలు నది ద్వారా బయటకు వెళ్తోందన్నారు. ఆ నీరు వృథాగా వెళుతున్నప్పుడు అనంతపురం జిల్లాకు నీరు ఉపయోగించుకునే విధంగా సమాంతర వరద కాలువ నిర్మాణంపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కాలువతో కర్ణాటకలోని బళ్లారి జిల్లాకు మేలు జరుగుతున్నందున ఇరు రాష్ట్రాలు సమ్మతిస్తాయనే నమ్మకం ఉందన్నారు. ఈ ఏడాది హెచ్‌ఎల్‌సీ ద్వారా 32 టీఎంసీలతోపాటు అదనంగా 10 టీఎంసీలు సరఫరా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుతం హెచ్‌ఎల్‌సీ పరిధిలో నానాయకట్టు ఎక్కువగా ఉన్నందున ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అధికారులు తగిన చొరవ తీసుకుని అక్రమ ఆయకట్టు దారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఏడాది వర్షాలు బాగా పడుతున్నందున హెచ్‌ఎల్‌సీ ద్వారా పీఏబీఆర్, ఎంపీఆర్ డ్యాంలకు పూర్తి స్థాయిలో నీరు అందే విధంగా హెచ్‌ఎల్‌సీకి నీరు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తుంగభద్ర డ్యాం నుంచి 207 టీఎంసీలు నీరు నది ద్వారా బయటకు వెళ్లిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు.
హెచ్‌ఎల్‌సీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే రూ.460 కోట్లు, ఎల్‌ఎల్‌సీకి రూ.1000 కోట్లు, డ్యాం మరమ్మతులకు రూ.260 కోట్ల నిధులు కావాల్సి ఉంటుందన్నారు. ఆ మేరకు నిధులు విడుదలయ్యే విధంగా ఇరు రాష్ట్రాల సీఎంలు సంసిద్ధత వ్యక్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్, సీపీఐ సీనియర్ నాయకులు ఎం.వీ.రమణ, జిల్లా సీపీఐ నాయకులు కాటమయ్య, మల్లికార్జున, హంపాపురం నాగరాజు, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
హెచ్చెల్సీకి సమాంతర వరద కాలువ అవసరం
Published Fri, Sep 6 2013 2:09 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement
Advertisement