తునికాకు.. సేకరణ ఏ మేరకు?
పాల్వంచ రూరల్: వేసవిలో గిరిజన, గిరిజనేతర కూలీలకే కాకుండా అటవీశాఖకు ఆదా యం సమకూర్చిపెట్టే తునికాకు సేకరణకు రంగం సిద్ధమైంది. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో తునికాకు సేకరణ ఆశించిన రీతిలో సాగలేదు. అయితే ఈ సారి పరిస్థితులు మెరుగుపడడంతో ఆకు సేకరణపై గిరిజను లు ఆశలు పెంచుకున్నారు. ఈ ఏడాది పాత పది జిల్లాలకు గాను ఎనిమిది జిల్లాల (నల్ల గొండ, హైదరాబాద్ మినహా) పరిధిలోని 242 యూనిట్లలో 195 యూనిట్లలోనే తుని కాకు టెండర్ల ప్రక్రియ జరిగింది.
మిగతా యూనిట్లకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్ల ప్రక్రియ నిలిచిపోయింది. ఆకు నాణ్యత ఆధారంగా భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలో 50 ఆకుల కట్టకు రూ.2.50 చెల్లించడానికి నిర్ణయం తీసుకోగా, మిగిలిన జిల్లాల్లో రూ.2.05 చెల్లించనున్నట్లు తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ అధికారు లు వెల్లడించారు. తునికాకు సేకరణ ద్వారా ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు రెండు నెలల పాటు ఉపాధి లభిస్తుంది. సీజన్ మొత్తంలో ఈ పని ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా.
పూర్తయిన టెండర్ల ప్రక్రియ
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,41,700 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరించాలని అటవీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గత నెలలోనే ఆన్లైన్ ద్వారా టెండర్ల ప్రక్రియ పూర్తయింది. గతేడాది 2,41,600 స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరించాలని లక్ష్యం నిర్దేశించుకున్నా.. కరోనా తదితర కారణాలతో లక్ష్యాన్ని చేరుకోలేదు. కేవలం 1,60,460 బ్యాగులే సేకరించగలిగారు. ఈ సారి పరిస్థితులు కొంత మెరుగ్గా ఉండడంతో లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
రెండేళ్లుగా పూర్తికాని లక్ష్యం
రెండేళ్లుగా తునికాకు సేకరణ లక్ష్యం మేరకు జరగడం లేదు. గత ఏడాది తునికాకు టెండ ర్ల ప్రక్రయలో జాప్యం జరగడం, కాంట్రాక్టర్లు సకాలంలో ఆకుల్లోని వ్యర్థాలను శుభ్రం చేయకపోవడం ఓ కారణమని తెలుస్తోంది. దీనికి తోడు కరోనా కారణంగా ఆకు సేకరణకు గిరిజనులు పెద్దగా ఆసక్తి చూప లేదు.
అలాగే, గిరిజనులు ఉపాధి హామీ పనులకు వెళుతుండడం, అడవుల్లో పోడు సాగు కారణంగా తునికాకు చెట్లు అంతరించిపోవడం, తునికాకు కట్ట ధర గిట్టుబాటు కాకపోవడం వంటి కారణాలతో లక్ష్యం నెరవేరడం లేదని చెపుతున్నారు. అలాగే ఎండాకాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవుల్లో ప్రమాదకర ప్రదేశాల్లో ఆకు సేకరించడం కంటే సులభంగా ఉండే ఉపాధి పనులకు వెళ్తే రూ.250 కూలి వస్తుందని గిరిజనులు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
స్టాండర్డ్ బ్యాగ్ అంటే..
ఒక్కో కట్టలో 50 ఆకులు ఉంటాయి. ఇలాంటివి వెయ్యి కట్టలు కలిపితే ఒక స్టాండర్డ్ బ్యాగ్ అవుతుంది.
కూలీలు ఆసక్తి చూపడం లేదు..
తునికాకు సేకరణ క్రమంగా తగ్గిపోవడానికి గిరిజనులు, గిరిజనేతరులు పెద్దగా ఆసక్తి చూపకపోవడమే కారణం. ఉపాధి హామీ పనులకు వెళ్తే ఎక్కువ కూలీ దక్కుతుందని వారు భావిస్తున్నారు. తునికాకు సేకరణలో శ్రమకు తగిన ఫలితం రావడం లేదనే భావన గిరిజనుల్లో ఉంది.
– కట్టా దామోదర్‌రెడ్డి, వైల్డ్‌లైఫ్ విభాగం ఎఫ్డీఓ, పాల్వంచ