కప్.. కప్.. హుర్రే!
క్రికెట్ వరల్డ్ కప్ సీజన్‌పై టీవీ, డీటీహెచ్ కంపెనీల కన్ను
* సొమ్ము చేసుకునే ప్రణాళికలు
* పోటాపోటీ ఆఫర్లకు రెడీ..!
న్యూఢిల్లీ: డీటీహెచ్ ఆపరేటర్లు, టీవీ తయారీ సంస్థలు దాదాపు 45 రోజులు జరగనున్న (ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 వరకు) క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్ సందర్భంగా కస్టమర్లను ఆకర్షించటానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. వివిధ ఆఫర్లతో ఎలాగైనా అమ్మకాలను పెంచుకోటానికి సన్నద్ధమౌతున్నాయి. పానాసోనిక్, ఎల్జీ వంటి ఎలక్ట్రానిక్ కంపెనీలతోపాటు డిష్ టీవీ, టాటా స్కై, వంటి డీటీహెచ్ ఆపరేటర్లు వారి వారి వ్యాపారంపై ధీమాగా ఉన్నారు.
‘ఆటపై కస్టమర్ల ఉత్సాహం, మా కంపెనీ ఉత్పత్తులపై వారికి ఉన్న విశ్వా సంతో ఈ టోర్నమెంట్ సీజన్ లో కంపెనీ ఉత్పత్తుల విక్రయాల్లో దాదాపు 25 నుంచి 30 శాతం వృద్ధిని నమోదు చేస్తాం’ అని పానాసోనిక్ ఇండియా, దక్షిణాసియా మేనేజింగ్ డెరైక్టర్ మనీష్ శర్మ అన్నారు. ఫ్రీ ఆడియో ఉత్పత్తులు, స్క్రాచ్ కార్డులు, క్యాష్ బ్యాక్, తదితర ఆఫర్లతో ఎల్జీ కస్టమర్లను ఆకర్షించనుంది. ‘ప్రత్యక్షంగా, పరోక్షంగా కస్టమర్లకు దగ్గరవ్వటానికి వరల్డ్ కప్ సీజన్ మాకు చాలా దోహదపడుతుంది. వారికోసం వివిధ ఆఫర్లను తీసుకొస్తున్నాం’ అని ఎల్జీ ఇండియా బిజినెస్ హెడ్ సంజయ్ చిత్కారా చెప్పారు. కంపెనీ ఈ ఏడాది హై ఎండ్ ఆల్ట్రా హెచ్డీ, ఓలెడ్ టీవీ శ్రేణుల్లో అధిక వృద్ధికి ప్రణాళికల్ని రచించిందని తెలిపారు.
‘రీప్లేస్మెంట్’పై ఎల్జీ, పానాసోనిక్ దృష్టి
ఎల్జీ, పానాసోనిక్ కంపెనీలు రీప్లేస్మెంట్ మార్కెట్‌పై కూడా కన్నేశాయి. ‘రీప్లేస్మెంట్ మార్కెట్లో 12-15% వృద్ధి ఉంటుందని భావిస్తున్నాం. ఈ టోర్నమెంట్ సీజన్ లో 24 అంగుళాలు నుంచి 32 అంగుళాల సెగ్మెంట్లో పానాసోనిక్ 25% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుందని శర్మ చెప్పారు. 5 పట్టణాల ట్రోఫీ టూర్, సంతకపు బ్యాట్ ప్రచారం, తదితర వాటితో ఎల్జీ తన టీవీ అమ్మకాల్లో వృద్ధిని నమోదుచేయాలని ప్రయత్నిస్తోంది. తాము ప్రకటించబోయే వివిధ ఆఫర్లతోపాటు ఎల్జీ టీవీలను కొనుగోలు చేయటం ద్వారా వచ్చే ప్రయోజనాలను కస్టమర్లకు తెలియజేయటానికి టీవీ, ప్రింట్ ప్రచారాలు చాలా దోహదపడతాయని చిత్కారా చెప్పారు.
అమ్మకాల వృద్ధికి డీటీహెచ్ ఆపరేటర్ల ప్రణాళిక
ఈ టోర్నమెంట్ సీజన్లో తమ వ్యాపారాన్ని పెంచుకోటానికి డిష్ టీవీ, టాటా స్కై వంటి డీటీహెచ్ ఆపరేటర్లు కూడా వివిధ ప్రత్యేక ఆఫర్లతో ముందుకురానున్నాయి. ‘ఎప్పుడూ కూడా వరల్డ్ కప్ వంటి అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్ సీజన్లో కొనుగోళ్లలో అధిక వృద్ధి ఉంటుంది. ఇతర కంపెనీల పోటీ కారణంగా మాకు గరిష్ట హెచ్డీ, స్పోర్ట్ చానళ్లను వినియోగదారులకు అందించే ప్రయోజనం కలిగింది’ అని డిష్ టీవీ సీఓఓ సలిల్ కపూర్ అన్నారు. హెచ్డీని ప్రోత్సహించటానికి తగిన ప్రణాళికల్ని రచిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నమెంట్ సమయంలో 4కే సెట్-టాప్ బాక్స్‌తో తమ అమ్మకాలను పెంచుకోవాలని టాటా స్కై భావిస్తోంది. ఈ బాక్స్‌తో టీవీలో స్పష్టమైన చిత్రాలను చూడవచ్చు.