హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలు శిక్ష
లేపాక్షి : హత్యాయత్నం కేసులో ఇద్దరికి మూడు నెలల జైలు శిక్ష పడింది. ఇందుకు సంబంధించిన వివరాలను లేపాక్షి ఎస్ఐ శ్రీధర్ శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. హిందూపురం మండలం ఎం.బీరేపల్లికి చెందిన హనుమంతరెడ్డికి నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. అన్నదమ్ములందరూ కలిసి ఒక ట్రాక్టర్ కొనుగోలు చేశారు. అందరిలోకీ హనుమంతరెడ్డి పెద్దవాడు కావడంతో ఆ ట్రాక్టర్‌ను, కొంత ఆస్తిని ఉమ్మడిగా కొనుగోలు చేసి ఆయన పేరిటే ఉంచారు. హనుమంతరెడ్డి ఎవరికీ తెలియకుండా 2014లో ట్రాక్టర్‌ను ఇతరులకు విక్రయించాడు.
అమ్మేసిన ట్రాక్టర్‌ను లేపాక్షి మండలం లక్కేపల్లి మీదుగా తీసుకెళుతుండగా హనుమంతరెడ్డి తమ్ముడు క్రిష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు అడ్డగించారు. తమను అడ్డగించారనే కోపంతో హనుమంతరెడ్డి, మారుతీరెడ్డిలు ఇనుపరాడ్లతో కృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలపై దాడిచేసి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. హనుంమతరెడ్డి, ఆయన కుమారుడు మారుతీరెడ్డిలపై నేరారోపణ రుజువు కావడంతో పెనుకొండ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు వారికి మూడు నెలల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించినట్లు లేపాక్షి ఎస్ఐ శ్రీధర్ తెలిపారు.